టీకాలనగానే ముందు చిన్న పిల్లలు గుర్తుకొచ్చేమాట నిజమే గానీ పెద్దలకు ముఖ్యంగా వృద్ధులకు కూడా కొన్ని టీకాలు అవసరం. టీకాలు అనేవి కేవలం పిల్లలకే కాదు … పెద్దలకు కూడా వేయించాల్సినవి ఉంటాయి. వ్యాక్సిన్ అనేది వ్యాధి నివారణ మందు. వీటిని తీసుకోవడం వల్ల మనకు వచ్చే అనేక రకాల వ్యాధుల బారిపడకుండా తప్పించుకోవచ్చు. అసలు ప్రస్తుతం పెద్ద వాళ్ళకు ఏయే వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి.
సాధారణంగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకు అనే అనుకుంటుంటారు. అయితే పెద్దవాళ్లకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి శక్తియుక్తులను మళ్లీ బలోపేతం చేసేందుకు వాటిల్లో కొన్నింటిని 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి నిర్మూలించే వ్యవస్థ వ్యాధి నిరోధక వ్యవస్థ . ఈ వ్యవస్థ ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. సాధారణంగా టీకాలు రెండు రకాలు ఒకటి సంప్రదాయక, రెండోది ఆధునిక టీకాలు. సంప్రదాయక టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఈ టీకాలను అందించటం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధి కారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది.
పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లు ప్రస్తుతం మకు అందుబాటులో ఉన్నాయి.హెపటైటిస్–ఏ అనే వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. అలాగే హెపటైటిస్–బి వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆ తర్వాత మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులంతా దీన్ని తీసుకోవడం మంచిది.
వ్యారిసెల్లా జోస్టర్ అనే ఈ వైరస్ మనం సాధారణంగా చికెన్‌పాక్స్ అని పిలిచే వ్యాధిని కలిగిస్తుంది. వారిసెల్లా వ్యాక్సిన్ పెద్దవారిలో చికెన్ పాక్స్‌నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే గర్భవతులు కూడా తీసుకోకూడదు. వయసు పైబడిన వారిలో స్ట్రెప్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియా కారణంగా నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి.
ప్రతి ఏడాదీ చాలా మంది కొన్ని వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే వీటిలో చాలావరకు నివారించగలిగేవే. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. మన వయసు పెరుగుతున్నకొద్దీ, మన వృత్తిని బట్టీ, ఆరోగ్యపరిస్థితి, దేహతత్వాన్ని బట్టి కొన్ని జబ్బుల్లో రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ నివారించడం కోసం వ్యాక్సిన్లతో వ్యాధులను నిరోధించడం చాలా తేలిక. 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, కాస్త బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారికి, 65 ఏళ్ల వయసు దాటాక మరికొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది.అలాంటి వారిలో ఈ వాక్సిన్లతో ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. యుక్తవయసు దాటాక, పెద్ద వయసులో ప్రవేశించే ప్రతివారూ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి వారికి రక్షణ కలగడంతో పాటు… ఆ వ్యాధులు ఇతరులకు వ్యాపించకుండా కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడాన్నే వ్యాక్సిన్ అంటారు. వ్యాక్సిన్ ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా కాపాడుతుంది. ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో అన్ని రకాల టీకాలను ఉచితంగా అందిస్తోంది. దాదాపు పూర్తి సురక్షితంగా చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు.