మధుమేహం అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. ఏటేటా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారం వ్యక్తంచేస్తున్నది. మారుతున్న మన జీవనశైలి కారణంగా విస్తరిస్తున్న మధుమేహం సమస్య తలెత్తినప్పుడు నోటి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నోటి ఆరోగ్యంపై మధుమేహం ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
మధుమేహం లేదా చక్కర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు . మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో వుండటం . ఇది వ్యాధి కాదు. శరీరం లో ఇన్సులిన్ తగ్గడం వల్ల ఏర్పడే అసమానత. సాధారణంగా రక్తంలో గ్లూకోస్ 100 మి.గ్రా /డె.లీ వుండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లు భావించాలి.
ఇన్సులిన్ తక్కువగా స్రవించబడినా, సరిపడా స్రవించబడినప్పటికి సక్రమంగా పనిచేయలేకపోవడంవలన రక్తంలోని గ్లూకోస్.. కణాలలోకి గ్రహించబడదు . ఫలితంగా చక్కెర వ్యాధి మనల్ని పీడిస్తుంది. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయి. తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా గుండె సమస్యలు, కిడ్నీల బలహీనత, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, గాయాలు త్వరగా మానకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
మధుమేహం వలన మీ రక్తంలో ఏర్పడిన, చక్కెర అని కూడా పిలువబడే గ్లూకోజ్, చాలా ఎక్కువ వుండడం అనేది మీ నోటిలో నొప్పి, ఇన్ఫెక్షన్, మరియు ఇతర సమస్యలకు కారణమవగలదు. లాలాజలంలోని అధిక గ్లూకోజ్ స్థాయిలతో హానికరమైన బాక్టీరియా పెరిగి ఆహారంతో కలిసి అతుక్కోనే పొరను ఏర్పరుస్తాయి. ఫలితంగా దంత క్షయం లేదా ఖాళీలేర్పడి చిగురు వ్యాధి రావడానికి , చెడు శ్వాస రావడానికి కారణమవుతాయి. చిగుర్లు వాపులు రావడం, పెరియోడాంటిస్, కాన్డిడియాసిస్ అని పిలిచే గొంతు సమస్యలు, పొడి బారిన నోరు, నోటిలో మంట వంటి సమస్యలు కనిపిస్తాయి. మధుమేహాన్ని నివారించుకొనేందుకు తీసుకొనే ఇన్సులిన్ కారణంగా కీటోన్ ల ఉత్పత్తి పెరిగిపోయి నోటి నుండి దుర్వాసన వెలువడుతుంది.
రోజూ తప్పనిసరిగా రెండు సార్లు దంతాలను తోముకోవాలి. పంచదార తక్కువగా తీసుకోవాలి. క్లీనింగ్ మరియు చెకప్ కోసం సంవత్సరానికి రెండుసార్లు దంతవైద్యుడిని చూడడం చాలా ఉత్తమం. ధూమపానం మరియు మధుమేహం ఒక ప్రమాదకరమైన కలయిక. ధూమపానం అనేక మధుమేహ సమస్యలకు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని వెంటనే స్మోకింగ్ మానేయాలి. ప్రతీ రోజు బ్రష్ చేసుకోవడం మరియు ఫ్లాస్ తో శుభ్రం చేసుకోవడం ముఖ్యం.
కట్టుడు పళ్ళను శుభ్రపరచడం, రాత్రి పూట కట్టుడు పళ్ళను తొలగించడం వల్ల నోటి దుర్వాసన నుంచి బయటపడొచ్చు. లాలాజలం ప్రసరణను పెంచడానికి చక్కరలేని గమ్ లేదా మింట్స్ ఉపయోగించాలి. తరుచూ కొద్దికొద్దిగా నీరు ఎక్కువసార్లు తాగడం చేయాలి. నోటిని పొడిబారేలా చేసే ఆహారాలను గుర్తించి మానుకోవాలి. కెఫిన్ ఉండే పానీయాలు, మద్యం తీసుకోవడం మానుకోవాలి.
శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపే మధుమేహ లక్షణాలు కనిపించగానే.. నోటి ఆరోగ్యంపై దృష్టిసారించాలి. నోరు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మరిని నోటి సమస్యలను దూరంగా పెట్టవచ్చు. సో నోటి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.