వర్షకాలం మొదలైంది. ఈ పరిస్థితుల్లో ముప్పిరిగొనే అనే సమస్యల్లో నిమోనియా కూడా ఒకటి. చూడడానికి సమస్య చిన్నదే అయినా సకాలంలో గుర్తించక ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నిమోనియాకు కారణాలేంటి, ఈ సమస్యను ఎలా గుర్తించాలి.
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఈ వ్యాధి అనేక సమస్యలకు కారణం అవుతుంది. నిజానికి మన శరీరంలో శ్వాస క్రియకు ఊపిరితిత్తులే కీలకం. క్షణం ఖాళీ లేకుండా ఎప్పుడూ మనం శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనిషి జీవించి ఉంటాడు. నిమోనియా వ్యాధి ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్న పిల్లలు మొదలుకుని, అరవై ఏళ్ళు దాటిన వృద్ధుల వరకూ అందరిలోనూ కనిపించవచ్చు. చిన్న పిల్లల్లో, వయసు పైబడ్డ వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వారికి సమస్య త్వరగా సోకుతుంది.
ఎలాంటి లక్షణాల ద్వారా నిమోనియాను గుర్తించవచ్చు ?
- నిమోనియా కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ప్రారంభంలోనే గుర్తించి, సరైన చికిత్స తీసుకోగలిగితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, చలిగా ఉండడం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు ఎదురౌతాయి. అలాగే కొందరిలో కఫం ఉండవచ్చు, మరికొందరిలో లేకపోవచ్చు.
ఊపిరితిత్తి పొర ఫ్లూరాకు నిమోనియా చేరినప్పుడు ఛాతీ నొప్పి కూడా రావచ్చు. నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూడా బాధిస్తుంది. దీంతో పాటు ఆస్తమాలో ఉండే పిల్లకూతలు, నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా లోపలిక వెళ్ళక, గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలి సంచిలోని ఎగ్జుడస్ అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు. ఊపిరి అందక నుదుటి మీద చెమట, కంగారు, గుండె వేగం పెరగడం, డీలా పడ్డం, బీపీ పడిపోవడం లాంటి సమస్యలు ఎదురైతే దాన్ని సివియర్ నిమోనియాగా చెబుతారు. కొందరు రోగుల్లో ఛాతీలో నొప్పి కూడా రావచ్చు.
ఏవైనా ఇతర కారణాల వల్ల నిమోయనియాకు చికిత్స తీసుకోకపోతే సమస్య మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మక్రిముల వల్ల నిమోనియా సమస్య ఎదురౌతుంది. రోగిలో కనిపించే లక్షణాల బట్టి ఈ వ్యాధిని నిర్థారిస్తారు. సి.బి.పి, సి- ఎక్స్ రే వంటి పరీక్షలతో పాటు, ఛాతీ సిటి స్కాన్, కఫం పరీక్షలు లాంటి వాటి ద్వారా సమస్యలను నిర్థారిస్తారు. ఈ సమస్యకు యాంటీబయాటిక్ తో చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఎవరికైనా మూడురోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని, నిమోనియా సమస్య ఉంటే చికిత్స తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం లాంటివి మానేయాలి. బయటి వాతావరణంలో పొగకు దూరంగా ఉండాలి. దీంతో పాటు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.