Prostate Health: ప్రొస్టేట్‌ గ్రంధి ఆరోగ్యం ఎందుకు కీలకం..? పురుషుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి?

By manavaradhi.com

Updated on:

Follow Us
Prostate Health

ప్రోస్టేటు గ్రంథి వాపు .. వయసు పైబడుతున్న పురుషుల్లో కనిపించే సమస్య. వీర్యం ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈ గ్రంథి.. వయసు ముదిరిన తర్వాత ఉబ్బుతుంది. దీనివల్ల మూత్రం ఆపుకోలేక పోవటం, వెళ్లినా లోపలే ఉండిపోతుండటం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇదేమంత ప్రమాదకరమైంది కాకపోయినప్పటికీ కొద్దిమందిలో మాత్రం ప్రోస్టేటు క్యాన్సర్‌కు దారితీస్తుంది. కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. ప్రోస్టేట్ వాపుకి చికిత్సా పద్ధతులు అందు బాటులో ఉన్నాయి.

ప్రోస్టేట్ గ్రంథి అనేది పురుషుల్లో ముఖ్యమైన గ్రంథి. ఇది మూత్రాశయం కింద ఉసిరికాయ ఆకారంలో మూత్ర మార్గం చుట్టూ ఆవరించి వీర్యం ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సంతానానికి బీజాంకురాలుగా వృషణాల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు.. ఈ ప్రోస్టేటు గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. కానీ పురుషులకు వయసు పెరుగుతున్న కొద్దీ ఉబ్బటం.. తద్వారా మూత్ర విసర్జనలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిలో ప్రోస్టేటు గ్రంథి వాపు ఒకటి. ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తోంది.

ప్రోస్టేట్‌ గ్రంథి పెరిగితే, ఆ ప్రభావం ప్రధానంగా మూత్రాశయం మీద పడుతుంది. గ్రంథి పెరుగుదలను బట్టి లక్షణాల తీవ్రతలో హెచ్చుతగ్గులుంటాయి. ఈ గ్రంథి పెరగడం మూలంగా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పుడు మాత్రమే సమస్యగా పరిగణించి, చికిత్స మొదలుపెట్టాలి.

ప్రోస్టేట్ వాపుకి కారణాలు ఏంటి..?

పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి అనేది ఈ రోజుల్లో ఒక సాధారణ సమస్య. ప్రోస్తైటీస్ అంటే ప్రోస్టేట్ గ్రంధిలో వాపు అని అర్థం. ప్రోస్టేట్ సమస్యల కారణంగా సంక్రమణ, ప్రోస్టేట్ వ్యాకోచం లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఈ సంక్రమణ ప్రబలమైన మూత్ర ట్రాక్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుండి బదిలీ అవుతుంది. ఈ బ్యాక్టీరియ తర్వాత ప్రోస్టేట్ గ్రంధిని విస్తరించి నొప్పి , వాపును కలుగచేస్తుంది. ప్రోస్తైటీస్ వలన ప్రోస్టేట్ వ్యాకోచం లేదా అపాయం లేని ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదలకు కారణం కావచ్చు. ఇది ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసున్న పురుషులకు వస్తుంది.

ప్రోస్టేట్‌ సమస్యలు ఉన్నవారు తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్ర విసర్జన కష్టంగా ఉండటం, బొట్లుబొట్లుగా వస్తుండటం, మూత్రాన్ని ఆపులేకపోవటం వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని సహజంగా వచ్చే సమస్యే అని కొట్టిపారెయ్యకుండా తొలిదశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నతనం నుంచీ కొవ్వు తక్కువ తినటం, శాకాహారం, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినటం అలవాటు చేసుకోవాలి. 50 ఏళ్ల నుంచీ ఏటా తప్పనిసరిగా ‘పీఎస్‌ఏ’ రక్త పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.

ప్రోస్టేట్ వాపుకి చికిత్సా పద్ధతులు ఏంటి..?

ప్రొస్టేట్‌ గ్రంధి వాపు పరిమాణాన్ని అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. అదేవిధంగా యూరోప్లోమెట్రి విధానం ద్వారా మూత్రం ఎంత పరిమాణంలో విసర్జణమవుతోంది.? ఎంత వేగంగా వస్తోంది? అనే విషయాలు తెలుస్తాయి. ఈ లక్షణాలను బట్టి ఈ సమస్యను నిర్ధారించవచ్చు. ప్రొస్టేట్‌ గ్రంధి చికిత్సలో 80% మందికి మందులతోనే నయం అవుతుంది. మిగతా 20% మందికి మాత్రం సర్జరీ తప్పనిసరి. మూత్రంలో రక్తం పడుతుంటే ప్రొస్టేట్‌ గ్రంధిని పూర్తిగా తొలిగించాల్సి ఉంటుంది. దీనిని ట్రాన్స్‌ యూరేథ్రల్‌ రీసెక్షన్‌ ఆఫ్‌ ప్రొస్టేట్‌ (టీయూఆర్‌పీ) అంటారు. ఈ చికిత్స ద్వారా ప్రొస్టేట్‌ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. ప్రోస్టేట్‌ గ్రంథి పెరిగిన ప్రతి ఒక్కరికీ సర్జరీ అవసరం ఉండదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మందులతో సమస్య అదుపులోకి వస్తుంది. అలా కాకుండా మూత్రవిసర్జన జరగనప్పుడు, మూత్రవిసర్జనకు సంబంధించి సమస్య ఎక్కువై దైనందిన జీవితం ఇబ్బందిగా మారినప్పుడు సర్జరీ అవసరం పడవచ్చు.

మూత్రవిసర్జన పూర్తిగా జరగకుండా మూత్రాశయంలో మూత్రం మిగిలిపోవడం మూలంగా తరచుగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉన్నా, మధుమేహులై ఉండి జ్వరం బారిన పడుతున్నా తప్పనిసరిగా యూరాలజిస్ట్‌ను సంప్రతించాలి. ఇలాంటివారికి తీవ్రతను బట్టి లేజర్‌ సర్జరీ అవసరం పడుతుంది. 100లో 2 నుంచి 3 మందికి మాత్రమే ఈ సర్జరీ చేయాల్సి రావచ్చు. లేజర్‌ సర్జరీలో మూత్రవిసర్జన మార్గానికి అడ్డుపడుతున్న పెరిగిన ప్రోస్టేట్‌ గ్రంథిని కోసి తొలగిస్తారు. ఇది కోత లేని సర్జరీ.

ఈరోజుల్లో పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు అనేవి సాధారణ సమస్యగా మారాయి. ప్రోస్టేట్ గ్రంధిలో వాపు రావడమే ఈ సమస్యకు ముఖ్య కారణం. వయసు పెరుగుతున్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యను ఏ మాత్రం అశ్రద్ధ చేసీనా క్రమంగా అది ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్యకు దారితీయగలదు. కాబట్టి ఇబ్బందిగా మారుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

Leave a Comment