జీవనశైలి సరిగా లేని కారణంగా రకరకాల జబ్బులు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వీటన్నింటిలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకారి. మన అలవాట్ల కారణంగానే క్యాన్సర్ వ్యాధి మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
క్యాన్సర్ ను తలుచుకుంటే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. దీనికి ప్రధాన కారణం…చెడు అలవాట్లు, అపోహలు, అనుమానాలు, అవగాహన రాహిత్యం వల్లనేనని నిపుణులు చెప్తున్నారు. శరీరంలోని కణాలు క్రమబద్ధంగా విభజన చెందడంలో అదుపుతప్పడం వల్ల కణాలు క్షీణించకుండా సమూహం ఏర్పడి కణితిలా మారుతాయి. ఇవే క్యాన్సర్ వ్యాధికి దారితీస్తాయి. వీటిలో కొన్ని అపాయకరమైనవి, మరికొన్ని నిరాపాయకరమైనవి ఉంటాయి. అనువంశికత, జీవనశైలి, ఆహారపుటలవాట్లు, మద్యం సేవించడం, తంబాకు, సిగరెట్ అలవాట్లు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. క్యాన్సరును ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వచ్చే అపాయాన్ని కొంతవరకూ నివారించుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు, సన్నని ప్రోటీన్లు, తృణధాన్యాలు జంక్ ఫుడ్ కంటే ఎక్కువ బలాన్ని ఇస్తాయి. చికిత్స దుష్ప్రభావాలను నిర్వహించడానికి, బరువును పెంచడానికి, సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి. రోగనిరోధక వ్యవస్థకు అనుకూలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముడి ఆహారాలతో జాగ్రత్తగా ఉండండి. ఎల్లప్పుడూ పండ్లు, కూరగాయలను నీటితో బాగా కడగాలి. అల్ఫాల్ఫా మొలకలను దాటవేయండి. పాశ్చరైజ్డ్ ఉత్పత్తులను దూరం పెట్టాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఖనిజాలు సమతులంగా ఉండేట్లుగా చూసుకోవాలి. నిత్యం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా కొన్నిరకాల క్యాన్సర్లను తిరగబెట్టకుండా చూసుకోవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఏదో వ్యాపకం పెట్టుకోవాలి. నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, రచనలు చేయడం అలవాటుచేసుకోవాలి. అయితే వీటిపైనే సమయమంతా పెట్టకుండా చూడాలి.
క్యా న్సర్ వ్యాధికి గురైన వారు తాము ఎదుర్కొంటున్న రకం క్యాన్సర్ గురించిన విషయాలు తెలుసుకోవాలి. చికిత్స సమయంలో, చికిత్స తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకొని మసులుకొనేలా ప్రిపేర్కావాలి. మీరు ఎదుర్కొంటున్న క్యాన్సర్ గురించి కుటుంబసభ్యులతోగానీ, స్నేహితులతోగానీ, కౌన్సిలర్తోగానీ చర్చిస్తూ ఉండాలి. అధునాతన చికిత్సల గురించి తెలుసుకొంటూ వాటిని పొందేందుకు వీలు చేసుకోవాలి. ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్, హిప్నాటిజం, తైచీ, అరోమాథెరపీ వంటివి చేయాలి. వీలు చిక్కినప్పుడు అధీకృత నిర్వాహకులచే మసాజ్ చేసుకోవాలి. చికిత్స నిర్వహణకు ఖర్చు తడిసిమోపెడవుతున్నందున వ్యయంపై దృష్టిసారించాలి. కంటి నిండా నిద్రపోయేలా బెడ్రూంను సిద్ధం చేసుకోవాలి. నిద్రాభంగం కలుగకుండా చూసుకోవాలి. నిత్యం పరిశుభ్రంగా స్నానమాచరిస్తూ శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అదేవిధంగా శరీరంపై అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఎప్పుడూ పది మందితో కలిసి ఉండేలా కలివిడిగా ఉండటం ద్వారా సంతోషంగా మెలగవచ్చు.
దూమపానం, మద్యపానం పూర్తిగా మానుకోవాలి. పొగాకు నమలడం మంచిదికాదు. జీవనశైలిలో మార్పులు చేసుకొని పోషకాహారం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్యనిపుణులను సందర్శిస్తూ వ్యాధి, చికిత్సకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవడం చాలా ముఖ్యం