Health Tips : టీకాలతో చిన్నారుల ఆరోగ్యానికి రక్ష

By manavaradhi.com

Published on:

Follow Us
Vaccination

మారుతున్న జీవన విధానం కారణంగా పిల్లలు పుట్టుకతోనే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధుల పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం ఓ కారణమైతే, వ్యాధి నిరోధక టీకాల పట్ల తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలు మరో కారణం. వీటిని రూపు మాపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ శిశుమరణాలు తగ్గుముఖం పట్టడం లేదు. దీనికి ఏకైక పరిష్కారం వ్యాధి నిరోధక టీకాల మీద అవగాహనే. సాధారణంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులకు అడ్డు కట్ట వేయాలంటే దానికి ఏకైక మార్గం వ్యాక్సిన్.

సాధారణంగా ఇమ్యూనైజేషన్ లో రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఒకటి యాక్టివ్ ఇమ్యూనైజేషన్ కాగా, రెండోది ప్యాసీవ్ ఇమ్యూనైజేషన్. ఈ రెండూ కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాటం చేస్తాయి. యాక్టివ్ ఇమ్యూనైజేషన్ అంటే శరీరంలోకి వ్యాక్సిన్ ప్రవేశపెట్టి, ఆయా వ్యాధులకు సంబంధించిన యాంటీ బాడీస్ పెంచడమే. ప్యాసీవ్ ఇమ్యూనైజేషన్ లో నేరుగా యాంటీ బాడీస్ ను శరీరంలోకి ప్రవేశ పెడతారు.ఇవి నేరుగా శరీరంలో వ్యాధి కారక క్రిములతో పోరాటం చేస్తాయి. పాసివ్ ఇమ్యునైజేషన్ శక్తి తక్కువే అయినప్పటికీ, ఇది త్వరితంగా వ్యాధి మీద ప్రభావాన్ని చూపుతుంది.

పుట్టుకతోనే పిల్లలకు కొంత రోగ నిరోధక శక్తి ఉంటుంది. తల్లి పాల ద్వారా ఇది మరింత పెరుగుతుంది. వ్యాక్సినేషన్ చేయించడం ద్వారా ఎన్నో రకాల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రపంచ వ్యాధి నిరోధక దినోత్సవం ద్వారా, ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం పట్ల ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు వివిధ సంస్థలు పని చేస్తున్నాయి. నిజానికి ఈ వ్యాక్సిన్ ధర చాలా ఎక్కువ అయినప్పటికీ, ప్రభుత్వాలు ఎన్నో కోట్లు ఖర్చు చేసి, వీటిని ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాయి. అందుకే వీటిని ఇప్పింటే విషయంలో తల్లిదండ్రులు అస్సలు అశ్రద్ధ చేయకూడదు.

వ్యాధినిరోధక వ్యాక్సిన్ ను సరైన విధానంలో ఇప్పించకపోతే, పిల్లలు అనేక ఇతర సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. యాక్టివ్ కావచ్చు, ప్యాసివ్ కావచ్చు… ఈ రెండింటిలో దేన్ని ఇప్పించినా కచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలో ఇప్పించడం తప్పనిసరి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు కోర్సు మొత్తాన్ని ఇప్పించాలి. ఒక దాని తర్వాత ఒకటిగా దాడి చేసే వ్యాధుల బారి నుంచి పిల్లలను రక్షించడం, వారి వయసు, పిల్లలు వ్యాక్సిన్ తట్టుకోగల శక్తి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఏయే వయసులో ఏయే వ్యాక్సిన్ అందించాలనే విషయాన్ని నిర్ణయించారు. దాని ప్రకారం సమయం మించకుండా ఎప్పటికప్పుడు ఈ కోర్స్ ఇప్పించాలి.

పిల్లలకు అన్ని రకాల టీకాలు వేయాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణ వ్యాక్సిన్లను విస్మరిస్తే చిన్నారుల ఆరోగ్యానికి చేటని హెచ్చరిస్తున్నారు. దీని పట్ల అవగాహనతో పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు ఇప్పింటి, వారి భవిష్యత్ ను కాపాడుకుందాం.

Leave a Comment