Biopsy – బయాప్సీ ఎలా జరుగుతుంది? | క్యాన్సర్ కోసం బయాప్సీల రకాలు

By manavaradhi.com

Updated on:

Follow Us
biopsy test

క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల గురించి పూర్తి స్థాయిలో తెలియజేసే పరీక్షల్లో బయాప్సీ పరీక్ష ఒకటి. శరీరంలో కొంత భాగాన్ని తొలగించి, దాని మీద వ్యాధి తాలూకా ప్రభావం ఎంత ఉందో చేసే పరీక్షే బయాప్సీ. ఈ మధ్యకాలంలో ఈ తరహా పరీక్షలు బాగా తగ్గినప్పటికీ, దీని మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పటికీ… నేటికీ వ్యాధినిర్థారణలో బయాప్సీ పాత్ర ఎనలేనిది.

వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సమస్యలకు కొత్త పరిష్కారాలు కనుగొనలేకపోతోంది. ఇందులో వ్యాధినిర్థారణ పరీక్షలు చేయడం కత్తిమీద సామే అవుతోంది. ఈ క్రమంలో ఎంత అధునాతన పరీక్షలు అయినప్పటికీ వ్యాధినిర్థారణ కష్టసాధ్యంగా మారుతోంది. ఎక్స్ రేలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లు ఇలా ఎన్ని వచ్చినా వైద్యపరీక్షల్లో బయాప్సీకి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కిడ్నీ, లివర్, స్కిన్ క్యాన్సర్ వ్యాధుల్లో బయాప్సీ పరీక్ష ఎంతో కీలకంగా మారింది. రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు ఇతర పరీక్షలు చేసినప్పుడు… సమస్యలు ఉన్నాయని తెలిసినప్పుడు… ఆయా శరీర భాగాల్లో ఒక ముక్కను తీసి, దాన్ని లాబ్ కు పంపించాల్సి ఉంటుంది. అలా చిన్న ముక్కను తీసే ప్రక్రియనే బయాప్సీ అంటారు. ఇది చాలా సులువైన విధానం ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండానే చర్మం మీద నుంచి ఒక సూదిలాంటి దాని ద్వారా ఓ ముక్కను తీయవచ్చు. ఇది చాలా సులువైన విధానం, ఇది చాలా వరకూ పెద్ద సమస్యలేం లేని ప్రక్రియే అయినప్పటికీ కొన్ని సమయాల్లో మాత్రం ఇబ్బందులు తప్పవు.

సమస్య ఉన్న శరీర భాగం నుంచి ఒక చిన్న ముక్కను వేరు చేసే బయాప్సీ ప్రక్రియ ఎంతో సురక్షితమైనది. కొన్ని సున్నితమైన శరీర భాగాల నుంచి ముక్కను సేకరించేటప్పుడు కచ్చితంగా మత్తుమందు ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని భాగాలు మత్తు మందు ఇచ్చినప్పుడు పని చేయవు గనుక… అలాంటి వాటి విషయంలో కచ్చితమైన నిర్ధారణ కోసం మత్తుమందు ఇవ్వకుండా ముక్కను సేకరిస్తారు. ఇలా సేకరించిన ముక్కను ఆయా వ్యాధులకు సంబంధించిన నిపుణులైన పాథాలజిస్ట్ లకు పంపుతారు. వారు దాన్ని కావలసిన విధంగా ప్రిపేర్ చేసి, మైక్రోస్కోప్ కింద పరీక్షించడంతో పాటు… ఆ ముక్కకు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధుల నిర్థారణలో కీలకమైన, కచ్చితమైన నిర్థారణ సాధ్యమౌతుంది. ఈ విధానం ద్వారా 99 శాతం కచ్చితంగా వ్యాధి నిర్థారణ చేసే వీలుంటుంది.

బయాప్సీ చాలా సులువైన, సురక్షితమైన విధానంలాగా కనిపించినప్పటికీ ఇందులో ఎన్నో సమస్యలు సైతం లేకపోలేదు. ముక్క తీసేందుకు నిపుణులైన వారు అవసరం. ఎంతో సున్నితమైన ఈ ప్రక్రియలో కచ్చితమైన స్థానం నుంచి ముక్కను వేరు చేయాల్సి ఉంటుంది. అలా గాక మరో చోట నుంచి ముక్కను తీయడం లాంటివి జరిగితే మాత్రం… మళ్ళీ మళ్ళీ ముక్కను తీయవలసి ఉంటుంది. కొన్ని సార్లు ముక్కను తీయడంలో బ్లీడింగ్ ఎక్కువ జరిగి ప్రాణాపాయ స్థితికి వెళ్ళే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇంకొన్ని సందర్భాల్లో షుగర్ పేషెంట్లలో ఈ తరహా పరీక్షలు చాలా ప్రమాదకరమైనవి. ఒక్కోసారి రక్తనాళాల మీదకు వెళ్ళిందటే… ఇక ఆసలు సమస్య అలా ఉంచి… కొత్త సమస్యలు ప్రారంభం అవుతుంటాయి. బయాప్సీ సమయంలో నొప్పిని తట్టుకోవడం కూడా చాలా కష్టం. అందుకే ఈ విధానం పట్ల చాలా మంది పెదవి విరుస్తుంటారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే బయాప్సీ పట్ల ఆసక్తి చూపుతారు.

ఏ పరీక్షలో అయినా చిన్న చిన్న సమస్యలు లేకుండా ఉండవు. వాటిని పక్కన పెడితే… క్యాన్సర్ లాంటి వ్యాధుల నిర్థారణలో బయాప్సీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కొన్ని సార్లు శరీరం మీద వచ్చే గడ్డలు.. క్యాన్సరేమో అన్నంత భయాన్ని కలిగిస్తాయి. ఇతర కారణాల వల్ల కూడా ఈ తరహా కణితులు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో వాటికి చేసే బయాప్సీ పరీక్షలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అదే విధంగా ప్రమాదం లేని కణితుల్ని గుర్తించేందుకు కూడా బయాప్సీ ఎంతగానో సహాయపడుతుంది.

వ్యాధులకు సంబంధించి అన్ని సమయాల్లోనూ బయాప్సీ పరీక్షలు చేయవలసిన అవసరం ఉండదు. ఈ మధ్యకాలంలో రక్తపరీక్ష ద్వారానే క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని నిర్ధారించే పరీక్షలు వచ్చేశాయి. పరిస్థితి చేయి దాటిన సమయంలో ఓ మార్గంగా మాత్రమే బయాప్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా సరే సమస్య వచ్చినప్పుడు డాక్టరు ను సంప్రదిస్తే… ఆయన సూచిస్తే మాత్రం ఈ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. కొన్ని సార్లు రెండో విధమైన పరీక్షల్లోనూ బయాప్సీ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకే కొన్ని ఇబ్బందులు తప్పకపోయినా… ఈ తరహా పరీక్షల వైపు వైద్యులు మొగ్గు చూపుతున్నారు.

Leave a Comment