మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడో.., ఆపదలో ఉన్నప్పుడో.., భయపడినప్పుడో కాళ్లు, చేతులు వణుకుతుంటాయి. కానీ ఏ తప్పు చేయనప్పుడు, సాధారణ పరిస్థితుల్లో కూడా చేతులు వణికిపోతుంటే.., కాఫీ కప్పు పట్టుకోవడం కూడా అసాధ్యంగా మారితే… అది ఖచ్చితంగా అనారోగ్యంగానే భావించాలి. యాభై ఏళ్ల తరువాత ఇలాంటి వణుకుడు సమస్య కాస్త అర్ధం చేసుకోవచ్చు. కానీ యువకుల్లో కూడా కనబడుతుంటే ఖచ్చితంగా జాగ్రత్తపడాల్సిందే. చేతులు వణకడం లాంటి సమస్యలు ఎందుకు వస్తాయి.
శరీరంలో అన్ని అవయవాలు ఉండటమే కాదు.. అవన్నీ మనిషి ఆధీనంలో ఉండాలి. అప్పుడే ఉపయోగం. అంతేగానీ, అవయవాలున్నా అవి వాటంతట అవే కదులుతూ ఉంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేతులు వణకడం, కాళ్లు తడబడటం, మాట నత్తిగా రావడంలాంటివి అనేక ఇబ్బందులకు గురిచేస్తాయి. ఎదుటివ్యక్తికి ఇవి పెద్ద సమస్యల్లా అనిపించకపోవచ్చు. కానీ శరీరంలో అవయవాలు తమ ఆధీనంలో లేకపోవడం అనేక రకాలుగా అసహానానికి గురిచేస్తుంది. నిజానికి చేతులు వణకడం అనేది రోగం కాదు. రోగ లక్షణం మాత్రమే. శరీరంలో ఉండే అనారోగ్యానికి సూచనగా చేతులు, కాళ్లు వణుకుతుంటాయి.
సాధారణంగా నరాలకు సంబంధించిన సమస్యల్లో ఈ వణుకుడు లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చిన్నపాటి వణుకుడు గురించి ఆందోళన అక్కర్లేదు. మానసికంగా ఇబ్బంది పడినప్పుడు, కోపం వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు ఇతర తీవ్ర భావోద్వేగాలకు గురైనప్పుడు శరీరంలో అవయవాలు వణుకుతుంటాయి. ఇది సాధారణమే. దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే మామూలు సమయంలో కూడా చేతులు వణుకుతుంటే సందేహించాల్సిందే. చిన్నపిల్లల్లో చాలామందికి పరీక్షలంటే భయముంటుంది. కొందరు టీచర్ని చూస్తేనే హడలెత్తిపోతారు. మరికొంతమంది బల్లి, కప్ప లాంటి చిన్న చిన్న జంతువుల్ని చూసి భయపడతారు. అలాంటి సమయాల్లో నిలువెల్లా వణికిపోవడం సహజం. ఆ తరువాత కాసేపట్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. కాబట్టి ఆయా సమయాల్లో వచ్చే వణుకు గురించి వైద్యమేమీ అక్కర్లేదు.
మామూలు సమయంలో కూడా కొంతవరకు కంపనాలు సాధారణమే. అంటే చేతులు నిటారుగా చాచినప్పుడు కొంత వణికినట్టు అనిపించడంతో ఇబ్బందేమీ లేదు. అయితే ఆ వణుకుడుతో పెన్ను, తేలికపాటి పుస్తకం, కాఫీ కప్పు లాంటి తేలికైన వస్తువులు కూడా పట్టుకోలేకపోతే సమస్య ఉన్నట్టుగా భావించవచ్చు. అలాంటి సందర్భాల్లో వైద్యుడ్ని సంప్రదించాలి. మనిషిలో ఏ శరీర అవయవం ఏ పని చేయాలి అనేది అనుక్షణం మెదడు సంకేతాలు పంపుతుంది. నరాల ద్వారా ఈ సంకేతాలు అందుకుని వ్యవస్థ పనిచేస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థ… ఈ రెండింటిలో సమస్య వచ్చినప్పుడు చేతులు, కాళ్లు వణకడం, మాట తడబడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
చేతులు వణకడం సమస్య సాధారణంగా పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారిలో చూడవచ్చు. అలా అని చేతులు వణకడం మాత్రమే పార్కిన్సన్కు లక్షణం అని చెప్పలేం. అలాగే పార్కిన్సన్ ఉన్నవారికి ఖచ్చితంగా చేతులు వణుకుతాయనీ అంచనా వేయలేం. కానీ ఈ వ్యాధి ఉన్నవారిలో వణుకుడు సహజం. విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కూడా చేతులు వణుకుతుంటాయి. కొందరిలో ఒక్క వేలు మాత్రమే వణకవచ్చు. మరికొందరిలో ఒక చేయి మాత్రమే వణుకుతుంటుంది. మరికొందరిలో చేతులు, కాళ్లు బాగానే పనిచేస్తున్నా.. పెదవులు, కనుబొమ్మలు, బుగ్గలు లాంటి అవయవాలు తమ ప్రమేయం లేకుండానే కదులుతూ ఉంటాయి.
పార్కిన్సన్ ముదిరేకొద్దీ.. ఈ లక్షణాలు క్రమంగా పెరుగుతాయి. కొందరికి చేతులు వణకడం అనేది వంశపారంపర్యంగా వచ్చే రోగం కూడా అయి ఉండవచ్చు. తమ పూర్వీకుల్లో ఎవరికైనా ఇలాంటి జబ్బు ఉంటే యాభై ఏళ్లు దాటిన తరువాత ఆ లక్షణాలు కనిపిస్తాయి. తమ ప్రమేయం లేకుండానే… అవును అని, కాదని అర్ధం వచ్చేలా తలాడిస్తుంటారు. ఆందోళనలో ఉన్నప్పుడు, కోపం, భయం లాంటి భావోద్వేగాలు కలిగినప్పుడు ఈ లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి. ఇక మెదడుకు సంబంధించిన వ్యాధులు అంటే మూర్ఛ, పక్షవాతం లాంటి సమస్యలున్నవారికి చేతులు, కాళ్లు వణకడం, మాట తడబడటం సహజం. ఆయా సమస్యలు అదుపులో ఉంటే చేతులు వణకడం దానంతట అదే నయమవుతుంది.
చేతులు, కాళ్లు వణకడం లాంటివి ఏయే సమయాల్లో సాధారణమో, ఎప్పుడు రోగలక్షణమో తెలుసుకోవడం ముఖ్యం. భయం, కోపం, ఆందోళన లాంటివి ఉన్నప్పుడు చేతులు వణికితే అతిగా స్పందించనక్కర్లేదు. మానసిక ఆందోళన తగ్గించుకుంటే దాని ఫలితంగా వచ్చిన సమస్యలు వాటంతట అవే నయమవుతాయి. అలాగే చేతుల్లో చిన్నపాటి ప్రకంపనలు సహజమే. కానీ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు చేతులు గమనించగలిగే స్థాయిలో వణుకుతుంటే, చిన్న చిన్న వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటే మాత్రం జాగ్రత్తపడాలి. సాధారణంగా నరాల సంబంధిత వైద్యుల్ని సంప్రదించడం మంచిది. తమ కుటుంబంలో ఎవరికైనా నరాల బలహీనత లాంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది తెలుసుకోవాలి.
అతిగా మద్యం తాగి.. హఠాత్తుగా అలవాటు మానుకున్నప్పుడు కూడా చేతులు వణుకుతుంటాయి. వీరిలో ఈ వణుకుడు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటుంటారు. మనిషి నిలువెల్లా వణికిపోతారు. ఇలాంటి వారు వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా మద్యం అలవాటు మానుకోవాలి. ఈ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ తగ్గడానికి వైద్యులు ఇచ్చే మెడిసిన్ వాడటం ముఖ్యం. అంతకంటే మంచి పద్ధతి.. మద్యానికి బానిస కాకుండా ఉండటం. అతిగా మద్యం తాగి… అది మానలేక కొందరు ఇబ్బందిపడితే, మానాలని ఉన్నా… చేతులు వణకడం లాంటి విత్‌డ్రాయల్ సిండ్రోమ్స్‌తో అవస్థలు పడాల్సి వస్తుంది. వయసుమళ్ళినవారిలో వణుకుడు సహజమే అనుకుంటారు. అయితే దానికి హద్దులున్నాయి. వస్తువులు పట్టుకోలేనంతగా వణికిపోతుంటే చికిత్స తీసుకోవచ్చు. అలాగే వయస్సులో ఉన్నవారికి సాధారణ సమయాల్లో చేతులు, కాళ్లు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యం ప్రారంభించాలి.
నాడీ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించే వెసులుబాటు ఉంటుంది. మందులు వాడుతూ, సమతుల ఆహారం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. అన్నింటికంటే ముందు మానసిక ఆందోళన తగ్గించుకోవాలి. సమస్యల పట్ల అతిగా స్పందించడం, చిన్న చిన్న విషయాలకే భయపడటం, కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. రోజూ అర్ధగంట వ్యాయామంతో పాటు ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయడం ద్వారా సమస్యను నయం చేయవచ్చు.
చేతులు ఎక్కడివరకు చాచాలి, ఏమందుకోవాలి అనేది నిర్ణయించేది మెదడు, నాడీ వ్యవస్థే. అలాగే చేతులు వణకడం లాంటి ఇబ్బందులకు కూడా కారణం మెదడు, నరాల వ్యవస్థే అవుతుంది. కాబట్టి ప్రత్యేక కారణం ఏదీ లేకుండానే.., చేతులు, కాళ్లు వణుకుతుంటే వైద్యుడ్ని సంప్రదించాలి.