వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే చాలు బ్రాంకైటిస్ రోగుల గుండెలు గుభేలుమంటుంటాయి. కాస్త చల్లగాలి తగిలినా, వేసవిలో ఉపశమనం కోసం చల్లటి కూల్‌డ్రింక్‌లు తాగినా ఇబ్బందులు మొదలవుతాయి. పొగతాగడం వంటివి సమస్యను మరింత జటిలం చేస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వల్ల ఈ వ్యాధి తీవ్రత మరింతగా పెరుగుతుంది.
ఒక వ్యక్తి ప్రాణవాయువు తీసుకోవడానికి ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే గాలిగొట్టాలు చక్కగా పనిచేయాలి. చలికాలంలో గాలి గొట్టాలు ఎక్కువగా మూసుకుపోతాయి. వైరస్లు, బాక్టీరియాల కారణంగా గాలిగొట్టాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీంతో శ్వాసనాళాలు ఉబ్బిపోయి… గాలి వెళ్ళే మార్గం మూసుకుపోతుంది. క్రమంగా అది ఊపిరితిత్తుల వరకు గాలి చేరనివ్వదు. దీంతో ఈ బ్రాంకైటిస్ వ్యాధి ప్రాణాంతకం అవుతుంది. వాతావరణంలో ఉండే వైరస్లు, బ్యాక్టీరియాలతో పాటు మోటారు వాహనాల కాలుష్యంతో ప్రమాదకరమైన పదార్ధాలన్నింటినీ గాలితో పాటు లోపలికి పీల్చేస్తాం. ఇలాంటివి సాధారణ సమయాల్లో పెద్దగా ఇబ్బందిపెట్టకపోవచ్చు. కానీ వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు మనిషి మీద దాడి చేస్తాయి. గాలిగొట్టాల్లో ఇన్ ఫెక్షన్గా మారి శ్వాస ఆడకుండా చేస్తాయి.
సహజంగా వర్షాకాలం, శీతాకాలంలో ఈ ఇన్ఫెక్షన్స్ విజృంభిస్తాయి. సహజంగా వయసు మళ్ళిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చిన్నపిల్లల్లోనూ బ్రాంకైటిస్ త్వరగా వ్యాపిస్తుంది. అప్పటికే శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారిపై బ్రాంకైటిస్ త్వరగా ప్రభావం చూపించగలదు. శీతాకాలంలో దీని బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బ్రాంకైటిస్ను రెండు రకాలుగా విభజిస్తారు. అక్యూట్ బ్రాంకైటిస్గానూ, క్రానిక్ బ్రాంకైటిస్ అనే పేర్లతో పిలుస్తుంటారు. శీతాకాలంలో అప్పుడప్పుడు మాత్రమే బ్రాంకైటిస్ బారిని పడితే అక్యూట్ అంటారు. ఇక ఏడాదిలో ఖచ్చితంగా మూడు నెలలయినా ఉంటూ.. ఏళ్ళ తరబడి ఇబ్బంది పెడుతుంటే క్రానిక్ బ్రాంకైటిస్ అనుకోవచ్చు.
బ్రాంకైటిస్ లక్షణాలు ఏంటి …?
ముఖ్యంగా బ్రాంకైటిస్ లో గొంతు బొంగురుపోవడం, కళ్లు ఉబ్బడం, ముక్కు కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్తో శ్వాసనాళాలు మూసుకుపోతాయి. గాలి ఆడటం కష్టంగా ఉంటుంది. దీంతో నిద్రపోతున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు పిల్లికూతలు లాంటి శబ్ధాలు వస్తాయి. పదే పదే దగ్గుతుండటం వలన తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. సాధారణంగా వర్షా కాలం, శీతాకాలంలో బ్రాంకైటిస్ వచ్చే అవకాశం ఉంది.., ఈ సమయాల్లోనే ఫ్లూ జ్వరాలు కూడా విస్తృతంగా వ్యాపిస్తాయి. కాబట్టి రెండూ కలిసి మనిషిపై దాడి చేసే అవకాశమే ఎక్కువ.
కాలుష్యం ఎక్కువగా ఉండే వాతావరణంలో పనిచేసేవారు, తిరిగేవారు ఈ బ్రాంకైటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. కొంతమందికి అలర్జీల కారణంగా కూడా ఈ జబ్బు బారిన పడవచ్చు. సైనస్, ట్యాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో బ్రాంకైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక పొగతాగేవారిలోనూ ఈ సమస్య ఎక్కువ. సిగిరెట్లలో ఉండే ప్రమాదకర పదార్ధాలు గొంతు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాసనాళాలను మూసేసి.. బ్రాంకైటిస్కు కారణం అవుతాయి. కొంతమంది తమకు పొగతాగే అలవాటు లేకున్నా.. ఇతరులు తాగినప్పుడు పక్కనే ఉంటారు. ఇలాంటివారికి కూడా బ్రాంకైటిస్ రావచ్చు.
బ్రాంకైటిస్ చికిత్స విధనాలు..!
సాధారణంగా మూడు వారాలకు మించి దగ్గు ఉన్నట్లయితే, దగ్గులో రక్తం పడితే, పిల్లికూతలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అప్పుడు వైద్యుడు మీరు చెప్పే లక్షణాలను బట్టీ పరీక్షలు చేసి బ్రాంకైటిస్ వ్యాధి నిర్ధారణ చేస్తారు. కఫం లేదా తెమడ పరీక్షతోబాటు చెస్ట్ ఎక్స్ రే, లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు చేసిన తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చికిత్సా పద్దతుల ద్వారా గాలిగొట్టాలను మెల్లి మెల్లిగా తెరచుకునే విధంగా చేయొచ్చు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. బ్రాంకోడిలేటర్స్ ద్వారా గాలిగొట్టాల చుట్టూ ఉన్న కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇన్ హేలర్ పరికరంతో మెడిసిన్ తీసుకుంటే ఆ మందు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఉపశమనం ఇస్తుంది.
ఆక్సిజన్ థెరపీ కూడా బ్రాంకైటిస్ కి బాగా ఉపయోగపడుతుంది. వేడి ఆవిరిని అందించే హ్యుమిఫియర్ వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వేడి ఆవిరివల్ల గాలిగొట్టాల్లో ఉండే కఫం పలచబడుతుంది. హ్యుమిడిఫియర్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పల్మనరీ రీహాబిలిటేషన్ వల్ల అలర్జిక్ బ్రాంకైటిస్ వ్యాధిని నియంత్రించడమే కాదు నివారించవచ్చు. వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాలున్న ఆహారం తీసుకోవడం, రోగికి నైతిక బలం ఇవ్వడం, స్మోకింగ్ మానేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా మూడు వారాలకు మించి దగ్గు ఉన్నట్లయితే, దగ్గు లో రక్తం పడితే, పిల్లికూతలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే డాక్టరును సంప్రదించాలి. ఎంతకాలం నుంచి దగ్గుతు న్నారు? దగ్గే సమయంలో కఫం పడుతుందా? పడితే ఎంత పడుతుంది? ఏ రంగులో ఉంది? తదితర వివరాలు డాక్టరుకి చెప్పాలి. పని ప్రదేశాల్లో రసాయన వాయువులు, దుమ్ము, ధూళి వెలువడుతుందా తదితర వివరాలను డాక్టరుకి పూసగుచ్చినట్టు తెలియజేయాలి.