శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోనికి ప్రవేశిస్తున్నప్పుడు… వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు. దాన్ని ఎలాగైనా తగ్గించాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది. కొన్నిసార్లు విడవకుండా దగ్గు వేధిస్తుంటుంది. కారణం ఏంటో తెలియదు. మూడు నాలుగు వారాలైనా తగ్గదు. ఇలాంటి దీర్ఘకాలిక దగ్గు తరచుగా కనిపించే సమస్యే .
సాధారణంగా మనం నమిలి మింగిన ఆహారం గొంతు నుంచి నేరుగా అన్ననాళంలోకి ప్రవేశించాలి. ఒక్కొక్కసారి అదే ఆహారం తన గతిని మార్చుకుని స్వరతంత్రులను తాకి, స్వరపేటిక ద్వారా వాయునాళంలోకి ప్రవేశిస్తే వెంటనే ఆ ప్రదేశమంతా రేగుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనడం కోసం దగ్గు వస్తుంది. ఇది ఒక రక్షణ కవచంలా మనల్ని నిరంతరం అహితకర అంశాల నుండి రక్షిస్తూంటుంది. ఆరోగ్యవంతుల్లో, సాధారణ పరిస్థితులలో శ్వాసనాళాలను ఆవరించి ఉండే మ్యూకస్ గ్రంథులు ద్రవయుక్తంగా ఉండే శ్లేష్మాన్ని విడుదల చేస్తుంటాయి. ఆ శ్లేష్మం శ్వాసక్రియ ద్వారా ప్రవేశించి చిన్న చిన్న రేణువులను అటకాయించి, తటస్థపరిచి, వెలుపలికు నెట్టివేస్తుంది. ఫలితంగా దగ్గు మొదలవుతుంది. సాధారణంగా మనం దగ్గినపుడు గొంతులోని స్వరతంత్రులపై విపరీత ప్రభావం పడుతుంది. దీంతో దగ్గు మరింత పెరుగుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది.
శ్వాసమార్గంలోని నరాలను హితకరమైన పదార్థాలు కల్లోలపరవటం మూలంగా దగ్గు మొదలవుతుంది. ఆమ్లాలు, శ్లేష్మం, కృత్రిమ సెంట్లు, పర్‌ఫ్యూమ్‌లు, మసాలా దట్టించిన ఆహారం… ఇలాంటివి అన్నీ అహితకర పదార్థాలే. దగ్గు తాలూకు నాడీప్రేరణ ముందుగా మెదడుకు చేరుతుంది. మెదడు ఉదర భాగంలోని అంతర్గత కండరాలకు, డయాఫ్రం సంకేతాలను పంపి.. ముడుచుకునేలా చేస్తుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని గాలి విపరీతమైన ఒత్తిడితో కూడి, వేగంతో ఒక్కసారిగా వెలుపలకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కల్లోలానికి కారణమైన ప్రకోపకర పదార్థం వెలుపలకు బలవంతంగా నెట్టివేయబడుతుంది. అడపాదడపా వచ్చే దగ్గును సాధారణమైన, హితకరమైన లక్షణంగానే భావించాలి. ఎందుకంటే దగ్గు వల్ల శరీరేతర పదార్థాలు ఊపిరి తిత్తులు వంటి కీలక అంతర్గత భాగాల్లోకి ప్రవేశించకుండా, ఇన్‌ఫెక్షన్ కలిగించకుండా ఉంటాయి. అయితే దీర్ఘకాలంపాటు బాధించే దగ్గు మాత్రం ఏదైనా అంతర్గత వ్యాధికి వ్యక్త లక్షణంగా ఉండే అవకాశముంటుంది.
- పొగ, ఆల్కహాల్, హెయిర్ డైస్, కొన్ని రకాల నొప్పులు తగ్గించే మందులు
- డస్ట్‌మైట్స్, ధూళికణాలు, బొద్దింకలు, చెట్లు, గడ్డి, కొన్ని రకాల పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి
- జంతువుల వెంట్రుకలు, ఈకల వల్ల కూడా దీర్ఘకాలిక దగ్గు వచ్చే అవకాశాలుంటాయి.
దీర్ఘకాలపు దగ్గులో సాధారణంగా కొన్ని అనుబంధ లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ముక్క కారటం గానీ , ముక్కు బిగెయ్యటం గానీ జరుగుతుంది. కొంతమందికి గొంతు వెనక భాగంలో ఒక రకమైన ద్రవం స్రవిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. శ్వాస తీసుకునే సమయంలో పిల్లికూతలు వినిపించవచ్చు. లేదా శ్వాస అందకపోవటం మూలాన వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. ఛాతిలో మంటగా అనిపించవచ్చు. లేదా పుల్లని త్రేన్పులు గానీ.. నోటీలో చేదు రుచి గానీ అనిపించవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో రక్తపు వాంతులు కూడా కనిపిస్తుంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి లక్షణాలేవీ కనబడకపోయినా ఆస్తమా ఉండొచ్చు. ఇది దగ్గుకు దారితీయవచ్చు. కొందరిలో స్పష్టమైన కారణమేదీ లేకుండానూ దీర్ఘకాలిక దగ్గు వేధిస్తుంటుంది. కొన్నిసార్లు క్షయ మూలంగా కూడా దగ్గు రావొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట జ్వరం, చెమటలు పట్టటం, బరువు తగ్గుతుంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం ముఖ్యం.
సీబీపీ, సీటీస్కాన్, ఎక్స్-రే, అలర్జీ లెవెల్ పరీక్షల ద్వారా క్రానిక్ కాఫ్‌ను నిర్ధారించవచ్చు. సాధారణంగా వచ్చే దగ్గు.. మూడు వారాలైనా తగ్గని పక్షంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. అలాగే, జీర్ణరసాలను పైకి ఎగదన్నేలా చేసే మద్యం, కెఫీన్‌తో కూడిన కాఫీ, చాక్లెట్ వంటి వాటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.
దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు.. ఏదో ఒక దగ్గు మందు తాగేసి అణిచివేయాలని ప్రయత్నించకుండా.. అసలు దగ్గుకు కారణం ఏమిటన్నది తెలుసుకుని, దానికి చికిత్స తీసుకోవటం మంచిది. దగ్గు ముందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయి గానీ… లోపల అసలు సమస్య అలాగే ఉండి, అది మరింత ముదురుతుంటుంది. కొన్ని భయకరమైన ఊపిరితిత్తుల జబ్బులు ముదిరి ప్రాణాలు పోయే ప్రమాదం కలుగుతుంది.