నాసికా రద్దీ లేదా నోస్ బ్లాక్ .. చలికాలం వస్తే చాలు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. ముక్కులో బ్లాక్ వలన శ్వాస తీసుకోటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఈ సమస్య మరీ దారుణంగా వుంటుంది.
నాసికా రద్దీ అనేది ముక్కులో ఉండే శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసే పొర యొక్క రక్త నాళాలు వాపుకు గురవటం వలన శ్లేష్మం ఉత్పత్తి పెరిగి , తీసుకునే శ్వాస చొరబడకుండా ఉంటుంది. ఈ రకం సమస్య పిల్లల్లోనూ మరియు పెద్దల్లోనూ కనిపిస్తుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల ముక్కు నుంచి కంటిన్యూగా నీరు కారుతుండడం, ముక్కు బిగుసుకుపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తుండడంతో పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. కానీ కొన్ని గృహ చిట్కాలు పాటిస్తే ఈ జలుబు, దగ్గు లాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
నాసికా రద్దీ సమస్య వచ్చినపుడు అనేక లక్షణాలు కనిపిస్తాయి.
- జీవనప్రమాణం దెబ్బతింటుంది
- రోజువారి పనులు చేసుకోలేకపోతారు
- ముక్కులు మూసుకుపోతాయి
- ముక్కు వెంట నీళ్లు కారుతుంటాయి
- ముక్కుదిబ్బడ వేసి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉండటం
- నోటితో గాలి పీల్చుకోవాల్సి రావడం
- కళ్ల దగ్గర దురద, కళ్లు ఎర్రగా మారడం
- కళ్ల నుంచి నీరు కారడం
- దగ్గు, తుమ్ములు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పిల్లల్లో అలర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలర్జీ కొందరిలో సీజనల్‌గా వస్తుంటే.. మరికొందరిలో ఏడాది పొడవునా ఉంటుంది. తుమ్ములు మొదలుకాగానే కొందరు తెలిసిన మాత్రలు తెచ్చి వేసుకుంటుంటారు. మరికొందరు ముక్కులు బ్లాక్ అయ్యాయని నాసల్ డ్రాప్స్ తెచ్చి వేసుకుంటారు. అయితే నాసల్ డ్రాప్స్‌ను ఎక్కువ రోజులు వాడకూడదు. ఇలా అతిగా మందులు వాడితే వాడుతున్న మందు వల్ల కూడా అలర్జీ మొదలవుతుంది. అంతేకాదు రక్తపోటు కూడా పెరిగే ప్రమాదం ఉంది. తరచు ముక్కు కారుతుంటే వీటికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నాసల్ బ్లాకేజ్, ముక్కు కారడాన్ని క్లియర్ చేసే హోం రెమడీస్ అంటే ఆవిరి పట్టడం, వేడి నీటి స్నానం చేయడం, విటమిన్ ‘C’ ని తీసుకోవడం లాంటి టిప్స్ ఉపయోగించి నాసల్ బ్లాకేజ్, ముక్కు కారడం లాంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
నాసికా రద్దీ – జాగ్రత్తలు
- •చల్లటి నీరుకు దూరంగా ఉండాలి
- •భోజనం తరువాత గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలి.
- •కూలర్ లేదా AC లకు దూరంగా ఉండటంతో పాటూ చల్లటి వాతావరణానికి ఎప్పటికపుడు బహిర్గతం అవకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- •చలి లేదా శీతాకాలంలో చాతి మరియు తల భాగాన్ని ఉన్ని దుస్తువులతో కప్పి ఉంచుకోవాలి.
- •విటమిన్ మరియు మినరల్ లు అధిక మొత్తంలో గల ఆహార పదార్థాలను తీసుకోవాలి.
సాధారణంగా నాసికా రద్దీని తగ్గించటానికి గానూ ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్, యాంటీ హిస్టమైన్ మరియు డికాంజేస్టంట్స్ వంటి మందులను వైద్యులు సిఫార్సు చేస్తారు. ఒకవేళ ఎవరైన రద్దీగా ఉన్న ముక్కు వలన శ్వాస తీసుకొని ఎడల, మ్యూకస్ ను తొలగించటం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం అందించవచ్చు.