creatinine level – క్రియేటినిన్ స్థాయి మార్పులు కిడ్నీలకు ప్రాబ్లమా..?

By manavaradhi.com

Published on:

Follow Us
creatinine level

శరీరంలో ఉండే అవయవాల్లో మూత్రపిండాలు అతి ముఖ్యమైనవి. కొన్ని రకాల ముక్యమైన విధులు నిర్వర్తించి శరీరంలోని అన్ని అవయవాల విధులు సక్రమంగా జరిగేలా చూస్తాయి. ఇంతటి కీలక అవయవాన్ని కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండాల పనితీరు మందగించి అతి విఫలమవడం మొదలైందంటే దాన్ని పూర్తిగా నయం చేయడం కష్టమే. రక్తంలోని క్రియాటినిన్ మన కిడ్నీల వడబోత సమార్ధ్యం ఎల ఉందో తెలియజేస్తుంది. ఇంతకీ ఈ క్రియాటినిన్ అంటే ఏంటి…? క్రియాటినిన్ సమస్య ఎదురైనప్పుడు ఏంచేయాలి…?

మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. రక్తపు పోటుని నియంత్రించటంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు ముదిరిపోయేదాకా తెలియదు. ఎందుకంటే చివరి క్షణం వరకూ మూత్రపిండాలు పనిచేస్తాయి. ఆఖరుకు కిడ్నీ మొత్తం పాడైపోయినపుడే పనిచేయటం మానివేస్తాయి.

రక్తం మరియు మూత్రంలో ఉన్న నత్రజని సంబంధిత వ్యర్థ పదార్ధమే క్రియాటినిన్. శరీరంలో వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడిన కార్బన్ డయాక్సైడ్, యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినైన్, క్రియాటిన్ వంట వ్యర్థ పదార్థాలను నియమానుసారంగా శరీరం నుంచి బహిష్కరించుట గొప్ప పరిణామం. క్రియాటినిన్ అంటే కండర కణాలు సాధారణంగా విచ్చిన్నం చెందే సమయములో రక్తంలో ఏర్పడే ఒక వ్యర్థ ఉత్పత్తి. క్రియాటినిన్ ను ఆరోగ్యమైన మూత్రపిండాలైతే రక్తం నుండి వేరుపరిచి శరీరం నుంచి బయటకు పంపించేలా మూత్రంలోకి చేరవేస్తాయి. మూత్రపిండాలు బాగా పని చేయనట్లయితే, క్రియాటినిన్ శాతం రక్తంలోకి ఎక్కువవుతుంది.

కిడ్నీ 15 శాతం కన్నా ఎక్కువ పనిచేయలేని స్థితికి వచ్చే వరకు కిడ్నీలో వ్యాధి ఉన్నదనే లక్షణాలు ఏవీ కనిపించవు. ఆ తరువాతే కాళ్లవాపు, ఆయాసం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి పెరిగితే తిరిగి ఆరోగ్యంగా కావడం దాదాపు అసాధ్యమే. బీపీ, షుగర్‌ లాంటి జబ్బులున్న వారు ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మూత్రపరీక్ష, క్రియాటినిన్‌ పరీక్షల ద్వారా కిడ్నీలు దెబ్బతిన్నాయో లేదా తెలుస్తుంది. మూత్రంలో ప్రోటీన్‌ కన్పిస్తే అప్రమత్తం కావాలి. క్రియోటినిన్‌ నార్మల్‌గా ఉన్నా ప్రోటీన్‌ ఉంటే కిడ్నీలు దెబ్బతింటూ ఉన్నట్లుగానే అనుమానించాలి. అందుకే క్రియాటినిన్‌తో పాటు ప్రోటీన్‌ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. వైద్య పరీక్షల్లో మూత్రంలో ప్రోటీన్‌ కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను కలిస్తే మందులతో కంట్రోల్‌ చేయవచ్చు. ప్రోటీన్‌, బీపీ, షుగర్‌లను నియంత్రించవచ్చు.

మూత్రంలో ఎంత శాతం ప్రోటీన్ లేదా అల్బుమిన్ కలిగి ఉన్నాయో తెల్సుకోవడం కోసం ప్రయోగశాలలో అతి సున్నితంగా కొలత పరీక్ష జరుపుతారు. దీనితో ప్రోటీన్ క్రియాటినిన్, అల్బుమిన్ క్రియాటినిన్ నిష్పత్తిని లెక్కించడం జరుగుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న వారికి మూత్రపిండ వ్యాధులు రావడానికి అధిక ప్రమాదం ఉంది. వీరిలో ఈ వ్యాధులను గుర్తించడానికి అల్బుమిన్ క్రియాటినిన్ పరీక్షను నిర్వహిస్తారు. ఒక వ్యక్తికి మొదటగా చేసిన పరీక్షలో ప్రోటీన్ శాతం అధిక స్థాయిలో చూపించినట్లయితే, అదే పరీక్షను మరల 1-2 వారాల తర్వాత చేయాలి. రెండవ పరీక్షలో కూడా ప్రోటీన్ శాతం అధిక స్థాయిలో చూపించినట్లయితే, ఆ వ్యక్తి నిరంతర ప్రోటీనిరియా కలిగి ఉన్నట్లుగా నిర్దారించుకోవచ్చు.

క్రియాటినిన్ కొలమానం ఆధారంగా గ్లోమొరులర్ వడపోత రేటు గుర్తిస్తారు. మూత్రపిండాలు ఎంత సమర్ధవంతంగా రక్తం నుంచి వ్యర్ధాలు వడపోస్తున్నాయో లెక్కించే పరీక్షే GFR. ఒక వ్యక్తి యొక్క ఒక డెసిలీటర్ రక్తంలో ఎన్ని మిల్లీగ్రాముల క్రియాటినిన్ ఉందో ప్రయోగశాలలో పరిశీలిస్తారు. రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు మారుతుంటుంది, మరియు ప్రతి ప్రయోగశాలలో వారివారీ నిర్ణీత సాధారణ సొంత పరిధిలుంటాయి, సాధారణంగాయితే 0.6 1.2 mg / dL పరిమాణంలో ఉండాలి. ఒక వ్యక్తి క్రియాటినిన్ స్థాయి ఈ శ్రేణికి కొంత ఎక్కువగా ఉన్నట్లయితే బహుశా వారు జబ్బుపడిన అనుభూతి కలిగి ఉండరు, కానీ పరీక్షలు చేపించుకొని తగిన చికిత్స తీసుకోవడం అతి ముఖ్యం.

క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్న వారికి రక్తంలోని క్రియాటినిన్ స్థాయిలను బట్టి డయాలసిస్ అవసరమా లేదా అనేది నిర్ణయిస్తుంటారు. అక్యూట్ కిడ్నీ డిసీజ్‌లో క్రియాటినిన్ స్థాయి 13 ఉన్నప్పటికీ మందులు, ఆహార నియమాలతో తగ్గించడం సాధ్యమవుతుంది. డయాలసిస్ ఎప్పుడు అవసరమవుతుంది అనేది కేవలం క్రియాటినిన్ స్థాయిని బట్టి అంచనా వేయడం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. కొందరిలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా కనిపిస్తున్నప్పటికి డయాలసిస్ అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆకలి మందగించడం, ఆయాసం ఉండడం, వాంతులు కావడం, పొటాషియం స్థాయి ఎక్కువగా ఉండడం, బీపీ ఉండడం వంటి లక్షణాలు ఉంటే తప్ప… డయాలసిస్ చేయకూడదు.

డయాలసిస్ చేయించుకుంటున్న వారు నెలలో ఒక రోజులో ఎంత మొత్తంలో మూత్రం విసర్జితమవుతుందో… దానికి సమాన స్థాయిలో ద్రవాహారం తీసుకోవాలి. ప్రొటీన్ కూడా ఎక్కువగా తీసుకోకూడదని అపోహ పడతారు. మాంసాహారంలో చికెన్, మటన్‌లకు బదులుగా చేపలు తీసుకుంటే మంచిది. రోజుకు 10 -12 బాదంలు, చిక్కుళ్లు కూడా తీసుకోవచ్చు. టీ, కాఫీ, సిట్రస్ పండ్లు, టమాటలు, కొబ్బరి వంటివి తీసుకోకుండా జాగ్రత్త పడటం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్లోటింగ్ కణాలు ఉండి చెడు కొల్రెస్టాల్ లెవల్స్‌ను తగ్గించడానికి ఉపయోగపడే వెల్లుల్లిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. కిడ్నీ ఫ్రెండ్లీ న్యూట్రిషియన్స్ మరియు యాంటీ ఇన్‌ప్లమేటరి గుణాలు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, రాస్పెరీస్, బ్లూబెర్రీస్ పళ్లను ఆహారంగా తీసుకోవాలి. చిరుధాన్యాలు మొలకెత్తించి తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచే క్యాబేజీతో పాటు ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయలు, చెర్రీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చేపలు తింటుండాలి.

Leave a Comment