liver cancer : లివర్ క్యాన్సర్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది

By manavaradhi.com

Published on:

Follow Us
Liver Health

ఏటా ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులో మరింత ప్రమాద కరమైన లివర్ క్యాన్సర్ ఆందోళన కలిగిస్తోంది. పూర్తిగా ముదిరిన తర్వాత గానీ ఈ క్యాన్సర్ ఉందనే విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదు. కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా లివల్ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ముందుగానే గ్రహించవచ్చు.

శరీరంలో మలినాలను శుభ్రం చేసే ప్రధానమైన భాగం లివర్. హార్మోన్లు, రక్తంలో చక్కెర నియంత్రం, శక్తి నిల్వలు, ఎంజైమ్స్, రక్తశుద్ధి, విషరసాయనాల తొలగింపు, రక్త ప్రోటీన్ సంయోగ క్రియ… ఇలా అనేక శరీర ధర్మ ప్రక్రియలపై కాలేయం ప్రభావం ఉంటుంది. శరీరంలో దాదాపు 500 రకాల శరీర ధర్మ ప్రక్రియలు నిర్వహించే కాలేయాన్ని రసాయన కర్మాగారంగానూ పిలుస్తారు. మనం తీసుకునే నీరు, ఆహారం కలుషితమైనప్పుడు దాని ప్రభావం మొదట పడేది కాలేయం మీదనే. ఇటీవల ఆహారంలో వస్తున్న మార్పులు కాలేయ వ్యాధులు పెరగడానికి కారణం అవుతున్నాయి. దానితో పాటు పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయం పనితీరు సరిగా లేకపోతే క్యాన్సర్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీనికి వచ్చే ఏ సమస్య అయినా మొత్తం శరీరం మీద ప్రభావం చూపుతుంది. అలాంటి కీలకమైన భాగానికి క్యాన్సర్ సోకితే అది మరింత ప్రాణాంతకమైన సమస్యగా మారే ప్రమాదం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని ఈ సమస్య బలిగొంటోంది. అనేక ఇతర గుర్తించలేని కారణాల వల్ల స్త్రీలను కూడా ఈ సమస్య బలిగొంటోంది. ఏటా ఈ లివర్ క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఏటికేడు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని బలితీసుకుంటున్న ప్రధాన వ్యాధుల్లో లివర్ క్యాన్సర్ నాలుగోది అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యలు ఎదురు కావడానికి ముందే శరీరంలో కొన్ని రకాల మార్పులు ప్రారంభం అవుతాయి. ఇలాంటి ప్రమాద ఘంటికలను ప్రారంభంలోనే గుర్తించగలిగితే, లివర్ క్యాన్సర్ నుంచి కచ్చితమైన పరిష్కారాన్ని అందుకోవచ్చు. దీనికి సమస్య పట్ల అవగాహన కలిగి ఉండడంతో పాటు, వైద్యుని పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

సాధారణంగా ఎక్కువగా మద్యపానం చేసే వారిలో ఈ సమస్య వస్తుంది. అయితే ఈ అలవాటు లేని వారిని కూడా ఈ సమస్య బాధిస్తోంది. లివర్ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా గ్రహించవచ్చు. ఇవి ఎదురయ్యాయంటే ప్రమాద ఘంటికలు మోగినట్లే అని గుర్తించి వెంటనే వైద్యుని సంప్రదించాలి. లివర్ క్యాన్సర్ సూచనల్లో ప్రధానమైది అలసిపోవడం. చిన్న పాటి పనికే అలసట వస్తుందంటే వారికి సమస్య ఉందనే భావించాలి. అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇది సర్వ సాధారణమే అయినప్పటికీ, ఇది ఎక్కువగా కాలం కొనసాగుతూ ఉందంటే, అది లివర్ క్యాన్సర్ కు సూచనే అనే విషయాన్ని గుర్తించాలి. ఉన్నట్టుండి బరువు తగ్గిపోవడం కూడా లివర్ క్యాన్సర్ రాబోతోంది అనడానికి సూచనే. ఏ విధమైన జాగ్రత్తలు పాటించకుండా, ఆహారంలో మార్పులు రాకుండా బరువు తగ్గారంటే లివర్ విషయంలో మార్పులు వచ్చినట్లే లెక్క. అంటే లివర్ క్యాన్సర్ రాబోతందనడానికి ఇదో సూచన కావచ్చు.

ఆహారం తీసుకున్న తర్వాత కడుపు ఉబ్బినట్లు ఉండడం కూడా లివర్ క్యాన్సర్ ప్రమాద ఘంటికే. చిన్న పాటి ఆహారం తీసుకున్నా ఇలాంటి సమస్య ఎదురౌతూ ఉండడం లివర్ క్యాన్సర్ సూచనే. పొత్తికడుపు కింద బాగంలో ఉన్నట్టుండి నొప్పి ఎదురు కావడం, దానితో పాటు పొత్తి కడుపు కుడివైపున గడ్డ లేచినట్టుగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉందంటే అది కచ్చితంగా లివర్ క్యాన్సర్ కు దారి తీస్తుందనే గ్రహించాలి. ఎలాంటి కారణాలు లేకుండా చర్మం దురదలు పెడుతుందంటే అది లివర్ క్యాన్సర్ కు ఓ కారణం. సాధారణంగా శరీరం మీద ఏవైనా దద్దర్లు లేచినప్పుడు, ఏవైనా కుట్టినప్పుడు దురదలు ఎదురౌతాయి. ఏ కారణం లేకుండా దురదలు పెడుతున్నాయంటే జాగ్రత్త పడాల్సిందే.

ఆకలి ఉండక పోవడం, తింటున్నప్పుడు వాంతి వచ్చినట్లు ఉండడం లాంటివి ఎదురౌతూ ఉంటే అది లివర్ క్యాన్సర్ కు మరో సూచన అనే అనుకోవాలి. శరీరం మీద తెల్లని మచ్చలు లేదా వలయాలు లివర్ క్యాన్సర్ సంకేతాల్లో మరొకటి. శరీరంలోని కండరాలు బలహీనంగా అనిపించడం, విశ్రాంతి తీసుకున్నా సరైన స్థితికి రాలేకపోవడం లాంటివి లివర్ క్యాన్సర్ కు సూచనే. పొత్తి కడుపు కింది భాగంలో వాచినట్లు ఉండడం మరో సూచన. కామెర్లు వచ్చినట్లు ఉండడం, శరీం తెల్లగా మారిపోవడం, కళ్ళు పచ్చబారడం లాంటివి లివర్ క్యాన్సర్ సూచనలే. అయితే ఈ సమస్యలు ఎదురైనంత మాత్రాన అది లివర్ క్యాన్సర్ అని భావించి వెంటనే భయపడి పోవడం మంచిది కాదు. ఈ లక్షణాలన్నీ ఇతర సమస్యల విషయంలో కూడా ఎదురౌతాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగుతున్నప్పుడు మాత్రమే అది లివర్ క్యాన్సర్ కు దారి తీయవచ్చనే అంశాన్ని గుర్తించుకోవాలి. ఏ సమస్య ఎదురైనా ముందు వైద్యుని సంప్రదించి, పరీక్షలు చేయించుకుని నిర్థారణ చేసుకోవడం ముఖ్యం. చిన్న పాటి సూచనలకే ఏదో అయిపోయిందని భయపడడం మంచిది కాదు. అందుకే సమస్య పట్ల ముందు అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఆహారం, జీవనశైలి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా లివర్ క్యాన్సర్ లాంటి ఎన్నో సమస్యలను మన దరికి రాకుండా రక్షిస్తుంది.

Leave a Comment