నాగరిక జీవనంలో కూర్చుని పనిచేయడం ఎక్కువై కీళ్లపైన ఒత్తిడి పెరుగుతున్నది. తగిన శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం వంటి కారణాలు, పరోక్షంగా కీళ్లనొప్పులకు దోహదం చేస్తున్నాయి. ఆర్థరైటీస్‌తో బాధపడకుండా ఉండేందుకు ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
కీళ్లల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మోకాళ్లు, ఇతర కీళ్లల్లో విపరీతమైన నొప్పి, వాపు, బిగుసుకుపోవడం, నడవడంలో ఇబ్బంది వంటివి బాధిస్తాయి. మెల్లమెల్లగా వాటి రూపాన్నికోల్పోవడంతో పాటు కాలు ఆకృతిలో, నిర్మాణంలో కూడా తేడా కనిపిస్తుంది. కీళ్ల అరుగుదల బాగా ఎక్కువైన తర్వాత కీళ్ల కదలిక కూడా తగ్గిపోతుంది. కండరాలు పటుత్వం కోల్పోయి వ్యవస్థలో అసమానతలు ఏర్పడతాయి. తగినంత శారీరకశ్రమ లేకపోవడం వల్ల కీళ్లకు పోషణ తక్కువకావడం ఒకవైపు.. అధిక బరువు, స్థూలకాయం వల్ల వాటిపై ఒత్తిడి పెరగడం మరోవైపు.. వెరసి ఆర్థరైటిస్ బాధితులు పెరుగుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా కూర్చుండి పనిచేయడం వల్ల కీళ్లు కదలికలు తగ్గిపోయి పనిచేయకపోవడం, గట్టిపడటం చూస్తుంటాం. ఆర్థరైటీస్ సాధారణంగా ఒక జాయింట్ నుంచి ప్రారంభమై అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది.
ఆర్థరైటీస్ 100 రకాలు ఉంటుందని గుర్తించినప్పటికీ … సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, ల్యూపస్.. అని ఐదు రకాలుగా ఉంటుంది. జాయింట్లలో నొప్పితో ప్రారంభమై కాళ్లూ, చేతులు కదల్చలేని స్థితికి దారితీస్తుంది. వయసు పైబడిన వారిలో కనిపించే సాధారణ సమస్య ఇది. కీళ్లు సరైన రీతిలో కదలకుండా ఉన్నప్పుడు సైనోవియల్ ద్రవం ఉత్పత్తి తగ్గిపోయి కీళ్లు అరిగిపోవడానికి కారణమవుతాయి. అలాగే కీళ్ల కదలికలకు ఉపయోగపడే కార్టిటేజ్ అరిగిపోయినప్పుడు కూడా కీళ్లనొప్పులు వస్తుంటాయి. చేతులు, కాళ్లు కదిలించలేకపోవడం, నడవడంలో ఇబ్బంది, కూర్చుండి లేవలేకపోవడం, ఏదైనా వస్తువులను సరిగా పట్టుకోలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. జాయింట్లలో వచ్చే ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా ఆర్థరైటిస్ సమస్య కనిపిస్తుంది. డిస్‌లొకేషన్, సికిల్ సెల్ డిసీజ్, బోన్ ట్యూమర్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ వంటివి కూడా కారణమవుతుంటాయి.
కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఎముకలకు క్యాల్షియం, విటమిన్ D అందేలా ఆహారాలు తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా లభించే ముడి గింజలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉండి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వీటిలో ఉండే మెగ్నీషియం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చేపల్లో ఒమెగా ౩ ఫ్యాటీ యాసిడ్లు వాపులను తగ్గిండమే కాకుండా కీళ్ల నొప్పులను పోగొడతాయి. కీళ్లను దృఢంగా చేస్తాయి. నారింజ పండ్లను తినడం వల్ల కీళ్ల నొప్పుల సమస్యను పోగొట్టుకోవచ్చు. పీనట్ బటర్ లో సమృద్ధిగా ఉండే విటమిన్ D3 ఎముకలకు ఎంతగానో అవసరం. కీళ్లనొప్పులను మటుమాయం చేయడంలో ఉపయోగపడే విటమిన్ ఈ కోసం పచ్చి రొయ్యలను ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మందులు, ఫిజికల్ థెరపీకి లొంగనప్పుడు మాత్రమే ఆర్థరైటిస్‌కు సర్జరీ అవసరమవుతుంది. శరీరంలోని కొన్ని కీళ్లకు టోటల్ జాయింట్ రిప్లేస్‌మెంట్ చేయాల్సి వస్తుంది.
ఉదయం మంచం మీది నుంచి లేవగానే కీళ్లు బిగబట్టినట్లుగా ఉండి.. నొప్పి వస్తుందంటే కీళ్ల గట్టిపడుతున్నట్టుగా భావించాలి. త్వరగా అలసిపోవడంతోపాటు చిన్నపనులకే ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే కీళ్లవైద్యుడ్ని కలిసి చికిత్స తీసుకోవడం ఉత్తమం.








