వ్యాయామం చేయడం అనేది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో అవసరం. ఆహారం లాగానే వ్యాయామం కూడా నియమితంగా చేయాలి. శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యం స్థాయిని పెంచుతుంది. వ్యాయామం చేయడం వలన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. అలానే క్యాలరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. మృతకణాలు పేరుకోకుండా ఉంటాయి. రోజూ 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మెదడు మీద ప్రభావం వుంటుంది.
వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొత్త న్యూరాన్లు పుడతాయి. దానివల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరి చేరవు. అలాగు డిమెన్షియా లాంటి వ్యాధుల నివారణకు కూడా వ్యాయామం పనికి వస్తుంది. నిత్యం వ్యాయామం చేయడం వల్ల కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది.
వ్యాయామం అంటే జిమ్‌కు వెళ్లి చెమటోడ్చడం ఒక్కటే కాదు. ఇంటివద్ద కూడా వ్యాయామం చేసుకోవచ్చు. వీలుచిక్కితే ఉదయాన్నే వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బ్రిస్క్ వాకింగ్ తోపాటు రన్నింగ్ కూడా శరీరం దృఢంగా తయారవ్వడానికి ఉపయోగపడుతుంది. బయటకు వెళ్లి వ్యాయామం చేయలేని వారు ఇంటివద్దనే సైక్లింగ్, మిద్దెపై వాకింగ్, మెట్లు ఎక్కుతూ దిగడం వంటివి చేయడం అలవర్చుకోవడం ద్వారా శరీరంలో చెడు కొలేస్ట్రాల్ స్థాయిలు పెరుగకుండా చూసుకోవచ్చు. అలాగే రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగకుండా వ్యాయామం ఉపయోగపడుతుంది. హై బ్లడ్ ప్రెషర్‌ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో మంటలు రాకుండా కాపాడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నాళాలు ఫ్రీ ఫ్లోగా తయారవుతాయి. రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడం వలన కొలన్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఎముకలు గట్టిగా తయారవడమే కాకుండా ఒస్టియోపోరాసిస్, ఆర్ధరిటిస్ లాంటి చాలా రకాల ఎముకల క్షీణత రోగాలు రాకుండా నిరోధిస్తుంది.
నిత్యం వ్యాయామం చేస్తే రక్తంలో చక్కర నిల్వలు నియంత్రణలో వుండి మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల నిత్యం ఆందోళన పడటం తగ్గి, ప్రశాంతత చేకూరుతుంది, దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి మనసు ఆందోళనలకు దూరంగా వుంటుంది. నిత్యం వ్యాయామ౦ వల్ల కండరాల బలం పెరిగి, శక్తి, సహనం పెరుగుతాయి. కణాలకు సరిపడా ప్రాణవాయువు సరఫరా అయి వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. ఎక్కువ సమయం పాటు కూర్చుని పనిచేసే మగవారిలో వెన్నెముక నొప్పులు చాలా సాధారణం. వెన్ను నెప్పితో బాధ పడేవారు కొద్దిగా సాగదీయడం, వ్యాయమ కదలికలు చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
శారీరక వ్యాయామం గురించి ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు స్వతహాగా చేసే శారీరక కష్టం తగ్గిపోవడంతో భారీకాయుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ముప్పునుంచి రక్షించుకునేందుకు శారీరక వ్యాయామాలవైపు దృష్టి సారించడం అత్యవసరమని గుర్తించాలి.







