సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందునా డైట్ సోడాలు తాగడం మరింత అనారోగ్యకరమని చెప్పవచ్చు. డైట్ సోడాల వల్ల హానికర ప్రభావాలు ఉంటాయి. డైట్ సోడాలు తీసుకొనే వారిలో మధుమేహం సమస్యలు తీవ్రతరమై డయాబెటిక్ అంధత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. డైట్ సోడాలకు డయాబెటిక్ బ్లైండ్‌నెస్‌తో ఉన్న సంబంధమేంటో వివరంగా తెలుసుకుందాం..
డైట్ సోడా, కృత్రిమ చక్కెరలు కలిపిన ఆహార పదార్థాలు, డ్రింక్స్ అనారోగ్యకరం. అంతేకాకుండా, ఇవి శరీర బరువు పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా డైట్ సోడా తాగటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతాయని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ నిపుణులు వెల్లడించారు. ఈ పరిశోధనల ఫలితాల ప్రకారం, డైట్ సోడా వలన పెరిగే రక్తంలోని చక్కెర స్థాయిలు మధుమేహ వ్యాధికి దారీ తీస్తాయని స్పష్టం చేశారు.
క్యాలరీలు లేని సోడా ఆరోగ్యకర బరువును పెంచుతుంది. అదే డైట్ సోడా, కృత్రిమ చక్కెరలను కలిగి ఉండే కార్బోనేటేడ్ ద్రావణాలు ఊబకాయానికి దారి తీస్తాయి. కృత్రిమ చక్కెరలు కలిగిన డైట్ సోడాలు.. మెదడులో ఉండే నాడులను నాశనం చెందిస్తాయి. ఫలితంగా కళ్లపై తీవ్రప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మధుమేహం అదుపు తప్పితే కంట్లో ఉండే చిన్న రక్తనాళాలు చిట్లి రెటీనా పాడవుతుంది. దీంతో అంధత్వం రావొచ్చు. ఈ సమస్యలో లక్షణాలేవీ కనిపించవు. రెటినోపతీలో చాప కింద నీరులా జరగాల్సిన నష్టం జరిగిపోతూ హఠాత్తుగా కంటి చూపు పోతుంది. ఎక్కువగా డైట్ సోడాలు తీసుకొనేవారి రక్తంలో చక్కెర స్థాయి పెరగడంవల్ల రక్తం చిక్కగా తయారై సన్నటి రక్తకేశనాళికలలో ప్రవహించలేదు. ఫలితంగా కంటిలోని రెటీనాకు రక్తసరఫరా తగ్గిపోయి దృష్టి మందగిస్తుంది. బరువు పెరిగేందుకు, మనో వ్యాకులత పెంచేందుకు, దంతాలకు నష్టంకలిగించడానికి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెంచడానికి, గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచడానికి డైట్ సోడాలు కారణమవుతాయి. అందుకని డైట్ సోడాలను దూరం పెట్టడం చాలా అవసరం.
సోడాలు,కూల్ డ్రింక్స్ తో టైప్ 2 మధుమేహ ముప్పు అధికం. ఫ్రక్టోజ్‌తో కూడిన డైట్.. ఆహారంలో పోషకరహిత శక్తిని చొప్పించి రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రమాదం చూపుతుందని పరిశోధకులు తేల్చారు. సోడాతో పాటు శీతల పానీయాలు, బేకరీ పదార్థాలు, స్వీట్లకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, సహజ సిద్ధమైన పండ్ల రసాలు, తేనె.. లాంటి ఆహారం, పానీయాలతో ఎలాంటి ముప్పు లేదని వారు సెలవిస్తున్నారు.
ఒకప్పుడు షుగర్ వ్యాధి ఎప్పుడో వయస్సు మళ్లిన వాళ్లకు వచ్చే వ్యాధిగా అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. అన్ని వయస్సులవారూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్‌ను అదుపులో పెట్టుకొంటూ అంధత్వం రాకుండా ఉండేందుకు డైట్ సోడాలను దూరం పెట్టడం అవసరమంటున్నారు పోషకాహార నిపుణులు.








