మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఏం చేస్తారు.. ? ఇదేం ప్రశ్న.. కాస్త వేడి చేసుకుని మరో పూట తింటాం .. అని సమాధానం చెప్పాలనుకుంటున్నారా…ఇదే మీ సమాధానం అయితే మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారన్నమాట. మిగిలిపోయిన ఆహారపదార్థాలు మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినడం చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు. అందులో బ్యాక్టీరియా శాతం పెరిగిపోయి.. ఆహారం కాస్తా విషంగా పరిణమిస్తుందంటున్నారు. అందుకే వీలైనంత వరకు మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినకుండా బయటపడేయడమే మంచిదని సూచిస్తున్నారు.
ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారం ..విషంతో సమానం. ఇలాంటి కలుషిత ఆహారాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచు. కలుషిత ఆహారాన్ని మీరు చాలా సమయాల్లో గుర్తించే అవకాశం ఉండకపోవచ్చు . ఎందుకంటే కలుషిత ఆహారం చూడడానికి తాజాగానే కనిపిస్తుంది. రుచిలోనూ ఒక్కోసారి మార్పు రాకపోవచ్చు. కాబట్టి బాగానే ఉంది కదా అని తిన్నారంటే . . సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మధ్యాహ్నం చేసిన ఆహారం.. ఒకవేళ మిగిలిపోయిన పక్షంలో .. సాయంత్రం తినేందుకు వీలుగా చాలామంది ఫ్రిజ్ లో పెట్టుకుంటూ ఉంటారు. ఐతే ఫ్రిజ్ లో పెట్టుకోవడం.. మళ్లీ వేడి చేసుకుని తినడం వల్ల ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐతే ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు , తిరిగి వేడి చేసుకునేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కచ్చితంగా పాటిస్తే .. ఫుడ్ లో చేరిన బ్యాక్టీరియా బారిన పడకుండా ఉంటుంది . మధ్యాహ్నం తినడం అయిపోగానే మిగిలిన ఆహారాన్ని వెంటనే ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అంటే ఆయా ఆహార పదార్ధాలను గది ఉష్ణోగ్రత వద్ద 2 గంటలు మించకుండా చూసుకోవాలి. అంటే అంతకు ముందే వాటిని ప్రిజ్ లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు ఆహారానికి గాలి దూరకుండా చూసుకోవాలి. మళ్లీ తినాలనుకున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను ప్రిజ్ నుంచి తీసి.. . కనీసం 70 నుంచి 80 డిగ్రీల మధ్య వేడి చేసుకోవాలి. అలా చేస్తేనే అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. పైపైన వేడి చేసి .. తింటే బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది.
కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే సమస్యలను సాధారణంగా ఫుడ్ పాయిజన్ గా పిలుస్తారు. దీని వల్ల వాంతులు ,విరేచనాలు, జ్వరం, తలనొప్పి , అతిసార లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో వాంతులు విపరీతంగా అవుతూ ఉంటాయి. కడుపులో నుంచి కలుషిత ఆహారాన్ని కక్కించేసినా కొంత మందిలో వాంతులు ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వారి పేగుల్లో ఇంకా బ్యాక్టీరియా మిగిలే ఉంటుంది. మరికొంత మందిలో బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన టాక్సిన్స్ రక్తంలో కలిసిపోతాయి. దీని వల్ల కూడా వాంతులు, జ్వరం తగ్గే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ వల్ల కణజాలం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కొంత మందిలో చర్మంపై దద్దుర్లు కూడా ఏర్పడతాయి. అందుకే నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది…
నోటికి రుచిగా తగిలిందల్లా…శరీరానికి పనికొచ్చేది కాకపోవచ్చు. శరీరానికి అవసరమైన ఆహారం… అంత సులభంగా చేతికి అందకపోవచ్చు. కానీ మనమే శోధించి సాధించాలి. మనం చేసే పనిబట్టి.. మన శరీర తత్వం బట్టి ఏయే ఆహారాలు తీసుకోవాలి అనేది స్వయంగా అందుబాటులో ఉన్న ఆహారమో, రుచిగా ఉన్న తిండో కాకుండా శరీరానికి ఏది తగిన ఆహారామో దాన్నే అలవాటు చేసుకోవాలి.







