కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతది అని మనసు కవి ఆత్రేయ అప్పట్లో అన్నారు. అవును నిజమే రాత్రి పూట కాకుండా పగటిపూట కునుకు తీస్తే మరింత చురుకుగా ఉండొచ్చని వైద్య నిపుణులు కూడా అంటున్నారు. నిద్రలేమితో బాధపడే వాళ్లు కాస్త విరామం దొరికితే కునుకు తీస్తే చాలట. కునుకు వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి?
మన శరీరంలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఒక్కోసారి ఎక్కువ మోతాదులో ఈ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది ప్రమాదకర పరిస్థితి. కాబట్టి ఒత్తిడి హార్మోన్లు తక్కువగా విడుదలవ్వాలంటే నిద్ర చాలా అవసరం. నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 153 అధ్యయనాల్లో 50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో చాలా మంది నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయని అన్నారు. యుక్తవయసులో వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికి దారి తీస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిద్ర అంటే గంటలు కొద్దీ కాదు. కునుకు పడితే చాలు అంటున్నారు వైద్యులు. ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండాలంటే కునుకు తీయడం తప్పనిసరి. దీనివల్ల మూడ్ బాగుంటుంది. అంతేకాదు ఎంతో సమర్ధవంతంగా తయారవుతారు. అలర్ట్ గా ఉంటారు. పగటిపూట హెక్టిక్ పనుల షెడ్యూల్ ఉంటుంది. ఎప్పుడైతే తాజాగా ఉంటారో అప్పుడు సామర్ధ్యం బాగా పెరుగుతుంది. ఇంతకుమునుపు చేసిన అధ్యయనాల ప్రకారం పగటిపూట కునుకు తీస్తారో అటువంటివాళ్లు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు నుంచి బయటపడగలరు.
ఇటీవల జరిగిన మరో అధ్యయనం ప్రకారం పగటిపూట 30 నిమిషాల సేపు కునుకు తీస్తే 40శాతం పురోగతిసాధించినట్టు వెల్లడైంది. సరిపడినంత నిద్ర వల్ల లేదా కునుకు వల్ల వ్యాయామాలు చేయడానికి స్పూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే పగటిపూట కునుకు తీయకపోవడం వల్ల బాగా అలసిపోతారు. నిద్రలేకపోవడం వల్ల బద్దకంగా అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకోవడం లేదా రిలాక్సేషన్ ప్రతీ ఒక్కరికి అవసరం. కునుకు అనేది ప్రతీ ఒక్కరికి అవసరమా? అంటే కాదు అనే చెప్పాలి. ఎందుకంటే నిద్రలో నడిచే అలవాటు ఉన్నవారికి కునుకు తీసే అలవాటు అంత మంచిది కాదు. చాలామందికి రాత్రి పూట నిద్రపట్టదు. అటువంటివాళ్లు పగటిపూట అప్పుడప్పుడు కునుకు తీస్తే తప్పేంలేదు. నిద్ర లే కపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. మన మనసు తీవ్ర అలజడికి గురవుతుంది. పగటిపూట కాసేపు కునుకు తీయటం మనలో చాలామందికి అలవాటే. ఇది పని అలసటను దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మెదడుకు చురుకుదనాన్ని తెచ్చిపెడుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే కునుకు మరింత మేలు కలిగేలా చూసుకోవచ్చు.
పగటిపూట నిద్ర పనికి చేటు అంటారు. అవును నిజమే మేల్కొనే వేళల్లో నిద్ర వల్ల దైనందిన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం వాటిల్లుతుంది. అయితే పగటిపూట కునుకు తీస్తే పర్వాలేదు అని ఒక అధ్యయనంలో తేలింది. ఎక్కువసేపు కునుకు తీయొద్దు అని కూడా అంటున్నారు. ముఖ్యంగా పనులు చేసే సమయంలో కునుకు వల్ల శరీరానికి అలసట తగ్గుతుంది. ఎప్పుడైతే అలసట తగ్గుతుందో దాని ప్రభావం నిద్ర మీద పడుతుంది. రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంది. అటువంటివాళ్లు కునుకు తీయడం వల్ల ఆ రోజంతా ఫ్రెష్ గా ఉండొచ్చు. కాబట్టి కునుకు మరవొద్దు. చాలాసేపు కునుకు తీస్తే చాలాసేపటి వరకు మగతగా అనిపిస్తుంది. ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి పగటిపూట 10 నుంచి 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోవద్దు. సెలవురోజుల్లోనూ గంట కన్నా ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ఇది రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది. చీకటి పడుతుండగా కునుకు తీయకపోవటమే మంచిది. రాత్రిపూట పడుకునే సమయానికి దగ్గర్లో కునుకు తీస్తే ఆనక నిద్ర పట్టకపోవచ్చు. నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య పడుకోవటం మేలు. సాధారణంగా ఈ సమయంలో మన జీవగడియారం నిద్ర వస్తున్న భావన కలగజేస్తుంటుంది.
నిద్రలేమి, నిద్ర మధ్యలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం వంటి సమస్యలు గలవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. కునుకు పట్టినపుడు కలలు కూడా వస్తుంటే.. రాత్రిపూట సరిగా నిద్రపోవటం లేదనే అర్థం. ఇలాంటివాళ్లు రాత్రిపూట తగినంత నిద్రపోయేలా చూసుకోవాలి. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయేవారికి పగటి నిద్ర అవసరమే రాదు. కునుకు ఎంత సేపు పట్టేదాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడుతుంది. రోజుకు పరిమిత సంఖ్యలో కునుకు తీయాలి. 10 నుంచి 20నిమిషాల సేపు కునుకు తీయాలి.యంత్రం సాయంత్రం మూడు గంటల తర్వాత కునుకు వల్ల రాత్రిపూట నిద్ర పట్టే అవకాశాలు తగ్గిస్తుంది. కాబట్టి సాయంత్రానికి ముందే కునుకు తీస్తే మంచిది.
కునుకు వల్ల సత్పలితాలు, దుష్పరిణామాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. కునుకు వల్ల ఎక్కువగా ప్రయోజనాలున్నాయి. అయితే రాత్రి పూట నిద్రలో నడిచే అలవాటు ఉన్నవాళ్లు పగటిపూట కునుకు తీయదలచుకుంటే జాగ్రత్తగా ఉండటం మంచిది.








