తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో విజయాన్ని అందుకున్న నటుడు సూర్యపై నటి రాధిక ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ, సూర్య జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో మానసిక పోరాటాలను తాను దగ్గర నుంచి చూశానని, వాటన్నింటినీ అధిగమించి ఆయన ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో సూర్యకు తల్లి పాత్రలో నటించిన రాధిక, ఈ సినిమాకు ఆయన అంగీకరించారని తెలిసి తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.
‘‘సూర్య పడిన కష్టాలను, బాధను నేను దగ్గర నుంచి చూశాను. అతడిని నా కుటుంబంలో ఒక భాగంగా భావిస్తాను. సినీ పరిశ్రమలో చాలా మంది ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ, మానసికంగా చేసే పోరాటాలు మరో స్థాయిలో ఉంటాయి. సూర్య అలాంటి ఎన్నో కష్టాలను అధిగమించాడు. ఇప్పుడు అతడిని చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది.
సూర్య ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. తన మనసులోని భావాలను చాలా అరుదుగా, కొంతమంది సన్నిహితులతో మాత్రమే పంచుకుంటాడు. అలా అతడు తన భావాలను పంచుకునే కొద్దిమందిలో నేను కూడా ఒకరిని. అవసరమైనప్పుడు అతడికి సలహాలు ఇస్తుంటాను’’ అని రాధిక తెలిపారు.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాధికతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి సూర్య కూడా మాట్లాడారు. తన సోదరుడు కార్తి చదువుకోవడానికి అమెరికా వెళ్లే సమయంలో రాధిక ఆర్థిక సాయం చేశారని వెల్లడించారు. ఆమె చేసిన సహాయాన్ని తమ కుటుంబం జీవితాంతం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.
ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.150 కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించినట్లు సమాచారం.






