‘టాక్సిక్‌’పై సుమలత ఆసక్తికర వ్యాఖ్యలు.. యశ్‌కు అండగా మాజీ ఎంపీ

By manavaradhi.com

Published on:

Follow Us

Toxic: యశ్‌ (Yash) కథానాయకుడిగా తెరకెక్కిన ‘టాక్సిక్‌’ (Toxic) చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. యశ్‌ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, సినిమా మేకింగ్‌ విషయంలో కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్‌ (Sumalatha Ambareesh) ‘టాక్సిక్‌’ సినిమాపై స్పందించారు. తాను ఈ చిత్రాన్ని చూశానని చెబుతూ.. యశ్‌కు మద్దతుగా సోషల్‌ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

యశ్‌ ఎలాంటి భయాలు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారని సుమలత పేర్కొన్నారు. ‘టాక్సిక్‌’లో యశ్‌ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

యశ్‌ ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తారని, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని సుమలత అన్నారు. ప్రస్తుతం సినిమాపై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. బహుశా ‘టాక్సిక్‌’ ప్రస్తుతం కాకుండా భవిష్యత్తులో విడుదల కావాల్సిన సినిమా అయి ఉండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు.

యశ్‌ ఎదుగుదలను తట్టుకోలేని కొందరు, సినిమాను సరిగ్గా అర్థం చేసుకోలేని మరికొందరు ‘టాక్సిక్‌’ను ట్రోల్‌ చేస్తున్నారని సుమలత అభిప్రాయపడ్డారు. మన విజయాన్ని చూసి ఇతరులు అసూయపడటం సహజమేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో యశ్‌ ‘కేజీఎఫ్‌’ను మించిన విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

యశ్‌కు రిషబ్‌ శెట్టి మద్దతు

ఇదిలా ఉండగా.. ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి (Rishab Shetty) సైతం ఇటీవల యశ్‌ నటనను ప్రశంసించారు. ‘టాక్సిక్‌’ ఒక సాహసోపేతమైన ప్రయోగమని పేర్కొన్నారు. యశ్‌కు తాను ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు.

కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న యశ్‌ తపనను తాము ఎంతో ప్రేమిస్తున్నామని రిషబ్‌ శెట్టి తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ‘టాక్సిక్‌’పై వస్తున్న విమర్శల నేపథ్యంలో యశ్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.

Leave a Comment