Varanasi Movie Theatrical Rights: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ హక్కులకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.290 కోట్ల భారీ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఈ డీల్‌పై చిత్రబృందం లేదా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ వార్త నిజమైతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల విక్రయాల్లో ‘వారణాసి’ సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఈ సినిమా హక్కులు సుమారు రూ.225 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇప్పుడు ‘వారణాసి’ హక్కుల కోసం రూ.290 కోట్ల డీల్ కుదిరినట్లు వస్తున్న వార్తలు నిజమైతే, ఆ రికార్డు బద్దలైనట్లే.
ఇక ఈ హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా పోటీపడినట్లు తెలుస్తోంది. చివరకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మహేశ్‌బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో అసాధారణమైన ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ స్థాయి కథాంశం, భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అగ్రతారల కలయికతో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజా బిజినెస్ వార్త మహేశ్‌బాబు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
మరోవైపు, ఇప్పటివరకు ‘వారణాసి’ నుంచి కొన్ని స్టిల్స్‌తో పాటు ఓ గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యాయి. సినిమా కథ, పాత్రలు, ఇతర కీలక అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌లో సినిమాకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ లేదా భారీ రివీల్ ఉండొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.







