చాపకింద నీరులా చాలా గోప్యంగా శరీరంలోకి చేరిపోయే ఆరోగ్యశత్రువు మధుమేహం. ఏమాత్రం అప్రమత్తత లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేసి చేదుని మాత్రమే మిగులుస్తుంది. మనదేశంలో అత్యధికశాతం జనాభా బాధపడుతున్నది మధుమేహంతోనే. ఈ వ్యాధి ఎక్కువకాలం కొనసాగినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందులో మరీ ముఖ్యంగా కంటి చూపు తగ్గే ప్రమాదం వుంది. మధుమేహాం ఉన్నప్పుడు కంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మధుమేహం కంటి సమస్యలు..?
మధుమేహం మారుతున్న జీవనశైలి కారణంగా ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి. చాప కింద నీరులా విస్తరిస్తూ మనిషిని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి వల్ల పైకి పెద్దగా లక్షణాలేవీ కనిపించకపోయినా లోపలి కీలక అవయవాలన్నింటినీ దెబ్బతీస్తుంటుంది. మధుమేహం వల్ల కంటికి డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా , క్యాటరాక్ట్ , ఆప్టిక్ న్యూరోపతీ వంటి సమస్యలు ఎదురౌవచ్చు. మధుమేహం కారణంగా రక్తనాళాలు మొద్దుబారడం వల్ల రెటీనాకు అందాల్సినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందక క్రమంగా రెటీనా తన పనితీరును కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల దృష్టిలోపం కూడా రావచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే నరాల స్పందనలు గమనించాలి.
డయాబెటిస్ ఉన్నవారికి వచ్చే మరో సమస్య గ్లకోమా. కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ఒత్తిడి పెరిగి మనకు కనిపించే దృష్టి విస్తృతి తగ్గిపోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా గ్లకోమా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మధుమేహం వల్ల కంటికి వచ్చే మరో సమస్య క్యాటరాక్ట్. కంట్లోని లెన్స్ పారదర్శకతను కోల్పోయే స్థితిని క్యాటరాక్ట్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారిలో క్యాటరాక్ట్ వచ్చే ప్రమాదం ఉంది. కావున సంబంధిత కంటి పరీక్షలూ చేయించుకోవాలి.
మధుమేహాన్ని సరిగా నియంత్రణలో పెట్టుకోకపోతే.. దాని దుష్ప్రభావం కంటిలోని కీలకమైన రెటీనా పొర మీద కూడా పడుతుంది. ఒకసారి ఈ పొర దెబ్బతినటం మొదలైందంటే.. అది మరింత దెబ్బతినకుండా చూడటం తప్పించి.. సమస్యను పూర్తిగా నయం చెయ్యటం సాధ్యం కాదు. కాబట్టి అసలీ సమస్య తలెత్తకుండా చూసుకోవటం అత్యుత్తమం. ఒకవేళ సమస్య మొదలవుతుంటే దాన్ని సత్వరమే పట్టుకుని వెంటనే అడ్డుకోవటం అత్యవసరం. మధుమేహం వచ్చినా, అది అదుపు తప్పినా కూడా మనకు పైకి పెద్దగా లక్షణాలేమీ ఉండకపోవచ్చుగానీ అది క్రమేపీ లోలోపల కీలక అవయవాలన్నింటినీ దెబ్బతీస్తుంటుంది. దీనికి మన కన్ను కూడా మినహాయింపేం కాదు.
మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినటం, ముఖ్యంగా రెటీనోపతి’ అన్నది చాలా తీవ్రమైన సమస్య. కంటి లోపల రెటీనా పొర దెబ్బతింటున్నా కూడా తొలిదశలో పెద్దగా లక్షణాలేం ఉండకపోవచ్చు. కానీ లోలోపల సమస్య ముదురుతూ, చూపు మొత్తం దెబ్బతిని, అంధత్వంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. తొలిదశలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. చూపు బానే ఉంటుంది. క్రమేపీ ముదురుతున్న దశలో- అక్షరాలు వంకరగా అగుపించటం, పక్క పదం కనబడకపోవటం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఈ సమయంలో జాగ్రత్త పడితే సమస్య ఇంకా ముదిరి చూపు పూర్తిగా పోయే స్థితి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి చూపులో ఎలాంటి తేడా కనబడినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి, తప్పకుండా రెటీనా పరీక్ష చేయించుకోవాలి.
మధుమేహాం ఉన్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…?
కంటి సమస్యలు మధుమేహులు ఎవరికైనా రావచ్చుగానీ… దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారికి, ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో లేని వారికి ఈ సమస్యల ముప్పు చాలా ఎక్కువ. మధుమేహం వచ్చిన పదేళ్ల తర్వాత దుష్ప్రభావాలు మొదలవ్వచ్చు. అయితే మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే 10 ఏళ్ల తర్వాత రావాల్సిన మార్పులు ఐదేళ్లకే రావచ్చు. అవి పదేళ్లకల్లా చూపును దెబ్బతీసే స్థాయికి చేరుకోవచ్చు. రెటీనోపతీకి చేసే చికిత్సలన్నీ కూడా సమస్య మరింతగా ముదరకుండా చూసేవేగానీ తగ్గిన చూపును పూర్తిగా తెచ్చిపెట్టేవి కాదు. పైగా ఈ చికిత్సలతో సమస్య పూర్తిగా తొలగిపోయినట్లూ కాదు. మధుమేహం కారణంగా మరోచోట.. అంటే చికిత్స చేసిన చోట కాకుండా వేరే చోట సమస్యలు బయల్దేరుతుండొచ్చు. ఈసారి వచ్చే సమస్య ఇంకాస్త ఉద్ధృతంగానూ ఉండొచ్చు. కాబట్టి చికిత్సతో అంతా అయిపోయిందనుకోకుండా.. మధుమేహాన్ని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి.
వైద్యులు చెప్పినట్లుగా తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ.. లోపల పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటుండాలి. జీవితాంతం కంటి మీద ఈ శ్రద్ధ తప్పదు. లేదంటే చూపుకు ఎప్పుడైనా ఎసరు ముంచుకురావచ్చు. మధుమేహావ్యాధి తీవ్రంగా ఉన్నవారికి రక్తనాళాల్లో గ్లూకోజ్ పెరిగి, డయాబెటిక్ రెటీనోపతి వల్ల కంటిచూపు మందగిస్తుంది. మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉన్నా సరే సమస్యలు రావచ్చు. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలి. అప్పుడే మన కళ్లకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.