గర్భం ధరించిన వారికి, ఆ తొమ్మిది నెలల సమయంలో ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి వాటిలో జెస్టేషనల్ డయాబెటిస్ ఒకటి. ఈ సమస్య వచ్చిన వారు బిడ్డకు డయాబెటిస్ వస్తుందేమో అని తెగ భయపడి పోతుంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది, జెస్టేషనల్ డయాబెటిస్ కాన్పు తర్వాత కూడా వెంటాడుతుందా.
ఇంట్లో ఓ అమ్మాయి అమ్మగా మారుతుందంటే ఆ కుటుంబం మొత్తానికి ఎంతో సంతోషకరమైన విషయం. అలాంటి సంతోషాల వెనుక సమస్యలు కూడా దాగి ఉంటాయి. వాటిలో జెస్టేషనల్ డయాబెటిస్ కూడా ఒకటి. గర్భం దాల్చిన తర్వాత ఎదురయ్యే మధుమేహం ఇది. ఈ సమస్య వల్ల బిడ్డలకు అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీని ప్రభావం ఏ మాత్రం బిడ్డ మీద పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇందులో ప్రధానమైనది ప్రతిరోజూ శరీరంలో ఉండే షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడమే. దీని వల్ల బిడ్డ పుట్టిన తర్వాత ఏ విధమైన డయాబెటిక్ సమస్యలు ఎదురు కావు. సాధారణంగా గర్భం దాల్చినప్పుడు జెస్టేషనల్ డయాబెటిస్ ఉందంటే పుట్ట బోయే బిడ్డకు టైప్ 2 డయాబెటిస్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్య ఉన్నప్పటికీ ఆరోగ్యవంతమైన బిడ్డను కనవచ్చు. అయితే అది జెస్టేషనల్ డయాబెటిస్ ను అదుపులో ఉంచుకున్నప్పుడే సాధ్యమౌతుంది. లేదంటే ఆపరేషన్ తప్పనిసరి అయ్యే పరిస్థితి ఎదురౌతుంది.
ఈ సమస్య ఉన్నప్పడు బిడ్డ అధిక బరువుతో పుట్టడం, రక్తంలో ఎక్కువగా గ్లూకోజ్ పేరుకుపోవడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డకు వెంటనే ఇన్సులిన్ అందించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. దీంతో పాటు బిడ్డకు రెస్పిటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ సమస్య ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. దీని వల్ల బిడ్డలు శ్వాస తీసుకోవడం సమస్యలు ఎదురు కావచ్చు. దీని వల్ల తల్లికి కూడా అనేక సమస్యలు ఎదురౌతాయి. ప్రధానంగా డెలివరీ కష్టం అవుతుంది. రక్తపోటు పెరుగుతుంది. భవిష్యత్ లో మళ్ళీ గర్భం దాల్చినప్పుడు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. బరువు పెరగడంతో పాటు, డయాబెటిస్ సమస్య బాధిస్తుంది.
సాధారణంగా గర్భం దాల్చిన ప్రతి మహిళలో ఈ సమస్య ఎంతో కొంత ఉంటుంది. అయితే చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సమస్య ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 25 ఏళ్లకు పైబడిన వారిలో మాత్రమే ఈ సమస్య ఎదురౌతుంది. అదే విధంగా కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నట్లైతే ఈ ప్రమాదం మరింత ఎక్కువ. అధిక బరువు ఉండే కుటుంబాల్లో పుట్టబోయే పిల్లలకు కూడా ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఎక్కువే. ఈ సమస్య ఉందని పరీక్షల ద్వారా తెలుసుకోవడమే తప్ప, దీనికి ఈ కారణాలు మాత్రమే ఉన్నాయని కచ్చితంగా చెప్పలేము. అయితే గర్భం దాల్చిన వారిలో హార్మోన్లలో అనేక మార్పులు ఎదురౌతాయి. దాని వల్ల ఈ సమస్య ఎదురు కావచ్చు. అదే విధంగా తల్లి తీసుకునే ఆహారంలో కొంత భాగం బిడ్డకు కూడా అందుతుంది. ఇందులో భాగంగా గ్లూకోజ్ రక్తంలోకి వెళ్ళినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే తల్లిని బిడ్డను కలిపే పేగు ద్వారా కొన్ని రకాల హార్మోన్లు ప్రయాణిస్తాయి. వాటి ద్వారా కూడా ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. వైద్యులు ఈ సమస్య వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి, సరైన చికిత్సను సూచిస్తారు. దానితో పాటు బిడ్డను కన్న తర్వాత కూడా తల్లులు ఎప్పటికప్పుడు ఈ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలు ఎన్ని మార్లు చేయించుకోవాలన్న అంశం, గర్భవతిగా ఉన్నప్పడు చేసిన పరీక్షల్లో తేలిన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా సమయాల్లో ఇది 20వ నెలలో ఎదురౌతుంది. కొంత మందిలో మాత్రం తొలి నాటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
ఈ ఇబ్బందులు ఎదురైనప్పుడు రక్త పరీక్షల ద్వారా వైద్యులు సమస్యను నిర్థారిస్తారు. అంత కంటే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య భవిష్యత్ లో ఎదురు కాకుండా, బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడొచ్చు. ముందుగా గర్భవతులైన తల్లుల బరువు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా బరువు ఉన్న తల్లుల్లో ఈ సమస్య రావడానికి ఆస్కారం ఉంది గనుక, బరువును అదుపులో ఉంచుకోవాలి. అదే విధంగా కుటుంబంలో ఎవరికైనా షుగర్ సమస్య ఉందంటే, గర్భవతి అని తెలిసిన నాటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదే విధంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఎక్కువగా ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లికి, బిడ్డకు ఇద్దరికీ మేలు చేస్తుంది. ఆహారంలో కొవ్వు పదార్థాలు, కాలరీలు తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. అదే విధంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు ఎక్కువగా తీసుకోవాలి. గర్భవతులు ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురౌతాయి. అందుకే ఎప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రక్తపోటు పెరగకుండా చూసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. అప్పుడే పుట్టబోయే బిడ్డకు సమస్య రాకుండా తల్లులు కాపాడుకోవచ్చు. ఒక సారి ఈ సమస్య వచ్చినా భవిష్యత్ లో కొనసాగాలన్ని నియమమేం లేదు. ప్రారంభంలో ఈ సమస్యను గుర్తించి, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ జెస్టేషనల్ డయాబెటిస్ నుంచి బయటపడవచ్చు.








