ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు బాగా పెరుగుతున్నాయి. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ… ఇబ్బంది పెట్టడం ఎప్పుడో ఒకసారి అనుభవంలోకి వచ్చే విషయమే.. పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆపై పులితేన్పులు, ఎడతెగని అపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది.
కడుపులో గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాదారణ విషయం. కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల ఇది తలెత్తుతుంది. జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో ఇది ప్రధానమైంది. మారిన జీవనశైలి నేపథ్యంలో వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడం, ఆందోళన, రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోవడం, కదలకుండా ఎక్కువ సేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం, మసాలా ధినుసులు ఎక్కువగా తీసుకోవడం గ్యాస్‌ట్రబుల్‌కు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.
కడుపులో మంట..అజీర్తి..గ్యాస్ నొప్పి లాంటివి రావడం జరుగుతుంది. కొన్ని సార్లు మనం తీసుకొనే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారంనకు దారితీస్తుంది. చిన్న ప్రేగులలో జీర్ణము చెయ్యబడని కార్బోహైడ్రేట్ల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది. పలు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తిన్నప్పుడు మాత్రమే వస్తుంది. మనం తినే అన్ని రకాల ఆహారాల వల్ల గ్యాస్, అసిడిటీ రావు. కేవలం కొన్నింటి వల్లే ఆ సమస్య వస్తుంటుంది. వాటికి దూరంగా ఉండడం ద్వార గ్యాస్ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
మీరు అనుకున్నదానికంటే ఎక్కువ గ్యాస్ కలిగి ఉంటే, మీరు చాలా గాలిని మింగడం ఒక కారణం కావచ్చు. ఆ గాలిలో కొంత భాగం బర్ప్స్‌గా బయటకు రావచ్చు. మిగిలినవి అపానవాయువుగా బయటకు వస్తాయి. చాలా విషయాలు మిమ్మల్ని గాలిని మింగేలా చేస్తాయి. ఎక్కువగా చూయింగ్ గమ్ నమిలేటప్పుడు గాలిని మింగుతూ ఉండవచ్చు. వేగంగా తినడం లేదా స్ట్రాస్ ద్వారా తాగడం కూడా గాలిని ఎక్కువగా మింగడానికి మరియు మరింత గ్యాస్‌కి దారి తీస్తుంది.
పగటిపూట అదనపు గాలిని తీసుకోకపోయినప్పటికీ నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి ఊపిరి పీల్చుకుంటే లేదా గురక పెట్టినట్లయితే, రాత్రిపూట చాలా గాలిని మింగవచ్చు. గట్‌లో నివసించే బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఎక్కువగా పెరిగితే, మరింత గ్యాస్ సమస్యలు వస్తాయి. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే బ్యాక్టీరియా ఆరోగ్యకరమైనవి కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో, గ్యాస్‌గా ఉండటానికి కారణం ఇదే అయితే యాంటీబయాటిక్స్ సహాయపడవచ్చు.
మనం తీసుకోనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక ఫైబర్ ఆహారాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాలు జీర్ణం కాకపోవటం వలన గ్యాస్ ఏర్పడుతుంది. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. అయితే ఫైబర్ గ్యాస్ ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది. అలాగే క్రమ పద్ధతి పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్య ఉద్భవిస్తుంటుంది. హితముగా, మితముగా సమయానికి సరిగ్గా ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య పెద్దగా కనిపిచందని వైద్యనిపుణులు అంటున్నారు.
కడుపు ఉబ్బరంగా ఉండటానికి ప్రధాన కారణం మలబద్దకం, నిత్యం సరైన సమయానికి మలవిసర్జన అలవాటుచేసుకోవాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ గ్యాస్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. కొవ్వు పదార్థాలు తినటం కడుపు ఉబ్బరానికి దోహదం చే స్తుంది. కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడెందుకు ముందుగా మనం తీసుకొనే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్య అధిగమించవచ్చు.
తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి. పెదవులు మూసి తినడం మంచిది. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి. గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం. మనం ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.
కొంతమందికి గ్యాస్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అది తినే ఆహారం వల్ల కావొచ్చు. … పొట్టలో ఇన్ ఫెక్షన్ల వల్ల కావొచ్చు. ఔషధాల ద్వారా లేదా ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం ద్వారా ఈ గ్యాస్ ట్రబుల్ ను తగ్గించుకోవచ్చు. అయితే, కొందరిలో ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు వైద్య పరీక్షలు నిర్వహంచాల్సి ఉంటుంది. వ్యాయామం చేసే వారిలో గ్యాస్ సమస్యలు తక్కువగా ఉంటాయి.