Glaucoma – కంటి చూపుని పోగొట్టే గ్లకోమా వ్యాధి

By manavaradhi.com

Updated on:

Follow Us
Can glaucoma be cured

కంట్లో చిన్న నలక పడితే…ఎంతో అసౌకర్యానికి గురవుతాం. వెంటనే అప్రమత్తమై ఆ ఇబ్బందిని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ కంటి చూపునే హరించే కొన్ని వ్యాధుల్ని కనిపెట్టడంలో విఫలమవుతున్నాం. ఆ వ్యాధిని గుర్తించి చికిత్సనందించేలోపే జరగకూడని నష్టం జరిగిపోయి పూర్తిగా కంటి చూపే కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. అలా చాపకింద నీరులా వ్యాపించే కంటి వ్యాధుల్లో ‘గ్లకోమా’ ఒకటి. ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పరుచుకుని ముందుచూపుతో వ్యవహరించగలిగితే అంథత్వాన్ని సమర్ధవంతంగా అడ్డుకోవచ్చంటున్నారు.

కంటి చూపు విషయంలో కొన్ని రకాల నాడులు కీలక పాత్ర పోషిస్తాయి. గ్లకోమా సమస్య ఏర్పడినప్పుడు కంటిలో ద్రవాల ఒత్తిడి పెరిగి ఆ నాడుల పనితీరు మందగిస్తుంది. ప్రపంచంలో చాలా మందిలో ఈ సమస్య అంధత్వానికి కారణం అవుతోంది. ముఖ్యంగా పిల్లల నాడులు మరింత సున్నితంగా ఉన్న కారణంగా పిల్లల్లో గ్లకోమా సృష్టించే సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని గ్లకోమాను అనేక రకాలుగా వర్గకరించవచ్చు. ఇందులో సాధారణ ఒత్తిడి ఉన్న గ్లకోమా విషయానికి వస్తే, ముందుగా గుర్తించలేకపోవడం వల్ల పూర్తిగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని ప్రారంభంలో గుర్తించగలిగితే, ఏ విధమైన సమస్య లేకుండా బయట పడవచ్చు.

ఓపెన్ యాంగిల్ గ్లకోమా సమస్యలో ద్రవం బయటకు పోయే పరిస్థితి లేక దృక్ నాడి ప్రబావితమై క్రమంగా చూపు తగ్గిపోతుంది. ఇక యాంగిల్ క్లోజర్ గ్లకోమాను మూడో ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. కంటిలోని ద్రవం బయటకు పోకుండా ఒకే కోణంలో ఆగిపోతే ఈ సమస్య ఎదురౌతుంది. ఇది అత్యవసర పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వైద్యున్ని సంప్రదించకపోతే, భవిష్యత్ లో మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.

Eye drops

పిల్లల్లో పుట్టుకతోనే గ్లకోమా రావడానికి ఆస్కారం ఉంది. దీన్నే బర్త్ గ్లకోమాగా చెబుతారు. దీనికి వెంటనే చికిత్స అవసరం. కంటి పాప రంగును కోల్పోతూ ఉండడాన్ని పిగ్మెంటరీ గ్లకోమాగా చెబుతారు. కంటి మీద అధిక ఒత్తిడి ఉన్న కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా బాగా చదివే పిల్లలు, టీవీని దగ్గరగా చూసే పిల్లల్లో కంటి మీద అధిక ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు వారి కంటిలో ఉండే భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ మార్గంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా పిల్లల మీద దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.

సాధారణంగా వృద్ధాప్యం, అనువంశిక వారసత్వం, గాయాలు, ఉత్ప్రేరకాలు తీసుకోవడం, మధుమేహం, గుండె జబ్బులు, అదిక రక్తపోటు, కంటిలో ఇన్ఫెక్షన్, రెటీనాలో నొప్పి, వాపు, రంగులు మారడం హ్రస్వదృష్టి లాంటి లక్షణాలు గ్లకోమా ప్రారంభంలో ఎదురౌతాయి. ఓ దశ వచ్చే వరకూ గ్లకోమా లక్షణాలు కూడా బయటపడవు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో, ఈ సమస్య ఏ మేరకు ఉందనే విషయాన్ని పరిశీలించాలి. వయసుపైబడుతున్నవారిలో కూడా ఈ గ్లకోమా సమస్యలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి సకాలంలో స్పందించి పరిష్కార మార్గాలు చూసుకోవాజలి. అయితే ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తించామన్నదే కీలకం.

కంటి సమస్యలు ఉన్నవారు ఏ మాత్రం అశ్రద్ద చేయకూడదు. గ్లకోమా సమస్యను ప్రారంభంలోనే గుర్తించ గలిగితే చుక్కల మందు ద్వారా మంచి పరిష్కారాన్ని అందించవచ్చు. ఆలస్యం అయ్యే కొలదీ, శస్త్ర చికిత్స లేదా లేజర్ చికిత్స అవసరం కావచ్చు. మొదటి దశలోనే ఈ సమస్యను గుర్తించడం ద్వారా ఇది సాధ్యమౌతుంది. అందుకోసం తరచుగా కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. కుటుంబంలో గతంలో ఎవరైనా ఈ సమస్యతో ఇబ్బంది పడి ఉంటే, దీన్ని మరింత జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి.

ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చలువ కళ్ళద్దాలు ధరించాలి. వైద్యులు సూచించిన విధంగా మందులు వాడుతూ కంటిని గాయాల బారి నుంచి రక్షించుకోవడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అకస్మాత్తుగా కనిపించకపోవడం, కంటిలో తీవ్రమైన నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు, కళ్ళు ఎర్రబారడం, మసకబారడం లాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంటి వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యకు ఆస్కారం లేకుండా గ్లకోమా బారినుంచి బయటపడవచ్చు.

పిల్లల నుంచి పెద్దల వరకు ఏ వయసు వారికైనా గ్లకోమా రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే ప్రైమరీ గ్లకోమాను నియంత్రించే అవకాశాలు లేకపోయినా అప్రమత్తతతో వ్యాధి ముదిరిపోకుండా చికిత్సతో అదుపు చేయవచ్చు. అలాగే ఇతర వ్యాధుల ప్రభావం, స్టిరాయిడ్‌ మందులు, ప్రమాదాల వల్ల వచ్చే గ్లకోమాలను కూడా కొన్ని ముందు జాగ్రత్త చర్యలతో నివారించవచ్చు.

Leave a Comment