సహజంగా ప్రతి ఒక్కరూ ఎటువంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే హై బీపీ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశాలు ఉండవు. అందుకే హైబీపీని సైలెంట్ కిల్లర్ అని అంటారు. హై బీపీని ముందుగానే గుర్తిస్తే దాంతో జాగ్రత్త పడవచ్చు.
బీపీ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులోనూ అధికంగా బీపీకి గురిఅవుతున్నట్లు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80 నమోదు కావచ్చు. అయితే ఈ బి.పి మనిషి నుండి మనిషికి వయస్సు పెరుగుతున్న కొద్దీ మార్పు చెందుతుంది. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుటుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి.
ఒత్తిడి, ఉప్పు ఎక్కువగా తినటం, డయాబెటిస్ వంటివి అధిక రక్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇతర సమస్యలకోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అధిక రక్తపోటుని గుర్తిస్తుంటారు. లేదా రక్తపోటు కారణంగా ఇతర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు ఆసుపత్రికి వెళితేనే… అధిక రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపిని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే బీపీ కారణంగా ఇతర అవయవాలకు హాని కలగకుండా ఆపవచ్చు.
హై బీపీ రావడానికి కారణాలు ఏంటి ?
అధిక రక్తపోటుకు ఎన్నో రకాల కారణాలున్నాయి. శరీరంలో నీటి శాతం తగ్గినా లేదా బలహీనంగా ఉన్నవారు తొందరగా ఆందోళనకు గురవుతారు. ఈ సమస్యల వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉన్నా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు అతిప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు, సెప్టిక్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు హార్మోన్ల పని విధానంలో తేడా వస్తుంది. అధిక బరువు ఉన్నవారికి, క్రియాశీలంగా లేనివారికి, మితిమీరి ధూమపానం, మద్యం సేవించేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలున్నాయి.
తీసుకుంటున్న ఆహారంలో 6 గ్రాములకు మించి ఉప్పు ఉన్నట్లయితే అధిక రక్తపోటుకు కారణం అదే అని చెప్పొచ్చు. అధికంగా చక్కెర ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.. ఒత్తిడితో కూడిన లైఫ్ స్టయిల్ వల్ల బ్లడ్ ప్రెజర్ తో పాటు మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ ను అధిక మోతాదులో తీసుకోవడం ల్ల కూడా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కొన్ని రకాల జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ రక్తపోటు సమస్యకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు.
హై బీపీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?
రక్తపోటును తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను తప్పకుండా పాటించాలి. ఇందులో ప్రధానమైనది అధిక పొట్టను, బరువు తగ్గించుకోవడం. మన బరువు పెరిగే కొద్దీ గుండె మీద రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. ఫలితంగా ఎక్కువ పని చేసి, అనేక సమస్యలకు కారణమౌతుంది. అందుకే ముందు బరువు తగ్గించుకోవాలి. ఆల్కహాల్ తీసుకోనే అలవాటును వెంటనే మానేయాలి. ధూమపానానికి, ధూమపానం చేసే వారికి వీలైనంత దూరంగా ఉండాలి. కాపీ లాంటి కేఫినేటెడ్ పానీయాల వల్ల రక్తపోటు అధికం అవుతుంది గనుక వీటిని కూడా వీలైనంత వరకు తగ్గించాలి.
రక్తపోటు విషయంలో ఉప్పు తెచ్చే ప్రమాదం అంతా ఇంతా కాదు. రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్ళు, కూరగాయల్లో ఉప్పు ఉంటుంది. శరీరానికి ఇది సరిపోతుంది. ఎక్కువ ఒత్తిడి, ఆందోళన రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఏ విషయంలో ఆందోళన వద్దు. వీలైనంత మేర ఆందోళన కలిగించే అంశాలకు దూరంగా ఉండడం మంచిది. దీని కోసం యోగ, ధ్యానం, వ్యాయామం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు రక్తపోటు పరిస్థితి తెలుసుకుంటూ అదుపులో ఉంచుకునేందుకు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతుండాలి.
రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి శారీరకంగా మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అధిక బరువు ఉండటం వలన మరెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి తగినంత వ్యాయామం ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. దాంతో ఆరోగ్యంగా ఉంటారు, బరువు మరియు రక్తపోటు అదుపులో ఉంటాయి.