Mediterranean diet: మీరు ఎప్పుడైనా మెడిటేరియన్ డైట్ గురించి విన్నారా?

By manavaradhi.com

Published on:

Follow Us
Super foods

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికీ జీవనాధారం ఆహారమే. ఆహారమే ఆరోగ్యాన్ని అందిస్తుంది. అపశృతి దొర్లితే అదే ఆహారం అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు మాత్రం మనకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి. అలాంటి వాటిలో మెడిటరేనియన్ డైట్ కూడా ఒకటి.

మెడిటేరియన్ ఫుడ్ అంటే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉండే ప్రజల ఆహారపు అలవాట్లుగా చెప్పుకోవచ్చు. బాగా ఉడికించడం, డీప్ ఫ్రై చేయడం, రుచి కోసం సాధారణ నూనెల్లో బాగా వేయించడం, లేదంటే కొవ్వు పదార్థాలు వినియోగించడం లాంటివి ఈ ఆహారంలో ఉండవు. మెడిటేరియన్ ఫుడ్ అంటే తృణ ధాన్యాలను బాగా వాడడం జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కు దారి తీసే శాచురేటెడ్ ఫ్యాట్స్ స్థానంలో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ను అధికంగా వాడతారు.

ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రైఫ్రూట్స్, చేపలు, లీన్ మీట్ అంటే స్కిన్ లెస్ చికెన్ వంటివి కొద్ది స్థాయిలో అదే విధంగా ఆలివ్ ఆయిల్, ఫైబర్ రిచ్ ఇంగ్రీడియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ వాడతారు. అంటే ఈ ఆహారంలో కొవ్వుకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి పోషణ అందుతుందే తప్ప, చెడు చేసే ఇతర అంశాలను పెరగకుండా కాపాడుతుంది. అందుకే మెడిటేరియన్ డైట్ తీసుకోమని నిపుణులు చెబుతూ ఉంటారు.

ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయినప్పటికీ ఈ డైట్ ను తీసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో జీర్ణం కావడానికి గానీ, అదే విధంగా శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగకుండా ఉండడానికి గానీ ప్రయోజనకరంగా ఉంటుంది. మిగతా ఆహారాల వలే మెడిటేరియన్ ఫుడ్ నోరు ఊరించకపోయినా, జీవన ప్రమాణాన్ని మాత్రం పెంచడంలో మేలు అని పరిశోధనలు చెబుతున్నాయి.

మెడిటేరియన్ డైట్ తీసుకోవడం ద్వారా ఆయుర్థాయం పెరిగిందనే విషయాన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఆహారంలో మార్పుల వల్ల వచ్చే వివిధ సమస్యలు మెడిటేరియన్ డైట్ వల్ల తగ్గుముఖం పట్టాయి. జీవితకాలం పెరుగుతుంది. సాధారణంగా ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు గుండె జబ్బులు మధ్యధరా ప్రాంతంలో బాగా తక్కువ. ఇటీవల కాలంలో వచ్చిన ఓ అధ్యయనం ప్రకారం భారతదేశంలో పల్లె ప్రాంతాల్లో స్వచ్ఛతా లోపం వల్ల వస్తున్న వ్యాధులు ఎక్కువ అయితే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం గుండె జబ్బుల ప్రమాదం బాగా పొంచి ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా మెడిటేరియన్ డైట్ మీద దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ లేని, ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఆహారం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయనేది వైద్యులు మాట.

శారీరకంగానే కాకుండా మానసికంగా ఈ డైట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముదిమి వయసులో వచ్చే మతిమరుపు లాంటి సమస్యలు ఈ డైట్ వల్ల తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అయితే మెడిటేరియన్ డైట్ కు సంబంధించిన పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందరికీ ఇదే ఆహారం పూర్తి స్థాయిలో మేలు అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకూ వైద్యులు పూర్తిగా నిర్థారించలేదు. కారణం అన్ని రకాల శరీర తత్వాలకు ఒకే రకమైన ఆహారం మంచిది కాదు అనే ఆహార నిపుణుల సలహా. అందుకే మెడిటేరియన్ డైట్ విషయంలో భిన్న వాదనలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

మరికొందరు మాత్రం ఈ డైట్ ద్వారా భవిష్యత్ లో మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు. భారతదేశంలో వాతావరణ పరిస్థితులు, ఇక్కడి ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మెడిటరేనియన్ డైట్ ను మార్చుకుని తీసుకోగలిగితే, అదే సమయంలో రెండు రకాల ఆహారాలకు మధ్య సరైన సమన్వయం పాటించగలిగితే కొంత వరకూ మేలు జరుగుతుంది. శరీర తత్వాన్ని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి, నిపుణుల సలహాతో మెడిటరేనియన్ డైట్ తీసుకోవడం మేలు చేస్తుంది.

Leave a Comment