మనసుకు బద్ధకం వస్తే కాసేపు టైమ్ వృధా అవుతుంది. పుస్తకం చదువుకోవడం ద్వారానో.., ఏ సినిమా చూసో కాలక్షేపం చేస్తాం. ఇంకా బద్ధకం వదలలేదనుకుంటే యోగా చేయడం ద్వారానో.., పని ఒత్తిడిలో పడో ఆ బద్ధకాన్ని వదిలించుకుంటాం. మరి శరీరంలో జీర్ణవ్యవస్థకు బద్ధకం వస్తే పరిస్థితి ఏంటి?. దీన్నే మలబద్ధకం అంటారు.ఇదేమీ పెద్ద రోగం కాదులే అనిపిస్తుంది. కానీ పెద్ద పెద్ద రోగాలకు ఏ మాత్రం తీసిపోకుండా మన శరీరాన్ని నిర్వీర్యం చేయగలదు. ఆధునిక జీవితంలో సాధారణం అయిపోయిన మలబద్ధకం సమస్యకు మందులు కంటే జీవనవిధానంలో మార్పులే పరిష్కారం అంటున్నారు డాక్టర్లు.
మన శరీరానికి సరపడని, లేదా సరిగా జీర్ణం చేసుకోలేని పదార్ధాలను తినడం లేదా తిన్న పదార్ధాలు అరిగేలా శారీరక శ్రమ లేకపోవడం అనేదే మలబద్ధకం సమస్యకు అసలు కారణం. నోటి ద్వారా తీసుకున్న ఆహారం, పేగులు, జీర్ణాశయంలలో పూర్తిగా అరిగిన తరువాత శక్తి రక్తంలో కలిసిపోతుంది. మిగిలిపోయిన వ్యర్ధం అంతా మలం రూపంలో బయటకు వచ్చేయాలి. మలబద్ధకం సమస్య ఉన్న వారికి ఈ వ్యర్ధాలు పూర్తి స్థాయిలో బయటకు రావు. ఫలితంగా అది శరీరంలో అనేక రోగాలకు ప్రధాన కారణం అవుతుంది. మలబద్ధకం ఒకప్పుడు వృద్ధులకు, కొంతమంది గర్భిణీ స్త్రీలలో మాత్రమే కనిపించే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అన్ని వయసువారిల్లోనూ మలబద్ధకం కనిపిస్తోంది. కొన్ని కుటుంబాల్లో ఇదో సాధారణ ఆరోగ్య సమస్య అయిపోయింది. రోజూ ఆహారం తీసుకున్న తరువాత జీర్ణానికి ఓ టాబ్లెట్ వేసుకుని అరిగించుకోవాల్సిన పరిస్థితి. కానీ తిన్నది అరగడం అనేది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. అలా జరగడం లేదంటే మన జీవనవిధానంలోనే మార్పులు చేసుకోక తప్పదు.
ప్రతి పదిమందిలో ఏడుగురు మలబద్ధకంతో బాధపడుతున్నారని ఓ అంచనా. దీనికి మారిన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం అవుతున్నాయి. పని ఒత్తిడిలో హడావుడిగా తినడంతో పాటు రుచి కోసం జీర్ణవ్యవస్థకు సరిపడని ఆహారాలు తింటున్నారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాల వలన సాధారణంగా జీర్ణసమస్యలు వస్తుంటాయి. పిజ్జా, బర్గర్లతో పాటు నూనెలో ఎక్కువ సేపు వేయించిన పదార్ధాలు, చీజ్ లాంటివి తరుచూ తినేవారిలో ఈ మలబద్ధకం అతి సాధారణమైన సమస్య. దీనికి తోడు వేళ కాని వేళలో తినడం కూడా ఓ కారణమే. ఒత్తిడి కూడా మలబద్ధకానికి ప్రధాన కారణం. ఉరుకులు, పరుగుల జీవితంలో చిన్నపిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరిలోనూ మానసిక ఒత్తిడి సాధారణం అయిపోయింది. ఈ ఒత్తిడి వలన ప్రధానంగా ప్రభావితం అయ్యేది జీర్ణవ్యవస్థ. జీర్ణానికి అవసరం అయిన ఎంజైమ్స్ విడుదల అవ్వాల్సిన స్థాయిలో విడుదల కాక మలబద్ధకానికి కారణం అవుతుంది. అలాగే ఒత్తిడిలో ఉన్నవారు అవసరం కంటే ఎక్కువ తిండి తినేస్తుంటారు. ఇది కూడా అరుగుదల సమస్య తెచ్చిపెడుతుంది. కొన్ని దీర్ఘకాల రోగాలకు మందులు వాడేవారిలోనూ మలబద్ధకం సమస్య తలెత్తుంది.
మలబద్ధకానికి మందుల కంటే మన ఆహారపు అలవాట్లు, జీవనవిధానంలో మార్పుల వలనే సమస్య పరిష్కారం అవుతుంది. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. బీరకాయ, పొట్లకాయ, చిక్కుడు వంటి కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే ఆకుకూరల వాడకం పెంచాలి. మలబద్ధకం తగ్గించడంలో పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆయా సమయాల్లో తింటూ ఉండాలి. స్నాక్స్ బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. తరచూ ద్రవపదార్ధాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఉదయం నిద్ర లేవగానే గ్లాసుడు నీళ్లు తాగడం వలన జీర్ణవ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. వేపుళ్ళు, పచ్చళ్ళు, నిల్వ ఉంచిన, ఆయిల్ ఎక్కువగా ఉండే పదార్ధాలకు వీలయినంత దూరంగా ఉండాలి. మలబద్ధకం పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు మాంసాహారాన్ని వదులుకోవడమే మేలు. జీర్ణ శక్తిని తగ్గించే కాఫీ, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు తినే తిండిపై అదుపు ఉండదు. కాబట్టి ఆల్కహాల్ మానేయడం ఉత్తమం.
కొందరికి చిరుతిళ్ళు తినే అలవాటు ఉంటుంది. సమయం, సందర్భం లేకుండా చేతికి అందినవాటిని తింటూనే ఉంటారు. మరికొందరు ఆకలిగా లేకున్నా ఇష్టమైన ఆహారం కనిపిస్తే ఆగలేరు. అలాంటి సందర్భాల్లో కోరికలు అదుపులో పెట్టుకోవాలి. ఆహారంతో పాటు జీవనశైలిలోనూ మార్పు తెచ్చుకోవాలి. రోజంతా కూర్చుని పనిచేసేవారు, శారీరక శ్రమ పెద్దగా లేనివారు వ్యాయామాలు కచ్చితంగా చేయాల్సిందే. ప్రతి రోజూ యోగా లేదా 30 నిమిషాల పాటు తేలిక వ్యాయామాలు చేయడం మంచిది. రోజూవారీ జీవితంలో మానసిక ఒత్తిడి తగ్గించుకుని ఉత్సాహంగా ఉండాలి. భోజనం వేళలు విషయంలో శ్రద్ధ అవసరం. అలాగే విరేచనం వచ్చినప్పుడు ఆపుకోవడం ప్రమాదకరం. తరచూ ఇలా ఆపుకోవడం వలన మలబద్ధకం సమస్య తలెత్తవచ్చు. కాబట్టి అవసరం అయినప్పుడు కడుపు ఖాళీ చేయాల్సిందే. ఇలా రోజువారీ జీవితాన్ని ఓ క్రమపద్ధతిలో అలవాటు చేసుకుంటే మలబద్ధకం సమస్య నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.
మలబద్ధకాన్ని వదిలించుకుంటే… శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉన్న వ్యక్తి ఏ పనైనా రెట్టించిన వేగంతో చేస్తారని వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి రోజూ రొటీన్‌గా చేసే పనుల్ని కాస్త శ్రద్ధగా…శరీరానికి తగినంత శ్రమ కలిగించేలా చేస్తే మలబద్ధకం సమస్య దరిచేరకుండా ఉంటుంది.







