ప్రకృతి మనకు సహజ సిద్ధంగా ప్రసాదించిన ఆహారం పండ్లు. తాజా పండ్లు రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఐతే తాజా పండ్ల ద్వారా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. అందులో లభించే విటమిన్లు, ఖనిజలవణాలు .. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకుంటాయంటున్నారు.
తాజా పండ్లు . . మంచి ఆరోగ్యానికి బాటలు వేస్తుంది. రోజూ ఆహారం తీసుకున్న తర్వాత.. ఓ పండు తినేవారు చక్కని ఆరోగ్యంతో ఉంంటారు. పండ్లలో విటమిన్లు, ఖనిజలవణాలు .. నీటి శాతం శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అందుకే తప్పనిసరిగా రోజూ పండ్లు తీసుకోవాలని వైద్యులు .. సూచిస్తూ ఉంటారు. పండ్లను నేరుగా తిన్నా.. లేదా సలాడ్ , జ్యూస్ రూపకాలుగా తీసుకున్నా.. మంచిదేనని చెబుతుంటారు. ఏ సీజన్ లో దొరికే ఫలాలను ఆ సీజన్ లో ఆస్వాదించాలని.. తద్వారా .. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందంటున్నారు వైద్యులు.
తాజా ఫలాల్లో కేలరీలు, కొవ్వు శాతం తక్కువగానే ఉంటాయి. అంతే కాదు పండ్లలో పీచు, ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల .. ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టకుండా ఉంటాయి. ముఖ్యంగా కొలస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పీచు కారణంగా . . పేగులు శుభ్రంగా ఉండి.. మల్లబద్దకం సమస్య నుంచి గట్టెక్కవచ్చు. పండ్లలో పీచు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కదా.. ఈ కారణంగా పండ్లు తక్కువ తినగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో ఊబకాయం సమస్య వచ్చే అవకాశం లేదు. రోజూ పండ్లు తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు రావడం చాలా అరుదుగా ఉంటుంది. అంతే కాదు రక్తపోటు, పక్షవాతం, పలు రకాల కేన్సర్లు రాకుండా పండ్ల నుంచి లభించే పోషకాలు అడ్డుకుంటాయి…
రోజూ.. ఓ ఆపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు. ఇది అందరికీ తెలిసిన సామెతే అయినా ఇందులో నిజం ఉంది. మంచి ఆరోగ్యం కావాలనుకునే వారు.. రోజూ ఓ ఆపిల్ తినడం మంచిది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో నెమ్మదిగా చక్కెర స్థాయిలను విడుదల చేస్తుంది. దీంతో రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. ఆపిల్ ఎక్కువగా ఫైబర్’ని కలిగి ఉండటం వల్ల శారీరక బరువు అదుపులో ఉంటుంది. వేసవి కాలంలో దొరికే పండు మామిడి పండు. వచ్చేది మూడు నెలలే అయినా .. ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా అందిస్తుంది కాబట్టి దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. మామిడి పండులో క్వేర్సిటిన్, ఐసోక్వేర్సిటిన్, ఆస్ట్రగాలిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
శరీరానికి విటమిన్ A లభించాలంటే బొప్పాయి పండు తినాల్సిందే. విటమిన్ A వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు బొప్పాయి పండులో జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్ లు చాలా ఉంటాయి. మంచి ఆరోగ్యానికి నిమ్మజాతి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ద్రాక్ష, కమలా పండ్లు, జామకాయ, బత్తాయి .. నిమ్మజాతి పండ్లలో ముఖ్యంగా చెప్పుకోదగినవి. వీటి నుంచి విటమిన్ ‘A’, ‘C’, ‘B6’ ఫోలేట్, మినరల్స్, పొటాషియం, క్యాల్షియమ్, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లు తినడం వల్ల అలసట నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. మూత్రపిండాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
నిమ్మజాతి పండ్లు తీసుకునే వారిలో రక్త పీడనం నియంత్రణలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేస్తుంది. వేసవి కాలంలో ఎక్కువగా దొరికే అద్భుతమైన పండు .. పుచ్చపండు. ఇది కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా.. శరీరంలో నీటి మట్టాన్ని సమన్వయ పరుస్తుంది. దీనిలోనూ తక్కువ కెలోరీలు ఉంటాయి. మనకు ఏ సీజన్ లో అయినా దొరికే పండు.. అరటి పండు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటి పండు ద్వారా మెగ్నీషియం లభిస్తుంది. ఇది అధిక రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా హృదయ స్పందలను నియంత్రిస్తుంది. ..
గుండెకు ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తున్న .. తాజా పండ్లను రోజువారీ డైట్ లో చేర్చుకుంటే మంచిది కదా. రోజూ పండు తినండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి.







