‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో సిద్ధు జొన్నలగడ్డ జట్టు కట్టి ‘జాక్ – కొంచెం క్రాక్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బేబి’ ఫేం వైష్ణవి చైతన్య కథానాయికగా నటించడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఫీల్‌గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఎలాంటి ప్రభావం చూపించారు? వేసవి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది అన్న విషయాలు ఇప్పడు తెలుసుకుందాం.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) చురుకైన నేటితరం యువకుడు. జీవితంలో ఏం చేసినా అందులో ఫన్ ఉండాలనుకుంటాడు… ఫన్ లేకుండా చేసే పని నరకంతో సమానమని నమ్ముతుంటాడు. అతని తత్వం నచ్చకపోవడంతో చాలా ఇంటర్వ్యూల్లో తిరస్కరణకి గురవుతాడు. అయినా సరే తన తీరుని మార్చుకోని జాక్… దేశాన్ని రక్షించడంలో ముందుండే ‘రా’ విభాగంలో చేరాలని ఇంటర్వ్యూకి వెళతాడు. అందులో ఎంపిక కాకముందే ఆపరేషన్ బటర్ ఫ్లై పేరుతో ఓ మిషన్ మొదలుపెడతాడు. తనలాగే ‘రా’ విభాగంలో చేరాలనుకున్న ఐపీఎస్ అధికారి రంగనాథ్‌తో కలిసి పొంచి ఉన్న ఉగ్ర ముప్పుని పసిగట్టి, వాళ్లని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. మరి ఉగ్రవాదుల పన్నాగాన్ని జాక్ తిప్పికొట్టాడా?‘రా’లో అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా? మరోవైపు జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతడిని వెంటాడిన అఫ్షాన్ బేగం (వైష్ణవి చైతన్య) ఎవరు? ఆపరేషన్ రెడ్ థండర్ పేరుతో సాగిన మరో మిషన్ కథేమిటి? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
జోక్ కాదు ఫన్ అనే ఓ మాట ఈ సినిమాలో ఓ చోట వినిపిస్తుంది. కానీ, ‘రా’ నేపథ్యాన్ని, రా ఏజెంట్స్‌ని చూపించిన తీరు చూస్తే ఇదంతా ఓ పెద్ద జోక్ అనిపించక మానదు. హీరో పాత్ర, ఫిలాసఫీ విషయంలో మాత్రం బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కనిపిస్తుంది. హీరో నేపథ్యం, తను ప్రారంభించిన ఆపరేషన్ బటర్ ఫ్లై మిషన్, హీరోయిన్‌తో కలిసి చేసే సందడి తదితర సన్నివేశాలతో ప్రథమార్ధం పర్వాలేదనిపించినా, ద్వితీయార్ధంలో విషయమేమీ లేదు. నేపాల్‌కి మారిన కథ ఏ దశలోనూ ఆసక్తిని రేకెత్తించదు. చాలా వరకూ సన్నివేశాలు ఊహకు అందేలా సాగుతుంటాయి. పతాక సన్నివేశాలు తేలిపోయాయి.
టిల్లు తరహాలోనే తెరపై హుషారుగా కనిపిస్తూ సందడి చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు మార్క్ సంభాషణలు కూడా ఇందులో ఉంటాయి. వైష్ణవి చైతన్య అందంగా కనిపించింది. అంతకుమించి ఆమె పాత్రలో చెప్పుకోదగ్గ విషయమేమీ లేదు. హీరోయిన్ పాత్రలపై భాస్కర్ మార్క్ ప్రత్యేకంగా ఉంటుంది. కానీ, ఈ సినిమాలో ఆ ప్రభావమేమీ కనిపించదు.రా అధికారి మనోజ్ పాత్రలో ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు. ఆ పాత్రలో బలం లేదు. నరేష్, సుబ్బరాజు తదితరులు అలవాటైన పాత్రల్లోనే కనిపిస్తారు.సాంకేతిక విభాగాల్లో కెమెరా పనితనం మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు పెద్దగా ప్రభావం చూపించవు. దర్శకుడు భాస్కర్ తన శైలిని పక్కనపెట్టి, హీరో ఇమేజ్‌కి లొంగి స్క్రిప్ట్ రాసుకుని కథ చెప్పినట్టు అనిపిస్తుంది.