ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు, జ్వరాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వాతావరణ మార్పుల ఫలితంగా విజృంభిస్తున్న రకరకాల వైరస్‌లు చాలాచోట్ల ఇంటిల్లిపాదిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జలుబు మరియు ఫ్లూ రెండు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే అయినే త్వరగా వదిలిపెట్టవు. మరీ వీటినుంచి బయటపడేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, అలసట, వంటివి రెండింటిలోనూ కనిపించే సాధారణ లక్షణాలు. నిజానికి సాధారణ జలుబు, ఫ్లూ జ్వరాలకు పెద్దపెద్ద చికిత్సలేం అవసరం లేదు. జలుబు అనేది ప్రధానంగా వైరస్ కారణంగా వచ్చే సమస్య. దీనికి రైనో వైరస్ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్‌లు కారణం కావచ్చు. పైగా ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి. అందుకే అందరినీ తరచూ జలుబు వేధిస్తూనే ఉంటుంది.
సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది, తర్వాత చాలా వరకూ దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. వేడినీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా జలుబు, ఫ్లూ సమయాల్లో ఉపశమనంగా ఉంటుంది. ఇది శ్లేష్మ స్థరాన్ని శుభ్రపరిచే దిశగా పనిచేస్తుంది. నెమ్మదిగా గొంతునొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించడం లో కీలకపాత్ర పోషిస్తుంది.
ఫ్లూ ను ఎలాంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చు ?
సాధారణంగా ఫ్లూజ్వరం వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నపుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది.కండరాల నొప్పులు, నీరసం, జ్వరం, జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఆకలి మందగించటం, వికారం, వాంతులు అవుతుంటాయి. జలుబును తగ్గించుకోటానికి నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్‌ఫక్షన్‌ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన జలుబు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
జలుబు మరియు ఫ్లూ లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
- జలుబు మరియు ఫ్లూ ల నుండి ఉపశమనం పొందుటకు ఎంత ప్రయత్నించినా, విశ్రాంతి లేనిదే ఫలితం పొందలేరు. రోజులో 6 నుండి 8 గంటల సమయం పాటూ పడుకోవటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అంత సమయం పాటూ పడుకోవటం వలన శరీరం స్వతహాగా జలుబు మరియు ఫ్లూలను తగ్గించుకుంటుంది. వివిధ రకాల సమస్యలకు కూడా విశ్రాంతి ద్వారా ఉపశమనం పొందవచ్చు.
- ఫ్లూ జ్వరాలు రకరకాల ఫ్లూ వైరస్‌ల కారణంగా వస్తాయి. ఫ్లూ జ్వరంలో గొంతు నొప్పి ఉంటే ఉండొచ్చు. జ్వరం మాత్రం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు విపరీతంగా బాధిస్తాయి. చాలామందిలో ఈ లక్షణాలు రెండు మూడు రోజులు బాధించి, అవే తగ్గిపోతాయి. కాబట్టి మొదటి రెండు రోజులూ పెద్ద చికిత్సలేం అక్కర్లేదు. ప్యారాసెటమాల్ వంటివి తీసుకుంటే సరిపోతుంది. అయితే మూడు రోజుల తర్వాత కూడా బాధలు తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- సాధారణంగా ఈ జ్వరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. వీటికంటూ ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు. కానీ తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి.