ఎక్కువ తింటే ఊబకాయం వస్తుంది. రోజూ జంక్ ఫుడ్స్ తీసుకున్నా.. స్థూలకాయం బారిన పడతాం. ఇవే విషయాలు చాలా మందికి తెలుసు. ఐతే బరువు పెరగడం.. శరీరంలో కొన్ని రకాల వ్యాధులకు సంకేతమంటున్నారు వైద్యులు. కొన్ని రకాల మందులు కూడా ఊబకాయం బారిన పడేస్తాయి. ఏ వ్యాధులు వస్తే . . బరువు పెరుగుతాం.. ఎలాంటి మందులు వాడినప్పుడు ఒబేసిటీ వస్తుందో తప్పని సరిగా తెలుసుకోవాలి.
స్థూల కాయం అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఇది చాలా వరకు నిజమే. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, అన్ హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం.. వేళకాని వేళల్లో తినడం స్థూలకాయానికి కారణాలు కావచ్చు. పైగా ఎక్కువ తింటూ .. క్యాలరీలు కరగకుండా అంటే శారీరక శ్రమ లేకుండా కూర్చునే వారిని ఒబేసిటీ పలకరిస్తుంది. ఐతే ఎక్కువ తినడంతోపాటు ఊబకాయానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి ..శరీరంలో కొన్ని రకాల వ్యాధులు ఏర్పడే ముందు ఒబేసిటీ సమస్య ఓ సంకేతంగా కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు.
హైపో థైరాడిజమ్ ఉన్నవారికి స్థూలకాయం వస్తుంది. ఇది హార్మోన్ డిజార్డర్ వల్ల వచ్చే సమస్య. మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి.. నిత్యం థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ వల్ల మెటబాలిజమ్ నియంత్రణలో ఉంటుంది. ఐతే థైరాయిడ్ గ్రంథికి సమస్య ఏర్పడినప్పుడు .. హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా మెటబాలిజమ్ క్రమబద్దీకరణ కష్టమవుతుంది. దీంతో స్థూల కాయం వచ్చే అవకాశం ఉంది.
కుషింగ్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చిన వారిలో ఊబకాయం కనిపిస్తుంది. శరీరంలోని రెండు కిడ్నీల పై బాగంలో ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసోల్ అనే స్టెరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఐతే అడ్రినల్ గ్రంథుల్లో సమస్య వచ్చినప్పుడు ఈ స్టెరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీన్నే కషింగ్స్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య వల్ల ఊబకాయం వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.. డిప్రెషన్.. అంటే మానసికంగా కుంగిపోయిన వారిలో కూడా స్థూల కాయం సమస్య ఏర్పడుతుంది. ఈ డిప్రెషన్ తో బాధపడే వారు.. తాము ఏం తింటున్నామో.. ఎంత తింటున్నామో.. ఏ వేళకు తింటున్నామో అస్సలు పట్టించుకోరు. ఆకలి తీరిందనే విషయం కూడా వారికి అర్థం కాదు. దీంతో తమకు కావాల్సిన దాని కంటే ఎక్కువగా తినేస్తారు. దీంతో ఊబకాయం బారిన పడతారు. మరోవైపు స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెషన్ మందులు, హై బ్లడ్ ప్రెజర్ మందులు కూడా స్థూలకాయానికి కారణమవుతాయి.

ఎసిడిటీ తరచుగా బాధిస్తుంటే .. అది కూడా ఊబకాయానికి సంకేతంగా గుర్తించవచ్చు. శరీరంలో కొవ్వు అధిక మొత్తంలో ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థ పై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. దీంతో గొంతు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో కొవ్వు బాగా వృద్ధి చెంది.. మెడ భాగం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అంటే స్థూలకాయం వస్తోందని గుర్తించవచ్చు.
అధికంగా బరువు పెరుగుతుంటే.. తిండి తగ్గిస్తే సరిపోతుందని భావించకండి. స్థూల కాయానికి వెనకున్న అసలైన కారణం తెలుసుకోండి. థైరాయిడ్ ప్రొఫైల్ సరి చూసుకోండి. స్టెరాయిడ్స్, హై బీపీకి సంబంధించిన మందులు వాడేటప్పుడు వైద్యుల సూచనలు తప్పకుండా పాటించండి. వైద్యులు సూచించిన మోతాదు మేరకు మాత్రమే మందులు వాడుకోవాలి. కానీ వ్యక్తిగతంగా మందుల వాడకం మంచిది కాదని గుర్తుంచుకోండి.