పెరుగుతున్న ఎండల కారణంగా బ్యాక్టీరియా, వైర్‌సలు విజృంభిస్తున్నాయి. జాగ్రత్త పడకపోతే కష్టమేనంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వేసవిలో డీ హైడ్రేషన్ సమస్యతో పాటు కళ్ల సమస్యలు కూడా బాగానే విధిస్తుంటాయి. కొద్దిపాటి జాగ్రత్తలతో వీటి బారిన పడకుండా కళ్లను కాపాడుకోవచ్చని చెబుతున్నారు కంటి వైద్యులు. ఈ వేసవిలో కంటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం.
శరీరంలో ప్రధానమైన అవయవాల్లో కళ్ళకు మించినవి లేవు. చూపులో ఏ సమస్య వచ్చినా, అది మన జీవితం మీద పెను ప్రభావాన్ని చూపుతాయి. మనకున్న కొన్ని అలవాట్లు మన కంటికి సమస్యలు కొనితెస్తూ ఉంటాయి. అలాంటి ప్రమాదాలు రాకుండా, కొన్ని ప్రత్యేక చిట్కాల ద్వారా మన కళ్ళకు మనమే రక్షణ కవచాన్ని ఏర్పరచవచ్చు. తీక్షణంగా ఉన్న ఎండల తాకిడికి కళ్ళకు సమస్యలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీంతో కళ్ళ నుంచి నీరు కారడం, కళ్ళు ఎర్రబారడం, కళ్ల మంటలు లాంటి ఇబ్బందులు ఎదురవచ్చు. ఎండలో తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు కంటికి రక్షణగా సన్ గ్లాసులు ధరించాలి. ఇవి దుమ్ము, ధూళి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎండ నుంచి నీడలోకి రాగానే చల్లని నీటితో కళ్ళను కడగాలి. ఇలా చేయడం వల్ల ఎండ వేడిమికి కళ్ళలోకి ప్రవేశించే ధూళి కణాలు తొలగిపోతాయి.
ఎండలో కళ్ళు కంటిన్యూగా పనిచేయడం వల్ల అలసటకు గురవుతాయి. బైక్ నడపడం వల్ల కూడా కళ్ళు ఒత్తిడికి లోనవుతాయి. అందువల్ల కళ్ళకు రక్షణగా తప్పనిసరిగా గాగుల్స్ ధరించాలి. అలాగే ప్రిసర్వేటివ్స్ లేని కంటి చుక్కల మందును వైద్యుల సలహామేరకు వాడాలి. చాలామంది కంటి ఎరుపును తగ్గించే డ్రాప్స్ ను వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల కళ్ళు పొడిబారే ప్రమాదం ఉంది గనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరికొంతమంది ఎండలో తిరిగి వచ్చి కళ్ళను ఇష్టం వచ్చినట్లు నలుపుతుంటారు. ఇలా సున్నితమైన కళ్ళను నలపడం వల్ల కంటి నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల కళ్ళను నలపడం మంచిది కాదు. వేసవిలో బయట వేడికి కంట్లో కూడా తేమ ఆవిరైపోతుంటుంది. అంతేకాదు వేసవిలో దుమ్ము, ధూళి రేగడం వల్ల అది కంట్లో పడి కళ్లు ఎర్రబడటం, దురద, మంట లాంటి సమస్యలు వస్తాయి. కనురెప్పల మీద కురుపులు కూడా రావచ్చు. కాబట్టి కంట్లో దుమ్ము పడకుండా జాగ్రత్త పడాలి. కంటి చుట్టుప్రక్కల రుద్దడం చేయకూడదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా స్వంతగా కంటి చుక్కల మందులు, ఆయింట్మెంట్లు వాడకూడదు. వేసవిలో కంటికి విశ్రాంతి అవసరం కాబట్టి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రమైన, పౌష్టికాహారం తీసుకోవాలి. 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. తరచూ కళ్ళను చల్లని నీళ్ళతో కడుక్కోవాలి.
కంట్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైద్య పరీక్షకు వెళ్ళాలి. వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. సొంతగా కంటిచుక్కలు వేసుకోవడం లాంటివి చేయకూడదు. ఎక్కువసేపు కంప్యూటర్ పనిలో నిమగ్నమయ్యేవారు తప్పనిసరిగా ‘యాంటి రిఫ్లెక్టింగ్ కోటింగ్ గ్లాసెస్’ వాడాలి. ఎండలో వెళ్లి వచ్చిన తరువాత కంటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే కంటికి గాలి తగలకుండా, కంటిని పూర్తిగా కప్పే విధంగా ఉన్న కళ్లజోళ్లను వాడాలి.
వేసవిలో బయట వేడికి కంట్లో కూడా తేమ ఆవిరైపోతుంటుంది. ఈ వేసవిలో దుమ్ము, ధూళి ఎక్కువగా రేగడం.. అది కంట్లో పడటం వల్ల ఈ సమస్య వచ్చినా.. పెరిగిన కాలుష్యం కూడా ఓ కారణంగానే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల ఎండల నుంచి కళ్లను సంరక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు సన్‌గ్లాసెస్ ధరించడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.









