లింఫోమా అనేది తెల్లరక్తకణాలలోని లింఫోసైట్లలలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజించడం వల్ల ఏర్పడుతుంది. ఇవి శరీరములోని చాలా భాగాలలో ఏర్పడతాయి. లింఫోమా సాధారణంగా కణుపు లాగా ఏర్పడుతుంది. లింఫోమాలు చాలా రకాలున్నాయి. ఒక్కో రకానికి ఒక్కో విధమైన చికిత్స చేయాల్సిఉంటుంది. అసలు లింఫోమా ఎందుకు వస్తుంది… ఈ వ్యాధి సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి, మనిషికి త్వరగా మరణాన్ని తీసుకువచ్చే క్యాన్సర్లలో లింఫోమా ఒకటి. శరీరంలో ఎక్కడైనా అసాధారణమైన వాపు కనిపిస్తే అది లింఫోమా కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ పురుషుల్లో ఎవరికైనా ఈ సమస్య రావచ్చు. సకాలంలో ఈ సమస్యను గుర్తించ గలిగితే సరైన చికిత్స ఇవ్వడం సులభం అవుతుంది. నిజానికి ఇది శరీరంలో అన్ని భాగాలకు వ్యాపించే ఓ ప్రమాదకరమైన క్యాన్సర్. తెల్లరక్త కణాల్లో ఉండే లింఫోసైట్లలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజనకు గురి కావడం వల్ల ఈ సమస్య మొదలౌతుంది. సాధారణంగా లింఫోమాలు కణుపులాగా ఏర్పడతాయి. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. దేనికి దానికే ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ లింఫోమాను హాడ్జ్కిన్స్ లింఫోమా లేదా నాన్ హాడ్జ్కిన్స్ లింపోమాగా విభజిస్తారు. వీటిలో ఇంకా వేర్వేరు రకాలు చాలానే ఉన్నాయి. లింప్ నోడ్స్ కి ఈ క్యాన్సర్ ఎదురైనప్పుడు చర్మం ఉపరితలం మీద ఉండే నోడ్స్ వాపునకు గురౌతాయి. ఇవి ఉబ్బడం వల్ల ఎలాంటి నొప్పులు ఉండవు గానీ, ఆకలిని కోల్పోయేలా చేసి, బరువును తగ్గిస్తుంది. చర్మం పై దురదలు, శ్వాసలో ఇబ్బందింతో కూడిన దగ్గు లాంటి లక్షణాలు బయట పడతాయి.
మెడ, చంకలు, గజ్జల భాగంలో వాపు, లేదా కాళ్ళు , చేతుల్లో ఎక్కడైనా అకారణంగా వాపు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఈ వాపులకు చాలా కారణాలు ఉంటాయి. అయితే వాపు కనిపించిన వెంటనే లింఫోమా కాదని నిర్థారించుకోవడం అవసరం. లింఫోమాలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ముందుగా అది ఏ దశలో ఉందో నిర్థారించుకోవాలి. మొదటి దశలో ఇది అదుపులో ఉంటుంది. రెండు, మూడు దశల్లో ఒక్కో అవయానికి వ్యాపించడం మొదలు పెడుతుంది. ఈ మూడు దశల్లో ఈ సమస్య గురించి తెలుసుకోవడం వల్ల మంచి చికిత్సను అందుకుని, సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ నాలుగో దశ చాలా ప్రమాదకరమైనది. ఈ సమయంలో లింఫోమా, ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన దశ. ఈ సమయంలో తెలుసుకోవడం వల్ల సమస్య నుంచి బయట పడే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి. చర్మంపై దురదలు, శ్వాసంలో ఇబ్బందితో కూడిన దగ్గు ఉన్నప్పుడు ఛాతి నొప్పి ఎదురౌతుంది. కాళ్ళు, పాదాలు వాగా వాపునకు గురౌతాయి. గొంతు బొంగురు పోయి, ఉదరభాగంలో ఉబ్బరం మరియు, సత్తువ లేకపోవడం లాంటివి ఎదురౌతాయి. ఈ సమస్యల్లో ఏది ఎదురైనా వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల్లో సమస్య ఉందని తెలిస్తే, అవి అభివృద్ధి చెందే లోపే చికిత్స చేయించుకోవడం వల్ల వ్యాధి నుంచి కొంతలో కొంత ఉపశమనం పొందవచ్చు.
వైద్యుణ్ని కలిసి ప్రాథమిక పరీక్షలు చేయించుకుని, దాన్ని లింఫోమాగా గుర్తిస్తే ఆ తర్వాత బయాప్సీతో పాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు ప్రధానంగా అది లింపోమానా లేదా మరేదైనా సమస్యా అనే దాని మీద వైద్యులు దృష్టి పెడతారు. ఏ అవయంలో ఏర్పడిందన్నది ప్రధానమైనదే. సాధారణంగా హాడ్జ్కిన్స్ లేదా నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాగా దీన్ని విభజిస్తారు. రక్త సంబంధ సమస్యలకు చికిత్స అందించే వైద్యులు , హెమటాలజిస్ట్ , క్యాన్సర్ నిపుణులు ఈ సమస్యకు చికిత్స అందించగలరు. మిగతా క్యాన్సర్ల లాగా దీన్ని త్వరగా గుర్తించడమే దీనికి చికిత్స. ప్రస్తుతం మెరుగైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి గనుక… కీమో థెరఫి, రేడియో థెరఫి, కాంబినేషన్ థెరఫి, లింపోమా కణాలను టార్గెట్ చేసే బయలాజికల్ థెరఫి ద్వారా చికిత్సను అందుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స విధానాల వల్ల 75 శాతం మంది లింఫోమా వ్యాధిగ్రస్తుల్లో ట్యూమర్లను కుచింపజేయగలిగే సామర్థ్యాన్ని వైద్య శాస్తం అభివృద్ధి చేసింది. దీని పట్ల అవగాహన కలిగి ఉండి, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని నిర్థారించుకోగలిగితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.