పలు వ్యాధులు మనల్ని చుట్టుముట్టడానికి మన చుట్టూ ఉండే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు ముఖ్య కారణమని అందరికీ తెలిసిందే. ఇవి ఎక్కడో కాదు మన చుట్టే ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దు.
మన ఆరోగ్యం మనం జీవించే వాతావరణంఫై ప్రధానంగా ఆధారపడి వుంటుంది . ఆరోగ్యవంతమైన మానవ మనుగడకు పారిశుధ్యం చాలా అవసరం. పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు, గాలి, ఇల్లు, ఇంకా వ్యర్ధపదార్ధాల విసర్జనను సక్రమంగా నిర్వహించుకోవడం ఎంతో ముఖ్యం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే గాలి, నీరు, ఆహారం కూడా సురక్షితంగా వుంటాయి. అపరిశుభ్రమైన పరిసరాలు సూక్ష్మజీవులకు నివాసంగా మారుతాయి. వాటి కారణంగా కలరా, టైఫాయిడ్, విరోచనాలు, కామెర్లు వంటి వ్యాధులు సోకుతాయి. ఇలా ఒకరి నుంచి మరొకరికి, ఒక చోట నుండి మరోచోటకి వ్యాపిస్తాయి.
బహిరంగ ప్రదేశాల్లోని వస్తువులను అనవసరంగా తాకరాదు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఎలివేటర్ బటన్లు, మెట్ల హ్యాండిల్స్ మరియు డోర్ హ్యాండిల్స్‌ను తాకవద్దు. చేతులు కడుక్కోవడానికి రెస్ట్ రూం వాడే ప్రతి ఒక్కరూ మీలాగే జాగ్రత్తగా ఉంటారని మీరు నమ్మవచ్చు, కాని నిజం చెప్పాలంటే అందరూ కాదు. రెస్ట్రూమ్ డోర్ హ్యాండిల్స్ మీ రోగనిరోధక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేసే సూక్ష్మక్రిములతో నిండి ఉండవచ్చు. తలుపు తెరవడానికి పేపర్ టవల్ ఉపయోగించండి.
క్యాబ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాలను ముట్టుకోకుండా ఉండలేము. డోర్ హ్యాండిల్స్, కార్ సీట్స్, సీట్ బెల్ట్స్, హెడ్ రెస్ట్ లాంటి వాటిని మనం తప్పక ముట్టుకోవాల్సిందే. రోజు మొత్తంలో వీటన్నిటిని మనమే కాకుండా ఎంతో మంది ముట్టుకుంటారు. ఈ వస్తువులు అన్నిటి మీదా క్యాబ్ లో ప్రయాణించిన ప్రయాణికుల అందరి దగ్గర నుంచి వచ్చే వైరస్ లు, సూక్ష్మ క్రిములు తప్పకుండా ఉంటాయి.ఆఫీసుల్లో ఎక్కువగా వినియోగించే లిఫ్ట్ బటన్లు, డోర్ హ్యాండిళ్లు, టెలీఫోన్లు, జిరాక్స్ మెషిన్, వాటర్ కూలర్ వంటి ప్రాంతాల్లో క్రిములు దాగివుంటాయి. ఒకరు వాడిన తర్వాత మరొకరు వినియోగించడం వల్ల వ్యాప్తిచెంది వ్యాధులు వచ్చేలా చేస్తాయి.
మనం హోటల్‌కు గానీ రెస్టారెంట్‌కు వెళ్లగానే ముందుగా చేతుల్లోకి తీసుకొనేది మెనూ కార్డ్. మన కన్నా ముందు చాలా మంది ఆ కార్డును ముట్టుకొని ఉంటారు. అందుకని వారి నుంచి ముఖ్యంగా ఈ కొలై, ఎస్. ఆరస్ వంటి సూక్ష్మక్రిములు మెనూ కార్డు ద్వారా మనకు చేరే అవకాశాలు ఉంటాయి. ప్లాస్టిక్ కార్డుల ద్వారా మరింత ఎక్కువ వ్యాప్తిచెందుతాయి. మెనూ కార్డును చేత్తో ముట్టిన తర్వాత తప్పనిసరిగా చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. మీరు మాల్‌లో, హోటల్‌లో లేదా అపార్ట్‌మెంట్ భవనంలో ఉన్నా పైకి లేదా క్రిందికి వెళ్లాలి. ఈ ఉపరితలాలు చాలా అరుదుగా శుభ్రం చేయబడతాయి మరియు అన్ని రకాల సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయి. ఎస్కలేటర్ హ్యాండ్‌రైల్‌లను తాకడం మానుకోండి మరియు మీరు ఎలివేటర్ బటన్లను నొక్కవలసి వస్తే, చేతికి బదులుగా.. మోచేయిని ఉపయోగించండి. లేదా, ఇంకా మంచిది – మెట్లు వాడండి!
క్రిములు దరిచేరకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అత్యుత్తమ మార్గం. అలాగే, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇన్‌డోర్స్, అవుట్‌డోర్స్, పబ్లిక్ టాయిలెట్స్ లో వైరస్ ప్రభావం ఒక్కో విధంగా ఉంటుంది. ఇంట్లోనే కాకుండా బయట కూడా లక్షల సంఖ్యలో సూక్ష్మక్రిములు మనల్ని వెంటాడుతుంటాయి. అందుకని చేతులు, కాళ్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. చిన్నారుల కోసం బయటకు వెళ్లిన సమయాల్లో శానిటైజర్లు వాడటం అత్యుత్తమం. తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోగానీ పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో గాని వెళ్లాల్సి వస్తే ముక్కును రుమాలుతో కప్పి పెట్టుకోవాలి. తిరిగి ఇంటికి చేరిన తర్వాత ముక్కు, కళ్లు, చెవులను చల్లని నీటితో పరిశుభ్రంగా కడుక్కోవాలి.
మరుగుదొడ్డికి వెళ్లిన ప్రతిసారి చేతులు, కాళ్లు పరిశుభ్రంగా కడుక్కోవాలి. సూక్ష్మక్రిములు, ఇతర వ్యాధికారకాలు నోట్లోకి వెళ్లకుండా చేతి గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. చేతుల ద్వారా అనేక సూక్ష్మక్రిములు శరీరం లోపలికి వెళ్తుంటాయి. ఒకవేళ రోగకారక సూక్ష్మక్రిములు కూడా శరీరంలోకి వెళ్తే అస్వస్థతకు గురవుతాం. అందుకే బయటకు వెళ్లి వచ్చినా, ఏదైనా పట్టుకున్నా చేతులను శుభ్రం చేసుకోవాలి. అయితే చాలామంది వేడినీళ్లతో చేతులు కడుక్కుంటేనే సూక్ష్మక్రిములు నశిస్తాయని అపోహపడుతుంటారు. నిజానికి వేడి నీళ్లు అవసరం లేదు. సాధారణ నీళ్లు, సబ్బుతో చేతులు కడుక్కుంటే సరిపోతుంది. సబ్బుతో చేతులను రుద్దుకుంటున్న సమయంలో ఉత్పత్తి అయ్యే వేడే సూక్ష్మక్రిములను నశింపజేస్తుందట.
బస్‌స్టాపులు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, పార్కులు, రోడ్లు లాంటి బహిరంగ ప్రదేశాల్లో అందరూ తరుచుగా తాకే ఉపరితలాలను తాకకపోవడమే మంచిది. ఇన్‌డోర్ ప్రదేశాలతో పోలిస్తే సూర్యరశ్మి ఎక్కువగా ఉండే అవుట్‌డోర్ ప్రదేశాల్లో రిస్క్ కాస్త తక్కువే. కానీ తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ముప్పు ముంచుకొస్తుంది.