సుఖంగా కూర్చోవడానికి ఆధునిక మనిషి వెతుక్కోని మార్గం అంటూ లేదు. ఫలితంగా వ్యాధులు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి.సుఖంగా కూర్చుని గంటల తరబడి పనిచేసే వారిలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని సెలవిస్తున్న వైద్య నిపుణులు. రోజంతా కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి..? వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
సిగరెట్టుతో 11 నిమిషాల ఆయుష్షు తరిగిపోతే.. ఓ గంట కూర్చోవడం వల్ల 22 నిమిషాల జీవితం కరిగిపోతుంది. నమ్మశక్యం కాకున్నా నమ్మక తప్పని నిజమిది. ఇంట్లో టీవీ.. ఆఫీసులో కంప్యూటరూ.. ఇంటిపనులన్నింటికీ ఎలక్ట్రిక్ సాధనాలు. ఆఫీసుల్లో సీటులోంచి లేచే పనిలేకుండా ఇంటర్‌కమ్‌లూ ఎస్సెమ్మెస్సులూ ఈమెయిళ్లూ. శరీరం అలసిపోవడం లేదు. వీటికితోడు బైక్‌లూ ఆటోలూ కార్లూ హాయిగా కూర్చోవడాన్ని మరింత పెంచాయి. ఫలితంగా కొత్త కొత్త జబ్బులు మనల్ని వెదుక్కొంటూ వస్తున్నాయి. ఎక్కువ సేపు కూర్చోవడంవల్ల జీవక్రియలు నెమ్మదించి క్యాలరీలు ఖర్చవడం తగ్గిపోతుంది. కొవ్వుల్ని కరిగించే లిపో ప్రొటీన్ లిపేజ్ అనే ఎంజైమ్ పనితీరు 90 శాతానికి పడిపోతుంది. అంటే కొవ్వుల్ని జీర్ణం చేసే శక్తి కూడా మందగిస్తుందన్నమాట. ఫలితంగా ఊబకాయం వస్తుంది. కదలకుండా 20 నిమిషాలు కూర్చున్నా జీవక్రియా వేగం తగ్గుతుంది. నాలుగు గంటలు కూర్చుంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదలని నియంత్రించే ఎంజైమ్ విడుదల దాదాపుగా ఆగిపోతుంది.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్థూలకాయం వస్తుందని ఇదివరకే అధ్యయనాల్లో తేలగా.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. లింగ, వయో భేదాలు లేకుండా ఎక్కువ సమయం కూర్చునేవారు గుండె జబ్బుల బారిన పడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటల తరబడి కూర్చోవడం వల్ల మధుమేహ వ్యాధి బారినపడే అవకాశం కూడా ఉంది. చాలా సేపు కదలకుండా కూర్చునే వారిలో కండరాలు బిగుసుకు పోవటం, వెన్నుముక, భుజాలు, తుంటి సమస్యలు రావటం వంటి ప్రమాదాలు పొంచి వుంటాయట. రక్తనాళాలు గట్టిపడి పైకి కనిపిస్తాయి. కొన్నిసార్లు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఏర్పడి ఊపిరితిత్తులకు రక్తప్రసరణ నిలిచి శ్వాస అందక ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి. వృద్ధాప్యంలో మతిమరుపు సమస్య పీడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెదడు కణాల్లో చురుకుదనం తగ్గి, ఒకలాంటి గందరగోళం నెలకొంటుంది. మత్తుగా అనిపిస్తుంది. కోపతాపాలు పెరుగుతాయి.
ఎక్కువ సమయం నిలబడే లేదా నడిచే వాళ్లతో పోలిస్తే కూర్చునేవాళ్లలో మధుమేహం 112 రెట్లు ఎక్కువ అని తేలింది. మహిళల్లో- అదీ నలభయ్యేళ్లు దాటిన స్త్రీలలో ఈ సమస్య మరీ ఎక్కువ అని నిపుణులు సెలవిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయాల్సి వస్తే ప్రతి అర్ధగంటకు ఒకసారి రెండు నిమిషాలు లేచి నిలబడాలి. రోజు సాధ్యమైనన్ని సార్లు శరీరాన్ని కదిలించాలి. మంచినీళ్లు, టీ తాగాలంటే కుర్చీ వద్దకు తెప్పించుకోకుండా వాటి వద్దకు మనమే లేచి వెళ్లడం మంచిది. ఆఫీసులో నలుగురితో లేదా పది మందితో మీటింగ్ ఉంటే కూర్చుని మాట్లాడకుండా నిలబడే మాట్లాడుకోవడం మంచిది. ఇంట్లో మంచాలపై, సోఫాలపై ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనంత సేపు కింద నేలపైనే కూర్చోవడం చాలా మంచిది.
ఎక్కువ గంటలు నిలబడి పనిచేయడం అనేది కూర్చొని పని చేయడం కన్నా ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మితంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. అతిగా ఎప్పుడూ అనర్థదాయకమే అని గుర్తుంచుకోండి.







