వయసు పెరుగుతున్నకొద్దీ మనల్ని ఇబ్బంది పెట్టే బాధల్లో కంటిచూపు సమస్య ఒకటి. నడి వయసులో కంటి చూపు మందగించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా ఈ వయసులో… అక్షరాలు కనిపించకపోవటం, రోజువారీ పనుల్లో ఇబ్బందులు ఎదురయినప్పుడు వెంటనే కంటి డాక్టరు దగ్గరకు వెళుతుంటారు. అప్పుడు శుక్లాలు ఉన్నాయనే విషయం బయటపడుతుంటుంది. 45 నుంచి 65 ఏళ్ల లోపు వయసులో దాదాపు అందరూ ఎంతోకొంత ఈ సమస్యకు గురవుతుంటారు.
క్యాటరాక్ట్ చాలా వరకు వయసు పెరగటం కారణంగా వచ్చినా…కొన్ని సార్లు కొంతమందిలో పుట్టుకతోనే ఈ సమస్య ఉండవచ్చు. దీనిని కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటారు. తల్లి గర్భంలో ఉన్నపుడు శిశువు కటకంలో అంటే…. లెన్స్ లో వచ్చే మార్పుల వలన ఇది ఏర్పడుతుంది. అలాగే అనారోగ్యాలు, గాయాల వలన కూడా పిల్లలకు క్యాటరాక్ట్ రావచ్చు. సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాల వలన, ఇంకా మధుమేహం, పొగతాగటం, ఆల్కహాల్ ఎక్కువగా తాగటం, కళ్లకు గాయం కావటం, కొన్నిరకాల స్టిరాయిడ్స్ ని ఎక్కువకాలం వాడటం, ఎండకు లేదా రేడియేషన్‌కి ఎక్కువగా గురికావటం ….ఈ కారణాల వలన కంటికి క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఎక్కువ.
శుక్లాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిరకం కార్టికల్ శుక్లం అయితే రెండవది న్యూక్లియర్ శుక్లం. వయసు పైబడి రక్తపోటు వలన కటకం తన శక్తిని కోల్పోయి దాని అంచుల్లో మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు సూర్య కిరణాలకు అడ్డుపడతాయి. తరువాత అవి పెద్దవి అవుతూ కటకం అంతా వ్యాపించి చూపు కనిపించని స్థితి ఏర్పడుతుంది. దీనిని కార్టికల్ శుక్లం అంటారు.
క్యాటరాక్ట్ సమస్యతో కంటిచూపు మందగించడంతో పాటు చూపు అల్లుకుపోయిపట్టుగా మసకగా ఉండవచ్చు. శుక్లాలు ముదురుతున్న కొద్దీ సమస్య పెరుగుతుంది. క్యాటరాక్ట్ ఉన్నపుడు రాత్రులు చూడటం డ్రైవింగ్ చేయటం ఇబ్బందిగా మారుతుంది. క్యాటరాక్ట్ లో కనిపించే మరొక సమస్య లైట్ల వెలుతురుని కానీ సూర్యకాంతిని కానీ చూడటంలో సమస్యలు ఉంటాయి. అంతకుముందు ఇబ్బంది కలిగించని లైట్ల వెలుతురు క్యాటరాక్ట్ తో సమస్యగా మారతాయి. ఈ కారణంగానే రాత్రులు డ్రైవింగ్ చేయటం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి క్యాటరాక్ట్ వలన ఒక వస్తువు రెండుగా కూడా కనబడుతుంది. ఒక కన్నుతో చూసినా ఇలా కనబడవచ్చు. రంగులు కూడా తేడాగా కనబడతాయి. ముదురు రంగులు కూడా రంగుతగ్గి కనబడతాయి. చూపులో ఎక్కువగా పసుపు బ్రౌన్ రంగులు కనబడుతుంటాయి. మొదట ఈ తేడా అంతగా తెలియదు కానీ రాను రాను బ్లూకి పర్పుల్ రంగుకి మధ్య ఉన్నా తేడా కనిపెట్టలేని స్థితికి రావచ్చు.
ఒక్కోసారి క్యాటరాక్ట్ కారణంగా కంటిచూపు మెరుగుపడినట్టుగా అనిపించవచ్చు. అంతకుముందు లేని విధంగా దగ్గరి చూపు మెరుగవుతుంది. క్యాటరాక్టే ….లెన్స్ గా ఉపయోగపడి ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితిని సెకండ్ సైట్ అంటారు. దీనివలన అంతకుముందు రీడింగ్ గ్లాసులు వాడినవారు వాటి అవసరం లేకుండానే చదవగలుగుతారు. అయితే క్యాటరాక్ట్ మరింత తీవ్రం అయ్యాక…కంటిచూపు సమస్య కూడా పెరుగుతుంది. కళ్లద్దాలు కానీ, కంటాక్ట్ లెన్స్ లను కానీ తరచుగా మార్చాల్సివస్తుంటే అది క్యాటరాక్ట్ కి సూచనగా భావించవచ్చు. ఎందుకంటే క్యాటరాక్ట్ కాలం గడిచిన కొద్దీ పెరుగుతుండటం వలన ఇలా మార్చాల్సివస్తుంది. ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
శుక్లాలకు ఆపరేషన్ తరవాత కంటి చూపు యధాస్థితికి వస్తుంది. అయితే కొన్నిరోజులు మాత్రం దురద, లైట్లను చూడలేకపోవటం ఉండవచ్చు. ఆపరేషన్ అయిన వెంటనే చూపులో మార్పు వచ్చినా…పూర్తిగా కన్ను కోలుకోవడానికి ఎనిమిది వారాలు పడుతుంది. తరువాత కూడా డాక్టరు సలహా మేరకు కళ్లద్దాలు వాడాల్సి ఉంటుంది. క్యాటరాక్ట్ కి ఎప్పుడు ఆపరేషన్ చేయాలి…అనే విషయాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. క్యాటరాక్ట్ రాకుండా నివారించాలంటే పొగతాగకుండా ఉండటం, ఎండకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, ఆల్కహాల్ తగ్గించుకోవటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లు అధిక శ్రమకు గురికాకుండా చూసుకోవటం పోషకాహారం తీసుకోవటం లాంటివి కూడా అవసరం. క్యాటరాక్ట్ ఉన్నా…..కొన్నాళ్ల దాకా చూపులో పెద్దగా తేడా రాకపోవచ్చు. అలాగే క్యాటరాక్ట్ కారణంగా చూపు తగ్గినా కళ్లు ఎర్రబారడం… కంట్లో నొప్పి, నీరు కారడం లాంటి సమస్యలు ఉండవు. కనుక నడి వయసుకి వచ్చాక క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండటం అవసరం.
ఒకసారి శుక్లాల సమస్య మొదలయితే అది క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. కొందరిలో పెరగడం ఆగిపోవచ్చు కానీ తగ్గడం మాత్రం ఉండదు. కంటికి గాయమై శుక్లాలు ఏర్పడితే ఆ గాయం మానిన తరువాత శుక్లాలు కూడా తగ్గవచ్చు. ఏదిఏమైనా నడివయసు దాటాక సర్వసాధారణంగా ఈ సమస్య ఉంటుంది కాబట్టి…. చూపుకి సంబంధించి ఎలాంటి మార్పు అనిపించినా…కంటి డాక్టరుని సంప్రదించాలి. దీంతో సమస్య తీవ్రం కాకుండా పరిష్కరించుకోవచ్చు.