బయటకు చెప్పుకోలేం. అలాగని లోపల దాచుకొనూ లేం. మూత్ర సమస్యల విషయంలో చాలామంది ఇలాంటి సందిగ్ధావస్థలోనే పడిపోతుంటారు. మూత్రం ఎర్రగా కనబడుతోంది. రక్తం పడుతోంది అని కొందరు వాపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. అసలు యూరిన్ లో బ్లడ్ పడటానికి కారణాలు ఏంటి.. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కొద్దిపాటి రక్తమే స్రవిస్తున్నప్పటికి అది మూత్రం అంతటితోనూ కలవడం వలన ఆందోళన పెరుగుతుంది. ఇలా రక్తం పడే లక్షణం కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా పొగ తాగేవాళ్లలో వాళ్ల స్మోకింగ్ అలవాటు వల్ల బ్లాడర్‌లో చిన్న చిన్న గడ్డల వల్ల కూడా ఇది రావచ్చు. అదిగాక ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జిమెంట్ వల్ల లేదా ఇతరత్రా మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా మూత్రంలో రక్తం రావచ్చు.
కారణం ఏమైనా నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీ, మూత్రపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ముందు స్మోకింగ్ అలవాటును పూర్తిగా ఆపేయాలి. ఇలా మూత్రంలో రక్తం పడితే అది ఎక్కువశాతం ఇన్ఫెక్షన్ల వల్లనే కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.
మూత్రంలో రక్తం కారణాలు..?
మూత్రంలో రక్తం పడినప్పుడు ముందుగా ఆలోచించాల్సింది నొప్పి గురించి. నొప్పితో పాటు మూత్రం వస్తుంటే ఇన్‌ఫెక్షనో, మూత్రాశయంలో రాళ్ల వంటివో కారణం కావొచ్చు. ఇదేమంత ప్రమాదకరం కాదు. ఆయా సమస్యలకు చికిత్స తీసుకుంటే నయమైపోతుంది. కానీ నొప్పిలేకుండా మూత్రం ఎర్రగా వస్తుంటే మూత్రశయంలో, కిడ్నీలో, మూత్రమార్గంలో ఎక్కడైనా కణితి ఉందేమోనని పరిశీలించటం తప్పనిసరి. కేవలం ఇన్‌ఫెక్షన్‌గా భావించి మందులు వాడుకోవటం సరికాదు. ఇన్‌ఫెక్షన్ బాగా తీవ్రమై, మూత్రం బాగా మంటగా వస్తున్నప్పుడు రెండు, మూడు చుక్కలు రక్తం పడితే పడొచ్చు గానీ మూత్రం మొత్తం ఎర్రగా రావటం అరుదు. అందువల్ల నొప్పిలేకుండా మూత్రంలో రక్తం పడుతుంటే నిర్లక్ష్యం పనికిరాదు.
కిడ్నీ వ్యాధులు, బ్లాడర్ ఇన్ఫ్లమేషన్, యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్స్, ప్రొస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ వంటి కారణాల వల్ల కూడా యూరిన్ లో బ్లడ్ పడవచ్చు. రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్, సికెల్ సెల్స్ డిసీజ్ వంటి వ్యాధుల వల్ల కూడా యూరిన్ లో బ్లడ్ పడే అవకాశం ఉంది. మూత్రవిసర్జనలో నొప్పి, లేదా మంట, వికారం, జ్వరం, వాంతులు, బరువు తగ్గడం, ఇంటర్ కోర్స్ సమయంలో నొప్పి, యూరిన్ పాస్ చేయడం డిఫికల్ట్ గా ఉండటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
మూత్రంలో రక్తం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి..?
యూరిన్ లో బ్లడ్ పడటాన్ని కిడ్నీ స్టోన్స్ మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కు సంకేతం. ఇటువంటి పరిస్థితిలో అసిడిక్ బెవరేజెస్ ను తీసుకోవడం మానేయాలి. టీ, కాఫీ మరియు సిట్రస్ ఫ్రూట్స్ తినడం మానేయాలి. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ఒక రకంగా సహాయపడ్డా, డాక్టర్ ను కలవడం తప్పనిసరి. ఒక్కసారి మూత్రంలో రక్తం పడినా తగు పరీక్షలు చేసి కారణమేంటన్నది గుర్తించాలి. కణితుల వంటివి ఉన్నాయేమో నిర్ధరించుకోవాలి. సాధారణంగా కిడ్నీలో, మూత్రాశయంలో కణితులు ఏర్పడుతుంటాయి. కణితి నుంచి చిన్నముక్క తీసి పరీక్షిస్తే ఏ దశలో ఉందో తెలుస్తుంది. దానికి అనుగుణంగా చికిత్స చేస్తారు.
కిడ్నీలో కణితి చిన్నగా ఉంటే అంతమేరకు తొలగిస్తే సరిపోతుంది. మూత్రంలో రక్తం కనబడినప్పుడు చాలామంది యాంటీబయోటిక్ మందులు వేసుకుంటారు. అప్పటికది తగ్గిపోవచ్చు కూడా. నిజానికి యాంటీబయోటిక్స్ తీసుకోకపోయినా రక్తం పడటం తగ్గుతుంది. ఆర్నెళ్ల తర్వాత మళ్లీ మొదలవుతుంది. కాబట్టి వైద్యున్ని సప్రదించి తగిని చికిత్స తీసుకోవడం ఉత్తమం. యూరిన్ కి వెళ్లినప్పుడు మూత్రంతోపాటు రక్తం వస్తుంటే అది క్రమంగా బ్లాడర్ క్యాన్సర్ కి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.