మీ నాలుక రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్పుతుంది. నాలుక మరియు నాలుక రంగు మీ ఆరోగ్య సమస్య గురించి ఎలా బహిర్గతం చేస్తుంది. మీ ఆరోగ్యం మొత్తాన్ని మీ నాలుక చూసి అంచనా వేయవచ్చు. అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు నాలుక పరీక్ష చేసేది కూడా అందుకే. వామ్మో.. నాలుక ఇన్ని విషయాలు చెబుతుందా అని అనుకోకండి. అసలు సంగతి ఇంకా ఉంది. నాలుక రంగు మారిందంటే దానికో లెక్క ఉందనే అర్ధం. . ఎందుకు అలా జరుగుతుంది.
ప్రతి మనిషికి నాలుకు ఎంతో ప్రత్యేకమైనది. నాలుక అధికభాగం కండరాలతో నిర్మితమై ఉంటుంది. ఆహారాన్ని అటు, ఇటు కదల్చడంలోనూ, మింగడంలోనూ, మాటలు మాట్లాడడంలోనూ నాలుక ఉపయోగపడుతుంది. ఇక ఆరోగ్యం గురించి కూడా నాలుక చాలా వివరాలు చెబుతుంది. సరాసరి నాలుకకు కలిగే ఇబ్బందులు కొన్ని అయితే.. శరీరం లోపల అనారోగ్యానికి సూచనగా నాలుక సమస్యలకు గురవుతూ ఉంటుంది. అలాగే నోరు అపరిశుభ్రంగా ఉంటే నోటిపొక్కులు వస్తాయి. అయితే ఇవి బాహ్య కారణాల వలన కలిగే సమస్యలు. శరీరంలో అంతర్గత సమస్యల వలన నాలుక పడే ఇబ్బందులు కూడా ఉన్నాయి. నాలుక పొడిబారడం, ఎండిపోవడం అనేది చాలామందిలో కనిపించే సమస్య. వాంతులు, విరేచనాలతో డీ హైడ్రేషన్ వలన శరీరంలో నీటి నిల్వలు పడిపోయినప్పుడు మొదట సూచించేది నాలుకే. ఇక భయం, ఆందోళన, మానసిక సమస్యలతో బాధపడేవారిలో కూడా నాలుక పొడిబారిపోవడం అనే సమస్య కనపిస్తుంటుంది. కొందరు మహిళలు, ముఖ్యంగా గర్భిణీల్లో నాలుక పాలిపోయినట్టు కనిపిస్తుంది. ఇది మనిషిలో రక్తహీనతను సూచిస్తుంది. ఇలా నాలుక చెప్పే అనారోగ్య సంగతులు చాలా ఉన్నాయి.
వైద్యుడి దగ్గరకు వెళ్ళినప్పుడు సాధారణంగా నాలుకను చూసి అనారోగ్యాన్ని అంచనా వేస్తారు. ఎందుకంటే శరీరం స్థితిని నాలుక ఖచ్చితంగా పట్టిస్తుంది. నాలుకపూత అనేది దాదాపుగా అందరికీ వస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధకవ్యవస్థ బలహీనమయ్యిందని సూచిస్తుంది. నాలుక మీద పాచి మాదిరిగా ఎప్పుడూ తెల్లని పొర ఉంటుంటే జీర్ణ సంబంధిత సమస్యగా భావించాలి. అసిడిటీ, మలబద్ధకం, మితిమీరిన మద్యపానం, ధూమపానం, జ్వరాలు, లివర్ వ్యాధులున్నవారిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. నాలుక తెల్లగా, పాలిపోయి ఉంటే ఐరన్ లోపం అనుకోవాలి. చాలా మందిలో వయస్సుతో సంబంధంలేకుండా ఐరన్ లోపం వల్ల కూడా నాలుక తెల్లగా మారుతుంది. నాలుక పేలవంగా కనపడితే శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతోందని అర్థం. ఎర్రరక్త కణాల్లో ప్రోటీన్ స్థాయి తగ్గితే రక్తహీనత ఏర్పడుతుంది. ఆ లోపం వల్ల నాలుక పేలవంగా కనిపిస్తుంది. దీనివల్ల అలసట, విసుగు వస్తుంది. అందుకోసం ఐరన్ అధికంగా ఉండే ఆకు కూరలు, మాంసం, గుడ్లు మొదలైన సమతులాహారం తీసుకోవాలి. కాబట్టి నాలుకకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. అసలు సమస్య ఎక్కడుందో కాస్త ఆలోచించుకోవాలి.
నోటి పరిశుభ్రత అనేది ఆరోగ్యకరమైన నోటి కోసం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యం కొరకు సహాయపడుతుంది. నాలుకకు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరూ పట్టించుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఆహారం తినడంలో, మాట్లాడటంలో నాలుకదే కీలకపాత్ర. కాబట్టి నాలుకను కాపాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆరోగ్యంగా ఉండటం ద్వారా నాలుకను హాయిగా ఉంచుకోవచ్చు. నాలుక మీద అనేక బాక్టీరియాలు పెరిగే అవకాశం ఉండుట వలన నాలుకను ఎలా శుభ్రంగా చేయాలో తెలుసుకోవలసిన అవసరం ఉంది. అనారోగ్యమైన నాలుక వలన పాడయిన దంతాలు మరియు చెడు శ్వాస వంటి అనేక నోటి వ్యాధులు వస్తాయి. ఇది మీ శరీరం యొక్క సాధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నాలుకకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నోటి శుభ్రత ఎంతో ముఖ్యం. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం నాలుకకు మంచిది. . ఇక ధూమపానం నాలుకకు శత్రువులాంటిదనే చెప్పాలి. పొగాకు దెబ్బకు నోరు, నాలుకపై పుండ్లు పడతాయి. కాబట్టి ధూమపానం పూర్తగా మానేయాలి. నోటిపూత, మంట లాంటి చిన్న చిన్న సమస్యలు అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే తరచూ ఇలాంటి సమస్యలు ఇబ్బందిపెట్టినా, ఒకసారి వచ్చాక నాలుగైదు రోజులు తగ్గకపోయినా కూడా అప్రమత్తం కావాలి. రెండు రోజులయినా నాలుకపై ఇబ్బందులు తగ్గకుంటే వైద్యుడ్ని సంప్రదించి అసలు రోగమేంటో తెలుసుకుని, చికిత్స చేయించుకోవాలి.