సరైన డైట్ తీసుకున్నప్పటికీ అందులో తగినంత ఫైబర్ ఉండకపోతే, అరుగుదల సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. మనం రెగ్యులర్ డైట్ లో ఎంత మేరకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ చేర్చుకుంటామో అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రయోజనాలు పొందవచ్చు.అసలు మనం తీసుకోనే ఆహారంలో ఫైబర్ ఉందా …? మనకు ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు ఏంటి..?
అధిక ఫైబర్స్ కలిగిన ఆహారాలు మన రెగ్యులర్ డైట్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫైబర్ పనిచేసే విధానాన్ని బట్టి దాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి జీర్ణం అయ్యేది.. మరొకటి జీర్ణం కానిది. ఐతే ఈ రెండింటి వల్ల మనకు లాభమే. జీర్ణమయ్యే ఫైబర్ అనేది ఆహారంతో పాటు మెల్లగా జీర్ణమవుతూ ఉంటుంది. మెల్ల మెల్లగా జీర్ణం కావడం వల్ల మన శరీరంలోకి ఆహార పదార్ధాల నుంచి గ్లూకోజ్ కూడా నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాదు రక్తంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ ను కూడా ఇది బయటకు తరిమేస్తుంది.
జీర్ణమయ్యే పీచు పదార్ధాలు తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగం. క్రమంగా బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఇక జీర్ణం కాని ఫైబర్ ఇది మన శరీరానికి అవసరం లేని పదార్ధాలను బయటకు పంపేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం బారిన పడకుండా ఉండేందుకు సహాయపడతాయి.
ఫైబర్ ఉన్న ఆహారాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?
ఆరోగ్యవంతంగా ఉండేందుకు పండ్లు, కూరగాయలు ఎంతగానో దోహదపడుతున్నాయి. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. బరువును అదుపులో ఉంచుకోవడం, కొవ్వును కరించడం, గుండెను సురక్షితంగా ఉంచుకోవడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఫైబర్ అందించే ప్రయోజనాల్లో ప్రధానమైనది బరువును తగ్గించడమే. ఫైబర్ ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకున్నప్పటికీ అది ఏ మాత్రం బరువు మీద ప్రభావాన్ని చూపించదు పైగా చెప్పుకోదగిన స్థాయిలో బరువు తగ్గవచ్చని, పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఫైబర్ ఉండే ఆహారం, ఎలాంటి వాటిని తీసుకున్నా వీలైనంత వరకూ శరీరానికి పోషణ అధించే విధంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఫైబర్ ఉండే ఆహారంలో బరువు తగ్గించడానికి ఎంతో మంచిది. బరువును తగ్గించడం మాత్రమే కాదు, ఎక్కువ కాలం సరైన బరువును అలానే కొనసాగించడంలో కూడా ఫైబర్ ఉండే ఆహారం సాయం చేస్తుంది.
ఫైబర్ ఎక్కువగా లభించే ఆహారాలు ఏంటి ?
ఫైబర్ తో కూడిన ఆహార పదార్ధాలు తీసుకుంటే అన్ని వయసుల వారికీ మేలు కలుగుతుంది. అలా అని మొత్తం పీచు ఉన్న పదార్ధాలే తినాలని కాదు. మనం రోజూ తీసుకునే ఆహారంలో అన్నీ కాకపోయినా .. ఏ ఒక్క దానిలోనైనా ఎక్కువగా పీచు ఉన్న పదార్ధాన్ని చేర్చుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్దకం సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తంలో ఉన్న కొలస్ట్రాల్ నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మన తీసుకోనే ఆహార పదార్ధాల్లో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.
మనం రోజూ తినే ఆహారంలో ఆకు కూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి ఫైబర్ అందుతుంది. అలాగే ముతక బియ్యంలోనూ ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. మొక్క జొన్న నుంచి మనకు ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది. పాప్ కార్న్ అంటే అందరికీ ఇష్టమే.. మొక్కజొన్న గింజలను ఏ రూపంలో తీసుకున్నా మనకు ఫైబర్ లభ్యమవుతుంది. బాదం, వాల్ నట్స్, రాజ్మా, బఠాణీ లాంటి వాటిలోనూ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకు మార్కెట్లో చాలా రకాలుగా ఓట్స్ లభిస్తున్నాయి. ఉదయాన్నే ఓట్స్ తీసుకుంటే శరీరానికి కావాల్సినంత ఫైబర్ లభ్యమవుతుంది.
పీచు పదార్థాలు మన ఆరోగ్యానికి ప్రాణం లాంటివి. వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, మధుమేహం లాంటి వాటి నుంచి కాపాడతాయి. కాబట్టి దీనిపట్ల అవగాహనతో మంచి ఫైబర్ ఆహారాన్నీ తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవచ్చు.