ఉన్నట్టుండి కండ్లు తిరగడం, తలతిరగడం, చుట్టుపక్కల వస్తువులు తిరిగినట్టు, పై నుంచి లోయలోకి పడిపయినట్టు అనిపించడం వంటి లక్షణాలు ప్రతిమనిషి జీవితంలో ఒకసారైనా కనిపిస్తాయి. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో డిజ్జినెస్ అని వ్యవహరిస్తారు. చాలామంది ఈ లక్షణాలు కనిపించినప్పుడు కంగారుపడతారు.
కారణాలు వేరు కావచ్చు గానీ, కళ్లు తిరగడం అనేది ప్రతి ఒక్కరికీ అనుభవమే. ప్రత్యేకించి వయసు పైబడిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయినా ఆ ప్రమాదం తక్కువ కావొచ్చు. అలాంటిది ఏ రోడ్డు మీదో కళ్లు తిరిగి పడిపోతే ఇంకేమైనా ఉందా? ఇంతటి ప్రమాదకరమైన ఈ పరిణామాన్ని వెర్టిగో లేదా డిజ్జినెస్ అంటారు. డిజ్జినెస్ అనే సమస్య మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల సంభవిస్తుంది. వర్టిగో అనేది లోపలి చెవిలోని బాలెన్స్ కేంద్రానికి, మెదడుకు మధ్య ఉండే సమతౌల్యంలో లోపాల కారణంగా సంభవిస్తుంది.
డిజ్జినెస్ వంటి సమస్యకు గురైన వ్యక్తికి చికిత్స చేయడానికి రోగి తన బాధలను, తాను అనుభవిస్తున్న వ్యాధి లక్షణాలను స్పష్టంగా వైద్యులకు చెప్పగలగాలి. అప్పుడే ఈ వ్యాధిని అనుమానించి తగిన పరీక్షలు చేయించి, వ్యాధిని నిర్ధారించి చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది.
తల తిరుగుతున్నట్టు అనిపించడానికి కారణాలు ఏంటి…?
డిజ్జినెస్ సమస్య ఉత్పన్నం కావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఈ సమస్యతో బాధపడే వారిలో తల తిరుగుతున్నట్టు ఉండటం, కండ్లు తిరుగుతున్నట్టు ఉండటం అనేవి సాధారణంగా కనిపించే లక్షణాలు. డిజ్జినెస్ అనే లక్షణం కారణంగా ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వైద్య సహాయం కోసం వచ్చే వారు 10 శాతం దాకా ఉంటారు. అయితే ప్రతి రోగీ ఆ ఒక్క లక్షణం కారణంగానే రాకపోవచ్చు. అంతకు ముందు నుంచే ఉన్న అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బుల వల్ల కూడా కళ్లు తిరగవచ్చు.
ఈ కళ్లు తిరగడం అనే లక్షణం మొత్తంగా చూస్తే ఎక్కువే. ఒక్కోసారి తీవ్రమైన జ్వరం వల్ల గానీ, విపరీతమైన విరేచనాల వల్ల గానీ, నాలుగైదు రోజుల పాటు ఏ ఆహారమూ తీసుకోకపోవడం వల్ల గానీ, కళ్లు తిరిగితే దాన్ని లైట్‌హెటెడ్‌నెస్ అంటాం. ఏమైనా కళ్లు తిరగడమే ఒక వ్యాధి అయినట్టు చాలా మంది పొరబడుతుంటారు. వాస్తవానికి డిజ్జినెస్ అనేది వ్యాధి కాదు. శరీరంలోని పలు రుగ్మతల్లోని ఏదో ఒక రుగ్మత కు సంబంధించిన ఒక లక్షణం మాత్రమే. అందువల్ల ఆ లక్షణాన్ని కలిగిస్తున్న అసలు వ్యాధిని గుర్తిస్తే తప్ప శాశ్వతంగా వ్యాధిని నయం చేయడం సాధ్యం కాదు.
ఈ సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల్లో కండ్లు తిరుగుతున్నట్టు, శరీరం తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు మధుమేహం, అడిషన్స్ డిసీజ్, పార్కిన్‌సన్స్ డిసీజ్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారు పడుకున్న స్థితి నుంచి కూర్చోవడానికి లేదా లేచి నిలబడ్డానికి ప్రయత్నించినప్పుడు కండ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వినాళ గ్రంథుల సమస్యల వల్ల కూడా కండ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పని తీరు సక్రమంగా లేకపోతే డిజ్జినెస్ సమస్య ఉత్పన్నమవుతుంది.
అడ్రినల్ గ్రంథులు తగిన పరిమాణంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే అడిషన్స్ డిసీజ్‌లో కూడా డిజ్జినెస్ కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. కార్బోహై డ్రేట్లు,ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రక్తపోటు, షుగర్ కొలెస్ట్రాల్ స్థితులు కంట్రోల్ లో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి.పెద్దల విషయంలో మరింతగా జాగ్రత్తవహించాలి. ఎందుకంటే హఠాత్తుగా పడిపోయి ఫ్రాక్చర్‌లు అయ్యే ప్రమాదం ఉంటుంది. టీ, కాఫీ, ఆల్కహాల్ మానాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డిజ్జినెస్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.