Eye Health: కళ్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త… ఈ తప్పులు చేస్తే భారీ మూల్యం తప్పదు!

By manavaradhi.com

Published on:

Follow Us
Eye Health

మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇటీవల కాలంలో కంప్యూటర్‌పై పని చేయడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా కళ్ళు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే వీటి గురించి తగినంత అవగాహన కలిగి ఉంటే కంటి చూపును పరిరక్షించుకోవచ్చు… కంటి ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మానవ శరీరంలో ప్రధానమైన కళ్ళకు వచ్చే సమస్యలను కొన్ని ముందస్తు హెచ్చరికల ద్వారా గుర్తించవచ్చు. ప్రారంభంలోనే గుర్తించగలిగి, పరీక్షలు చేయించుకుంటే సమస్య మరింత పెద్దది కాకుండా చూసుకోవచ్చు. చూపు బూజరుగా ఉండడం, కంటి నుంచి నీరుకాటం, కళ్ళు ఎర్రబడటం లాంటి సాధారణ కంటి సమస్యలు. వీటిలో ప్రతిది అంత ప్రమాద కరమైంది కాకపోయినా, ఇవి కంటి సమస్యలు రాబోతున్నాయని చెప్పడానికి సూచనలు. అయితే వీటిని అన్ని సమయాల్లో గుర్తించడం వీలు కాదు. కంటిలో ఏ మాత్రం సమస్య ఉందని గుర్తించినా, వైద్యుని కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

దూరంగా ఉండేవి బూజరుగా కనిపించే ఈ సమస్య ఒక కంటికి లేదా రెండు కళ్ళకు రావచ్చు. దగ్గరగా పెట్టుకుని చదవడం ఈ సమస్యకు కారణం కావచ్చు. ఇందులో తలనొప్పి, కళ్ళు తిరగడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. దీనికి కంటి అద్దాలు వాడి పరిష్కారం పొందవచ్చు.

కంటి ఉపరితలం అంతా కూడా రక్తనాళాలతో నిండి ఉంటుంది. కళ్లు చిరాకుకు గురైనా లేక ఇన్ఫెక్షన్ బారిన పడినా ఈ రక్త నాళాల పరిమాణం పెరిగిపోతుంది. దాంతో కళ్లు ఎర్రబారినట్టు కనిపిస్తాయి. కంజెంక్టివైటిస్ అనే మరో సమస్య వల్ల కూడా కళ్లు ఎర్రగా మారిపోవచ్చు. సూర్యకిరణాల తాకిడికి ఎక్కువగా ఏళ్ల పాటు గురైన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే సమస్య ఏంటన్నది నిర్ధారించుకునేందుకు వైద్యుల సాయం తీసుకోవడం మంచిది.

కంట్లో నీటి పరిమాణం తగ్గిపోవడం ఒక సమస్య అయితే, పెరిగిపోవడం కూడా సమస్యే. కాంతి, గాలి లేదా ఉష్ణోగ్రత విషయంలో సెన్సిటివ్ గా ఉండే వారిలో అధికంగా నీరు కారడం కనిపిస్తుంది. అందుకే బయటి అంశాల ప్రభావం కంటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు.

క్యాటరాక్ట్ సమస్యలో వెలుగు అంత సాఫీగా రెటీనాను చేరదు. దీంతో చూపులో స్పష్టత తగ్గుతుంది. క్యాటరాక్ట్ సమస్య ఒక్కసారిగా ఏర్పడదు. కొద్దికొద్దిగా డెవలప్ అవుతుంది. నొప్పి, ఎర్రబారడం, నీరు కారడం తరహా లక్షణాలేవీ ఉండవు. సర్జరీ ద్వారా పూర్తిగా తొలగిపోయే సమస్య ఇది. వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలు చాలానే ఉన్నాయి. దూరంగా ఉండే అక్షరాలను చదవ గలరు గానీ, దగ్గరగా ఉండేవి చూడలేరు. 40 ఏళ్ళ తర్వాత ఇలాంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యకు రీడింగ్ గ్లాస్ లాంటి వాటితో పరిష్కారం పొందవచ్చు.

కంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే కంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. డయాబెటిస్ సమస్యలు, పొగ తాగే అలవాటు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కంటి ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. వృత్తి రీత్యా కంప్యూటర్ తో వర్క్ చేయవలసి వస్తే ప్రతి రెండు గంటలకు కనీసం రెండు నిముషాలు కళ్ళు మూసి ఉంచాలి. మధ్యమధ్యలో కంప్యూటర్ స్క్రీన్ కి విరామం ఇవ్వడం వలన కళ్లపై దుష్ప్రభావాలు అంతగా పడవు.

పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిద్రను కూడా త్యాగం చేసి రాత్రి వేళల్లో కూడా పనిచేయడం వలన కళ్ళు మరింత అలసటకు గురవుతాయి. కాబట్టి, నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. మన కళ్లకు రోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరమవుతుంది. అప్పుడే, కళ్ళు రిఫ్రెష్ అవుతాయి.

ఆహారంలో కంటి సంరక్షణకు అవసరమయ్యే పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆకుకూరలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారపదార్థాలను డైట్ లో భాగంగా చేసుకోవాలి. ఐ డ్రాప్స్ ను తరచూ వాడకూడదు. చలువ కళ్ళద్దాలు వాడడం, కంటికి ఎక్కువగా ఎండ తగలనివ్వక పోవడం, కళ్ళలో దుమ్ము లాంటివి పడకుండా చూసుకోవడం, రోజూ చల్లని నీటితో కంటిని శుభ్రపరచుకోవడం లాంటివి చేస్తుండాలి. వీటితో పాటు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన పెద్ద సమస్యల బారిన పడే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. మన పోషణకు తగ్గ స్థాయిలో ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం ద్వారా భవిష్యత్ లో కంటికి ఏ విధమైన సమస్యలూ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

Leave a Comment