మన వయసును బట్టి కొన్ని రకాల పోషకాలు… విటమిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రోగాలు దాడిచేసే ప్రమాదం ఉంది. అందుకే మన ఆహారంలో అన్ని రకాల విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ ఆహారాలు మన వయసును బట్టి మారుతుంటాయి. వయసు పెరిగేకొద్దీ తీసుకునే పోషకాల్లో కూడా మార్పులు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది.
వయసు పెరిగే కొద్దీ శరీరానికి కావాల్సిన పోషకాల అవసరం మారుతుంది. యుక్త వయసులో ఒక మూలకం అవసరం ఎక్కువుంటే.. మలి వయసులో మరొకదాని వినియోగం ఎక్కువుంటుంది. ఇలా వయసుకు తగ్గట్టు తీసుకునే పౌష్టికాహారం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి. శరీరంలోని విటమిన్లు, ఖనిజ లవణాలు కోల్పోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి విటమిన్లు, ఖనిజ లవణాలు లభించే ఆహార పదార్ధాల మోతాదు పెంచుకోవాలి.
ముఖ్యంగా శరీరం కోల్పోయే క్యాల్షియం, విటమిన్ B6, విటమిన్ B 12, విటమిన్ D, మెగ్నీషియం, పొటాషియం లాంటి వాటిని ఆహారం ద్వారా తిరిగి భర్తీ చేసుకోవాలి. విటమిన్ B6 మన శరీరంలో క్రిములతో పోరాడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వయసు పెరుగుతున్న వారిలో బి6 విటమిన్ వాడకం కూడా పెరుగుతుంది. కాబట్టి పెద్ద వయసులో ఉన్న వారు బి6 అధికంగా లభించే లివర్ లేదా ఫ్యాటీ ఫిష్ తినాలి. అలాగే B12విటమిన్ కూడా రక్తనాళాలు, నరాలు సరిగ్గా పని చేయడానికి ఉపకరిస్తుంది. ఇది కూడా ఎక్కువగా మాంసాహారంలో దొరకుతుంది.
మన వయసును బట్టి పోషకాలు తీసుకుంటే మాలి వయసులో ఆరోగ్యకరంగా జీవనం సాగించవచ్చు. విటమిన్ D శరీరంలోని ఎముకలు క్యాల్షియంను శోషించుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాదు కండరాలు, నరాలు, వ్యాధినిరోధక వ్యవస్థ సరిగ్గా పని చేసేందుకు కూడా చాలా అవసరం. ఇది ఎక్కువగా సూర్యకిరణాల నుంచి మనకు లభిస్తుంది. కానీ వయసు పెరిగిన వారు సూర్యకిరణాల నుంచి గ్రహించిన దాన్ని విటమిన్ డి గా మలచుకోలేరు. ఐతే అలాంటి వారు విటమిన్ డి కోసం.. సాల్మన్ చేపలను ఆహారంగా తీసుకుంటే మేలు జరుగుతుంది.
వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో క్యాల్షియం స్థాయి తగ్గుతుంది. తద్వారా ఎముకలు పెలుసుగా తయారై విరిగిపోయే అవకాశం ఉంది. ఇది ఆస్టియో పోరోసిస్ వ్యాధికి దారి తీయవచ్చు. క్యాల్షియం తగ్గిపోవడం వల్ల మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కుంటారు. కాబట్టి వయసు పైబడిన వారు క్యాల్షియం ఎక్కువగా లభించే పాలు, పెరుగు, చీజ్ లాంటి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి.
రీరానికి ముఖ్యంగా కావాల్సింది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. కళ్లు, మెదడుకు ఇవి చాలా మేలు చేస్తాయి. వయసు పెరుగుతున్న సమయంలో వచ్చే అల్జీమర్స్, ఆర్థ్రరైటిస్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మనకు సాల్మన్ ఫిష్, వాల్ నట్స్, కెనోలా ఆయిల్, ఫ్లాక్ సీడ్స్ నుంచి పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియం కూడా శరీరానికి చాలా అవసరం. దీని వల్ల రక్తంలోని చక్కెర స్థిరంగా ఉంటుంది. శరీరం స్వతహాగా ప్రొటీన్ తయారు చేసుకోవడానికి మెగ్నీషియం చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకు తృణ ధాన్యాలు, ఆకు కూరల్లో ఎక్కువగా లభిస్తుంది. అందుకే వయసు పైబడిన వారు వీటిని ఎక్కువగా తీసుకోవాలి.
పొటాషియం శరీరంలోని దాదాపుగా అన్ని అవయవాలు సరిగ్గా పని చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ రాకుండా చేస్తుంది. రక్తపోటు అధికం కాకుండా చూసుకుంటుంది. ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా పోటాషియం రక్షిస్తుంది. ఇది ఎక్కువగా మనకు అరటి పండ్లు, పాలు, పెరుగు, పాలకూర నుంచి లభిస్తుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు ఎప్పుడూ సహజ సిద్ధంగానే తీసుకోవడం మంచిది. ఆహారం పదార్ధాల నుంచే వాటిని మన శరీరానికి అందించేలా చూడాలి. చాలా మంది పిల్స్ రూపంలో తీసుకోవాలని భావిస్తారు. ఇది మంచిది కాదు. కొంత సప్లిమెంట్ కోసం మాత్రమే పిల్స్ ఉపయోగించాలి.