ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతున్న మాట బయాప్సీ. శరీరం కణజాలాన్ని మరింత దగ్గర పరిశీలించడానికి, ప్రాథమిక పరీక్షలో భాగంగా శరీరం నుంచి కొంత భాగాన్ని సేకరించడమే బయాప్సీ. ఈ పరీక్షలు నిర్వహించడానికి బయాప్సీ చేసినప్పుడు శరీరం కొన్ని ఇబ్బందులు సాధారణంగానే ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
మానవ శరీరం నిర్మితమైన క్రమంలో కణజాలం ఎంతో కీలకమైనది. ఓ విధంగా చెప్పాలంటే కణజాలంతోనే శరీరం నిర్మితమైంది. అలాంటి శరీరానికి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ముఖ్యంగా కాన్సర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యులు బయాప్సీకి సిఫార్సు చేస్తారు. అంటే శరీరంలోని కొంత భాగాన్ని తీసుకుని పరీక్షలకు పంపిస్తారు. కేవలం కాన్సర్ కోసమే కాదు, ఈ బయాప్సీ పరీక్షలు అనేక అనారోగ్య సమస్యల నిర్థారణకు ఉపయోగపడుతుంది. కొన్ని సమయాల్లో సాధారణ అవయవ భాగాన్ని సైతం బయాప్సీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఒక్క సారి కాన్సర్ నుంచి విముక్తి లభించిన తర్వాత, ఇతర భాగాలకు వ్యాప్తి చెందిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయి.
ఎక్కువ సమయాల్లో బయాప్సీని ఒక అనారోగ్య సమస్యను నిర్థారించడానికి లేదా దానికి ఎలాంటి చికిత్స అవసరం అనే అంశాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా బయాప్సీ చేయడానికి పదునైన పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా తక్కువ మొత్తంలో కణజాలాన్ని సేకరించడానికి మాత్రమే ప్రయత్నం జరుగుతుంది. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఎక్కువ మొత్తంలో కణజాలం అవసరం అవుతుంది.
బయాప్సీ అంటే ఏమిటి ఏయే సందర్భాల్లో బయాప్సీ చేస్తారు..?
బయాప్సీలో ప్రధానంగా వినియోగించేది సూది బయాప్సీ. అంటే సూది ద్వారా కణజాలాన్ని సేకరిస్తారు. అదే విధంగా శరీరం లోపలి భాగాల నుంచి కణజాలాన్ని సేకరించాల్సిన పరిస్థితుల్లో సిటీ స్కాన్ ద్వారా కచ్చితమైన ప్రదేశం నుంచి శరీర భాగం ముక్కను సేకరించడానికి సీటీ గైడెడ్ బయాప్సీ ఉపకరిస్తుంది. సరైన ప్రదేశాన్ని కనుగొనేందుకు అల్ట్రాసౌండెడ్ బయాప్సీ కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. అదే విధంగా అత్యంత కష్టమైన వాటిలో ఎముక బయాప్సీ కూడా ఒకటి. సీటీ స్కాన్ టెక్నిక్ ద్వారా అర్థోపెడిక్ సర్జన్ ఈ బయాప్సీని నిర్వహిస్తారు. ఎముక మజ్జను సేకరించడానికి కటి ఎముకలో ఓ పెద్ద సూదిని ప్రవేశపెట్టి ఎముక మజ్జ బయాప్సీ చేస్తారు. దీని ద్వారా లుకేమియా, లింఫోమా లాంటి వ్యాధుల నిర్థారణ జరుగుతుంది.
ఒక సూదిని పొట్ట మీదుగా కాలేయంలోకి చొప్పించి కాలేయ భాగాన్ని సేకరించడాన్ని కాలేయ బయాప్సీగా చెబుతారు. అదే విధంగా కిడ్నీ బయాప్సీ కూడా చేస్తారు. ప్రోస్టేట్ బయాప్సీ కూడా ఇదే మార్గంలో జరుగుతుంది. చర్మం బయాప్సీ చేయడానికి పంచ్ బయాప్సీ ప్రధానమైన పద్ధతి. చర్మ కణజాలం నుంచి స్థూపాకార నమూనాను తీసుకోవడానికి గుండ్రంగా ఉండే బ్లేడ్ ను ఉపయోగిస్తారు. కొన్ని సమయాల్లో లాపరోస్కోపిక్ ద్వారా కణజాలం ఎక్కువ భాగాన్ని సేకరించేందుకు సర్జికల్ బయాప్సీకి కూడా వైద్యులు సిఫారసు చేయవచ్చు.
కణజాలం పొందడం ఎంత కష్టం అనే అంశాన్ని బట్టి బయాప్సీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాన్సర్ నిర్థారణం కోసం చాలా బయాప్సీలు చేయాల్సిన అవసరం రావచ్చు. ఆ సమయంలో నొప్పి పుట్టకుండా తిమ్మిరి ఇంజక్షన్ చేస్తారు. అది కొంత వరకూ నొప్పి లేకుండా చేస్తుంది. చాలా సందర్భాల్లో మత్తు మందు ఇచ్చి కూడా బయాప్సీ చేయవలసి రావచ్చు. అలాంటి పరిస్థితే గనుక ఉంటే ఆ తర్వాత వెంటనే నడవడం, వాహనాలు నడపడం లాంటివి మానుకోవాలి.
బయాప్సీ చేసిన ప్రదేశంలో కొంత సమయం తర్వాత కచ్చితమైన నొప్పి వస్తుంది. అయితే దానికి ఇష్టం వచ్చినట్లు మందులు వాడకుండా, వైద్యులు సూచించిన మందులు మాత్రమే తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే బయాప్సీ చేసిన తర్వాత వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకోవడం, వారి పర్యవేక్షణలో ఉండడం లాంటివి చేయాలి. సాధారణంగా బయాప్సీ గురించి తెలియడానికి ఓ వారానికి పైగా సమయం పడుతుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి మరో బయాప్సీ కూడా చేయవలసి రావచ్చు. అందుకే ఇలాంటి పరీక్షలు జరిగేటప్పుడు పూర్తిగా విశ్రాంతి దశలో ఉండడం, వైద్యుల పర్యవేక్షణలో ఉండడం ముఖ్యం. ఒక్కసారి బయాప్సీ పూర్తై సమస్య నిర్థారణ అయిన తర్వాత పరిస్థితిని బట్టి వైద్యుని సలహా మేరకు నిత్య కార్యక్రమాలకు ఉద్యుక్తం కావచ్చు. ఏయే పరిస్థితుల్లో ఎలాంటి బయాప్సీ అవసరం అవుతుందో, బయాప్సీ తర్వాత ఎదురయ్యే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో. దీని పట్ల అవగాహానతో మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోండి.