Kids Health : చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..!

By manavaradhi.com

Published on:

Follow Us
About Kids Health Information

ప్రతీ వ్యక్తి జీవితంలో బాల్యం ఒక మధురానుభూతి. వ్యక్తిగా ఎంత ఎదిగినా బాల్యం ముద్ర అతనిని విడిచిపెట్టదు. చిన్ననాటి ఆటలు, పాటలు మొదలుగునవన్నీ మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి బాల్యాన్ని ఎంతో పదిలం చేయాలి. ఇంట్లోని పెద్దలు… చిన్న పిల్లల్ని ఓ కంటకనిపెడుతూ జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు సంభవిస్తే… ప్రమాదం అని తెలియకుండా కొని తెచ్చుకునేవి మరొకొన్ని .

చిన్న పిల్లలు అల్లరి చేయడమన్నది సాధారణమైన విషయం. పిల్లలు చేసే ఆల్లరిని పట్టించుకోవలసిన అవసరం లేదు. పిల్లల అల్లరి మితిమీరినా, ఆ అల్లరిని భరించలేకపోయినా… ఆ అల్లరిని ఓ సమస్యగా భావించాలి. మన ఇంట్లోనే ఉన్నారు కదా అని పిల్లల్ని వదిలేస్తే… పలు రకాల ప్రమాదాల బారిన పడే అవకాశముంది. చిన్నారులను వేడి వస్తువుల దగ్గరకు రానీయకుండా, వంటింట్లో పరుగులు తీయకుండా చూడాలి. స్నానాకిని పెట్టిన వేడి నీళ్ళతో ఆటలాడుతూ చేతులు కాల్చుకుంటారు. ఇలాంటి సమయంలో వెంటనే పిల్లల చేతులు మీద ధారగా చన్నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో తడిపిన బట్టను చర్మం మీద ఉంచి, వెంటనే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్ళాలి. చిన్న పిల్లలకు అందనంత ఎత్తులో వేడి కుక్కర్‌ను, వేడి పాత్రలను, బాణలిలాంటి వాటిని ఉంచాలి. డైనింగ్‌ టేబుల్‌ మీద టేబుల్‌ క్లాత్‌ను ికిందకు వేలాడుతున్నట్లుగా వేయకూడదు. పిల్లలు ఆ టేబుల్‌ క్లాత్‌ను లాగి, టేబుల్‌ మీద ఉం చిన పాత్రలను, వేడి పదార్థాలను మీద పడవేసుకునే ప్రమాదముంది.

చిన్న పిల్లలకు ఊరికే కూర్చోవడం ఇష్టముండదు. ఎప్పుడూ గెంతుతూ, ఆడుతూ ఉంటారు. నేలమీద, మెట్ల మీద నుంచి ఎత్తుగా ఉండే అరుగుల మీద నుంచి జారిపడి దెబ్బలు తగుల్చుకోవచ్చు. దెబ్బ తగిలిన నొప్పి కంటే… భయంతోనే పిల్లలు ఏడుస్తారు. పిల్లలను భయపడవద్దని బుజ్జగిస్తూ, ఏం జరిగిందో.. ఎక్కడ ఏవిధంగా పడిందీ.. దెబ్బ ఎక్కడ తగిలిందీ.. తెలుసుకోవాలి. చర్మం చీరుకుపోయి రక్తం వస్తుంటే డెట్టాల్‌ నీటితో చర్మాన్ని శుభ్రంగా కడగాలి. టించర్‌ను దూదితో అద్దాలి. రక్తం ఆగకుండా వస్తుంటే తడిబట్టతో కొంతసేపు నొక్కి ఉంచాలి. ఆ తర్వాత వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి చికిత్స ఇప్పించాలి.

పెద్దల నిర్లక్ష్యం, అశ్రద్ధ, మతిమరుపు వల్ల కూడా చిన్నారులకు పదునైన వస్తువులు కోసుకునే ప్రమాదం వుంది. కూరలు తరిగే కత్తిపీట, చాకు, కత్తెర, బ్లేడు లాంటి పరికరాలను వాడిన తర్వాత వాటిని పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలి. పిల్లలు ఆడే ఆట వస్తువుల వల్ల కూడా వారికి చర్మం కోసుకుని లోతుగా దిగే ప్రమాదం ఏర్పడవచ్చు. పదునుగా వుండే ఆట వస్తువులు, రేకులున్న ఇనుప బొమ్మలు, మేకులు, స్క్రూలు లాంటివి ఉన్న బొమ్మలు పిల్లలకు ఆటవస్తువులుగా కొనివ్వకూడదు. గాజు సీసాలు, గాజుపాత్రలు పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచాలి. పొరపాటుగా పిల్లలు కోసుకుని నెత్తురు కారుతుంటే, చల్లటి నీటితో తడిపిన బట్టను చుట్టాలి. ఐస్‌ ముక్కలతో ఒత్తిపెట్టి ఉంచితే రక్తం కారటం ఆగిపోతుంది. లోతుగా కోసుకుంటే! ఆ భాగాన్ని ఎత్తుగా వుంచి, చల్లటి నీటితో తడిసిన బట్టను ఉంచాలి. వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి చూపించి, వైద్య సలహా తీసుకోవాలి.

మందులు, క్లీనింగ్‌ లోషన్స్‌ పిల్లలకు అందనంత ఎత్తుగా ఉంచాలి. పిల్లలు ఏమైనా మందులు తాగినా, మందుబిళ్ళలు తిన్నా వాటిని కక్కించాలని, ఉప్పునీళ్ళు తాగించడం, మంచినీళ్ళు ఎక్కువగా తాగించడం చేయకూడదు. అలా చేసినట్లయితే కడుపులో చేరిన మందులు, వెంటనే రక్తంలో చేరే ప్రమాదం ఉంది. బిడ్డకు ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. తక్షణమే వైద్య సహాయం పొందడం చాల అవసరం. కీటకాలను చంపే మందులను కూడా పిల్లలకు అందకుండా చూడాలి. ముక్కు, చెవిలో వేలు పెట్టి కెలకడం పిల్లలకు సాధారణ అలవాటు. ముక్కులోని ఎండిన పొక్కుల్ని తీయడానికి ప్రయత్నించడం ఓ చెడు అలవాటు. దీని మూలంగా ఇన్ఫెక్షన్స్, రక్తస్రావం మొదలైన ప్రమాదాలు జరుగుతాయి. ముక్కు నుంచి రక్తస్రావం జరగడం కూడా సామాన్యమైంది. జలుబు, ముక్కు దిబ్బడ, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లలో కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు లేదా అలర్జీ వలన కూడా ఇలా జరగవచ్చును. పిన్నీసులు, ఇతరత్రా ఇనుప వస్తువులు చెవిలో పెట్టుకోకుండా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ముక్కు, చెవులలో పెట్టుకునే వివిధ రకాల వస్తువులు లోపల అడ్డంపడి తొలగించేందుకు ఒక్కోసారి శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

నట్టింట్లో పిల్లలకు సంభవించే ప్రమాదాల జాబితాలో స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చి చేరాయి. స్మార్ట్‌ఫోన్లను చిన్నపిల్లలు అతిగా ఉప‌యోగిస్తే మెదడులో చిన్న చిన్న కణితలు ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే పిల్లల్లో మెల్లకన్ను వ‌చ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు సెలవిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను అదేప‌నిగా చూడ‌డం వ‌ల్ల ఈ ప్రమాదానికి గుర‌య్యే అవ‌కాశం ఉంటుందని గుర్తెరగాలి.

Leave a Comment