పళ్లను బ్రష్‌తో తోమాలంటే మనలో చాలా మంది బద్దకిస్తుంటారు. పళ్లతోపాటు చిగుళ్లు, నాలుకను శుభ్రంగా ఉంచుకొంటేనే నోరు శుభ్రంగా ఉంటుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్య వచ్చినట్టయితే దంతాలు పుచ్చిపోయి ఊడిపోవడమేకాకుండా చిగుళ్ల వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మనలో చాలా మందికి ఓరల్ హైజీన్ గురించి అసలే తెలియదు. మంచంలో నుంచి నిద్రలేవగానే బాత్రూంలోకి వెళ్లి పరపరా పండ్లు తోమడం ఒక్కటే తెల్సు. అలా కాకుండా నోటి శుభ్రత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓరల్ హైజీనిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. నోట్లో బ్యాక్టీరియా వల్ల చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది. చిగుళ్ళ వాపు నోట్లో దంతా మద్య పాచి కట్టడం ద్వారా ఏర్పడుతుంది.
రెగ్యులర్ బ్రష్ తో దంతా మద్య పాచిని తొలగించకపోవడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరిగి, చిగుళ్ళు వాపు , రక్తస్రావం జరగుతుంది. పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నట్లయితే, అది బ్రష్ చేసుకోవడం వల్లనే అని అపోహ పడకండి. చిగుళ్ల అనారోగ్యం వల్లనే రక్తం వచ్చే అవకాశాలున్నాయి. ల్యుకేమియా సమస్యతో బాధపడేవారిలో, రక్తం గడ్డకట్టని వారిలో, మధుమేహ సమస్యతో బాధపడేవారిలో, ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారిలో, సిర్రోసిస్ వ్యాధికి గురైనవారిలో చిగుళ్ల నుంచి రక్తం కారడం సాధారణంగా కనిపిస్తుంది.
చిగుళ్లకు సమృద్ధిగా రక్త సరఫరా జరగడం వలన ఎర్రగా మాంసపు ముద్దలుగా కనిపిస్తాయి. అయితే ఏ ఆచ్ఛాదనా లేకుండా ఉండే చిగుళ్లు బ్రషింగ్ వలన రేగి రక్తస్రావమవుతుంది. దంతాలను సరిగ్గా శుభ్రపరచుకోనందు వల్ల క్రమంగా పళ్ల మీద గార ఏర్పడి గట్టిగా తయారై సున్నితమైన చిగుళ్లకు హాని కలిగించి తద్వారా రక్తస్రావానికి కారణమవుతుంది. ఏ రకమైన ప్రేరేపణలూ లేకుండా దానంతట అదే రక్తస్రావమవుతుంటే అంతర్గత కారణాలను అలా పక్కకు పెడితే, చిగుళ్లకు పట్టిన గార గురించి ఆలోచించాలి. పళ్ల మధ్యలో బ్రష్ చేరలేని చోట ఉండే పాచిని తొలగించడానికి ఫ్లాసింగ్ చేసుకోవాలి. చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకి దీర్ఘకాలం కొనసాగినట్లయితే చిగుళ్లు, వాటికి ఆధారాన్నిచ్చే దవడ ఎముకలు సైతం పాడైపోయే అవకాశం ఉంది. దీనిని జింజివైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారు బ్రష్ చేసుకున్నప్పుడు రక్తస్రావం కావచ్చు. ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండటాన్ని ఫెరియోడాంటైటిస్ అని పిలుస్తారు. దీని కారణంగా చిగుళ్లలో పుండ్లు ఏర్పడుతాయి. దంతాలు దూరంగా జరుగుతాయి. బ్రష్ చేసుకొన్నప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది.
అందుకని బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడాలి. కిందవరసలో చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోవాలి. బ్రష్‌తో పళ్లు తోముకున్న తరువాత చూపుడు వేలుతో చిగుళ్ళను మృదువుగా మర్ధించినట్లు చేయాలి. ఇది చిగుళ్ళకు రక్త ప్రసరణను పెంచేందుకు, దంతాల ఆరోగ్యం మెరుగయ్యేందుకు ఎంతో తోడ్పడుతుంది. రక్తస్రావం నిలిచిపోతుంది కూడా. రక్తం గట్టిపడేందుకు దోహదపరిచే కొన్ని రకాల మందులను వాడటం వల్ల కూడా చిగుళ్ల నుంచి రక్తం కారవచ్చు. దంతాలకు బలం చేకూర్చే సమతుల పోషకాహారం తీసుకోవాలి. సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులను వాడే అలవాటును పూర్తిగా మానేయాలి.
చిగుళ్ల వ్యాధులు ముదిరిపోయి పంటి ఎముక వరకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే గానీ మనం నోటి శుభ్రతపై దృష్టిపెట్టం. అలాకాకుండా నిత్యం ఓరల్ హైజీన్‌కు కొంత సమయం కేటాయించాలి. దంతాలతో పాటు చిగుళ్లు కూడా ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.