ఎంతటి ఉన్నతమైన హోదాలో ఉన్నా, ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నా నిద్ర ఒక్కటి కరువైతే అన్నీ ఉండి ఏమీ లేనట్లే. ఎందుకంటే నిద్రలేమితో మొత్తం జీవక్రియలన్నీ కుంటుపడతాయి. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ పూర్తిగా వెనకబడతారు. ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్యతో వచ్చే తంటాయే ఇది. ఏనాడూ కంటినిండా నిద్రలేకుండా చేసే ఈ వ్యాధి వల్ల రోగి క్రమంగా డిప్రెషన్‌లోకి జారిపోవడమే కాదు, ఒక్కోసారి శ్వాస అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
జీవితాన్ని దుర్భరం చేయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదకర వ్యాధి ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య. అయితే చాలా మందికి తమకు ఆ సమస్య ఉన్నట్లు తెలియదు. దాంతో నిద్రలో మధ్యమధ్యలో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోయి మళ్లీ మామూలై పోతుంది. ఇలాంటి వారికి తమకు ఓఎస్ఏ సమస్య ఉన్నట్లు తెలియదు. మరికొందరిలో ఇది కొన్ని క్షణాల నుంచి కొన్ని నిమిషాల దాకా కొనసాగవచ్చు. ఇలాంటి వారికి గంటకు 10 నుంచి 30 సార్లు నిద్రాభంగం జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ నిద్రలోకి జారినా పెద్దగా గురక వస్తుంది. ఇలా శ్వాస ఆగిపోవడానికి, శ్వాసనాళాలు పాక్షికంగానో, మొత్తంగానో తమ ప్రక్రియలో విఫలం కావడమే దీనికి కారణం. ఈ వైఫల్యం నాసికా వాహికల నుంచి, హైపోపారింక్స్ దాకా ఎక్కడైనా జరగవచ్చు.
ఈ ఓఎస్‌ఏ సమస్య ఎవరికైనా రావొచ్చు. కాకపోతే పురుషుల్లో రెండింతలు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని రుగ్మతలు ఉన్నవారికి ఈ సమస్య చాలా తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో స్థూలకాయం, అధిక రక్తపోటు, శ్వాస నాళాలు చిన్నవిగా ఉండడం, నాసికా రంధ్రాలు ముడుచుకుపోవడం, మధుమేహం వీటితో పాటు పొగతాగడం, మద్యపానం వంటివి ప్రధాన కారణం. అంతేకాదు జన్యుపరమైన కారణాలు, కుటుంబసభ్యులు, రక్తసంబంధీకుల్లో ఉంటే కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
అలర్జీల సమస్య ఉన్నవాళ్లలో కూడా అడినాయిడ్ లేదా టాన్సిల్స్ సమస్యలు వస్తాయి. పదే పదే ఇన్‌ఫెక్షన్లు రావడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. ఈ వ్యాధికి లోనయ్యే వారిలో 18 నుంచి 60 ఏళ్ల వయస్కులే ఉన్నారు. వైద్య చికిత్సలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు.
ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లక్షణాలు అనేకం పగటి పూట అతిగా నిద్రించడం, పెద్దగా గురక పెట్టడం, నిద్రా సమయంలో శ్వాసపరంగా పదేపదే అంతరాయం ఏర్పడటం. శ్వాస తీసుకోవడం కష్టమై హఠాత్తుగా మెలకువ రావడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటితో పాటు మేల్కొన్నప్పుడు గొంతు ఎండిపోవడం లేదా గొంతు నొప్పిగా ఉండడం, ఛాతీ నొప్పితో మెలకువ రావడం, ఉదయం లేవగానే తలనొప్పి అనిపించడం, రోజంతా ఏ విషయం మీదా మనసు లగ్నం చేయలేకపోవడం, డిప్రెషన్, అసహనం వంటి మానసిక స్థితికి లోనుకావడం వంటి లక్షణాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి.
ఈ సమస్య మరీ తీవ్రమైనప్పుడు వైద్య చికిత్సలు తప్పనిసరి. ఒకవేళ ఈ సమస్య తీవ్రంగా లేకపోతే కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా అంటే శరీర బరువు తగ్గించుకోవడం .. పొగ తాగడం, మద్యపానం, నిద్రమాత్రలు వేసుకోవడం, మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం మానడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్లీప్ అప్నియా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ సమస్య నుంచి విముక్తి కలిగించడంలో అత్యాధునికమైన మాండిబులార్ రీ పొజిషనింగ్ డివైస్ గొప్పగా ఉపయోగపడుతోంది. జీవితాన్ని దుర్భరం చేయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ఈ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉంటూ ఈ సమస్యకు దూరంగా ఉండండి.