మధుమేహం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మధుమేహం కారణంగా శరీరంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి వీరికి ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువ. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు వ్యాయామం చేయడం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది.
వ్యాయామం ఎవరికైనా అవసరమే. మధుమేహులకు ఇది మరింత అవసరం. మధుమేహ నియంత్రణలో మందులు, ఆహార నియమాల మాదిరిగా వ్యాయామమూ ఎంతగానో తోడ్పడుతుంది. వ్యాయామం అనేది అల్టిమేట్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యాయామం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు. వర్కౌట్స్ తప్పనిసరిగా చేయాలి. ఇవి చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గిపోతుంది. ఎనర్జీ పెరిగిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల నిద్ర మెరుగవుతుంది.
వాతావరణంలో తాజా గాలి తీసుకోవడానికి నడకకు మించిన మార్గం లేదు. మధుమేహం ఉన్నవారు ఉదయం పూట నడక చేయడం వల్ల ఎంతో మంచిది. నడక వల్ల ఒత్తిడి దానంతట అదే తగ్గుతుంది. వారానికి మూడునాలుగుసార్లు బ్రిస్క్ స్ట్రోల్ అరగంట పాటు చేయాలి. బ్రిస్క్ స్ట్రోల్ అంటే పెద్ద వ్యాయామం కాదు. మన నడకనే వేగంగా మారిస్తే సరిపోతుంది. కిరాణాకొట్టు లేదా పాలప్యాకెట్ తీసుకురావాలన్నా వెహికిల్ లేనిది బయటికి వెళ్లనివారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. డ్రైవింగ్ అవసరం లేకుండా తమ పనులు తాము చేసుకోవాలి. నడక ఒక అలవాటుగా చేసుకుంటే మంచిది.డాన్స్ కూడా ఒకలాంటి వ్యాయామమే. కనీసం 25 నిమిషాల పాటు డాన్స్ చేస్తే చాలు. వారానికి మూడు రోజులు డాన్స్ చేస్తే మన శరీరానికి కావాల్సినంత ఎనర్జీ రావడమే కాదు రక్తంలో గ్లుకోజ్ నిల్వలను తగ్గించవచ్చు. మధుమేహంతోపాటు గుండె వ్యాధులు, మానసిక ఒత్తిడి ఉన్నవారు డాన్స్ చేస్తే క్యాలరీలు బర్న్ అవుతాయి.
రక్తంలో గ్లూకోజు మోతాదుల నియంత్రణకు వ్యాయామం తోడ్పడుతుంది. మందులు వేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేసేవారిలో బరువు తగ్గకపోయినా కూడా మూడు నెలల కాలంలో గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ 0.7% మెరుగుపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. స్విమ్మింగ్ అనేది ఒకరకమైన ఎరోబిక్ ఎక్సర్ సైజు. కీళ్ల మీద ఎటువంటి ఒత్తిడి పడదు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి కదులుతాయి. దీనవల్ల కండరాల్లో ఒకలాంటి చలనం కలుగుతుంది. అంతేకాదు కొవ్వును కరిగించేస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. చెడు కొవ్వు తగ్గి మంచి కొవ్వు పెరగడానికి స్విమ్మింగ్ మంచిది. సైకిల్ తొక్కడం వల్ల మధుమేహ రోగులకు ఉపశమనం లభించినట్టే. రోజుకు 30 నిమిషాలు వారానికి మూడు నుంచి ఐదుసార్లు సైకిల్ తొక్కితే సరిపోతుంది. హార్ట్ రేటు పెరుగుతుంది. రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. బరువు తగ్గుతారు. మోకాల్లు దెబ్బతినవు.
కేలరీలను బర్న్ చేయడానికి ఉత్తమ మార్గాల్లో మెట్లు ఎక్కడం. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ను తగ్గించుకోవచ్చు. రక్తంలో చక్కెరశాతం తగ్గాలంటే బలం పెరిగే పనులు చేయాలి. అలాగే కండరాలు బలంగా తయారవ్వాలంటే ఎముకలు బలంగా ఉండాలి. కండరాలు ఎముకలు బలంగా ఉన్నప్పుడు శక్తి సమకూరుతుంది. వారానికి రెండుసార్లు చిన్న చిన్న బరువులు ఎత్తితే వ్యాయామం చేసినట్టవుతుంది. పుషప్స్ వంటివి చేయాలి. సంప్రదాయ వ్యాయామం చేయాల్సిన పనిలేదు. ఆందోళన చెందకుండా తోటపని చేయాలి. ఇది కూడా ఒకరకమైన ఎరోబిక్స్ వంటిదే. నడిచే సమయంలో రక్తం ప్రవహిస్తుంది.
తోటపని చేస్తే శరీరంలో సక్రమంగా రక్తం ప్రవహించడమే కాకుండా మోకాళ్లు, కీళ్లకు మంచి వ్యాయామం చేసినట్టవుతుంది. కండరాలు పెరుగతాయి. ఎముకకు బలం చేకూరుతుంది. తోటపని వల్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. యోగా వల్ల కూడా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. యోగా వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. శ్వాస సంబంధ వ్యాధులు సమసిపోతాయి. వ్యాయామం విషయంలో మధుమేహులు తగు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. డాక్టర్ సలహా మేరకు ఎప్పుడెప్పుడు, ఎలాంటి వ్యాయామాలు చేయాలన్నది నిర్ణయించుకోవాలి.
ఇన్సులిన్ తీసుకునేవారైతే ఇంకాస్త ఎక్కవ జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం చేయటానికి ముందు గ్లూకోజు స్థాయులను పరీక్షించుకోవటం మంచిది. గ్లూకోజు 100 ఎంజీ/డీఎల్ కన్నా తక్కువుంటే ఏదో ఓ పండు ముక్కో, చిన్న చిరుతిండో నోట్లో వేసుకుంటే గ్లూకోజు స్థాయులు మరీ దిగువకు పడిపోకుండా (హైపోగ్లైసీమియా) చూసుకోవచ్చు. మరో 30 నిమిషాల తర్వాతా గ్లూకోజును పరీక్షించుకోవాలి. దీంతో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉంటున్నాయా? లేదా? అన్నది తెలుస్తుంది.
మధుమేహంతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతైనా అవసరం. రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయటం మంచిదన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా గుండె వేగాన్ని పెంచే ఏరోబిక్ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. వ్యాయామం మూలంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండటం దగ్గర్నుంచి గుండె జబ్బుల ముప్పు తగ్గటం వరకూ రకరకాల ప్రయోజనాలు చేకూరుతాయి.