మనిషి శరీరంలోని సున్నితమైన అవయవాల్లో కళ్లు ముఖ్యమైనవి. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా! రోజూ ప్రపంచాన్ని చూడగలుగుతాం. అందుకే కళ్ల రక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇక రోజురోజుకూ పెరుగుతోన్న టెక్నాలజీ వినియోగం మనకు తెలియని శాపంగా మారుతోంది. గంటల తరబడి డిజిటల్ పరికరాలకు అతక్కుపోవడం.. ఆ కారణంగా దృష్టిలోపం బారినపడటం ఇటీవలీ కాలంలో మరింత ఎక్కువైంది. చాలా మంది కళ్ళు మసకబారుతున్నాయి అంటున్నారు.
మన దృష్టి ఎప్పుడూ మన అదుపులోనే ఉండాలి. చూడడంలో ఏ మాత్రం సమస్య ఎదురైనా, కళ్ళజోడు వాడితే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అస్పష్టమైన దృష్టి కేవలం కంటిలో సమస్య మాత్రమే అనుకోవడానికి వీలు లేదు. అది ఇతర సమస్యలకు కూడా కారణం కావచ్చు. తరచూ ఈ పరిస్థితి ఎదురౌతుందంటే మాత్రం అనేక ఇబ్బందులు ఉన్నట్లు గమనించుకోవాలి. ఈ సమస్య ప్రధానంగా చెప్పాలంటే డయాబెటిస్ కావచ్చు. కాలక్రమేణా రక్తంలో పెరిగిపోతున్న చక్కెర కారణంగా రెటీనాలోని రక్తనాళాలు వాపునకు దారి తీయవచ్చు. దీని వల్ల చూపు మందగించడానికి ఆస్కారం ఉంది. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా బయట పడడానికి ఆస్కారం ఉంది.
కంటిలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా వస్తువులు రెండుగా కనిపించవచ్చు. ఈ సమయంలో మైకము, ముఖం లాగినట్లు ఉండడం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, చేతిలో తిమ్మిరి లేదా బలహీనంగా ఉండడం లాంటి మసస్యలు ఎదురు కావచ్చు. అధికంగా రక్తపోటు ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చు. అందుకే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగా సమస్య ఏ తరహా లో ఉందనే విషయాన్ని కంటి డాక్టరు ద్వారా తెలుసుకుని, వీలైనంత త్వరగా పరిష్కారాన్ని పొందేందుకు ఇతర వైద్యుల్ని సంప్రదించాలి.
గర్భిణి స్త్రీలలో ఇలాంటి సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. సాధారణంగా గర్బం ధరించిన 20 వారాల తర్వాత ఈ తరహా సమస్యలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. ప్రీ ఎక్లంప్సియా మహిళలకు ఈ సమస్య ఒక్కో బిడ్డ మీద తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ప్రాణాంతకం కావడానికి ఆస్కారం ఉంది. వీరి కంట్లో మెరుపులు రావడం, మచ్చలు కనిపించడం లాంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు.
ఆందోళన , శ్వాసలో సమస్యలు, గుండె ఇష్టం వచ్చినట్లు కొట్టుకోవడం, అకస్మాత్తుగా వికారం, వాంతులు ఎదురు కావచ్చు. బొడ్డు, భుజం నొప్పిగా ఉండడం, అకస్మాత్తుగా బరువు పెరగడం, చేతుల్లో వాపు, ముఖం వాపు, తలనొప్పి రావడం లాంటి సమస్యలు ఎదురైతే ఈ ఇబ్బంది కావచ్చు. అదే విధంగా కొన్ని సమయాల్లో మైగ్రెయిన్ కూడా ఈ తరహా ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఈ సమస్య రావడానికి ముందు కూడా అస్పష్టమైన దృష్టి, కాంతిని చూడలేకపోవడం లాంటి ఎదురౌతుంది. కంటి చూపులో మరిన్ని మార్పులు సంభవిస్తాయి. మైగ్రెయిన్ సమస్యకు చికిత్స పొందడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. సోరియాసిస్ లాంటి సమస్యల్లో కూడా ఈ తరహా ఇబ్బందులు ఎదురౌతాయి. సాధారణంగా ఇది చర్మానికి వచ్చే సమస్య అయినప్పటికీ, కంటికి కూడా సమస్యలు కలిగించవచ్చు.
మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి నరాల సమస్యలు కూడా అస్ఫష్ట దృష్టితోనే మొదలౌతాయి. ఈ వ్యాధి మెదడు, కళ్ళను కలిగే నరాల వాపు కలిగిస్తుంది. ఆప్టిక్ న్యూరిటిస్ గా పిలిచే ఈ సమస్య వల్ల అస్పష్టంగా చూపు మొదలై, రంగును చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తరచూ ఒక కంటిలో మాత్రమే ఏర్పడుతుంది. దీంతో పాటు మూత్రాశయం, పేగు సమస్యలు, మైకం, అలసట, తిమ్మిరి, బలహీనత లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య విషయంలో ఎంత త్వరగా వైద్యుని సంప్రదిస్తే అంత మేలు. బ్రెయిన్ ట్యూమర్ సమస్యలు కూడా దృష్టి లోపాలతోనే ప్రారంభం అవుతాయి. మెదడులో కణితులు ఏర్పడినప్పుడు అస్పష్టమైన దృష్టితో పాటు మగత, తెలియని తలనొప్పి, వికారం, వ్యక్తిత్వంలో మార్పులు, మూర్చ, వాంతులు లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి. ప్రాథమిక లక్షణాల ఆధారణంగా పరీక్షలు చేసి, సమస్యలను నిర్థారిస్తారు.
పార్కిన్సన్ వ్యాధి ఉన్న ప్పుడు కూడా మసకగా కనిపించడం ఆరంభం అవుతుంది. కొంచెం ఇబ్బందితో కూడిన దృష్టి వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయి. చేతులు మరియు కాళ్ల మీద కూడా ఈ ప్రభావం ఉండడానికి ఆస్కారం ఉంది. అందుకే దృష్టికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు అవి ఎంత ప్రమాదకమైనవి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏదో కంటి సమస్యే అని మనం అశ్రద్ధ చేయడం వల్ల, అది క్రమంగా పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే ఏడాదికి ఓ మారు కంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎలాంటి ఇతర సమస్యలు లేకుండా బయట పడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా, మరిన్ని పెద్ద సమస్యలు ఆరోగ్యాన్ని దెబ్బ తీయడానికి ఆస్కారం ఉంది.